మృత్యుహేల
థాయిలాండ్ పడవ ప్రమాదంలో దంపతుల విషాదాంతం
గోవా బీచ్‌లో నగర డిజైనర్ మృతి
కట్టుకున్న భార్యను కడతేర్చిన భర్త
తండ్రి చేతిలో హతమైన పిల్లలకు అంత్యక్రియలు
వరుస సంఘటనలతో తల్లడిల్లిన నగరం
గోవా, థాయిలాండ్‌లలో సంభవించిన వేర్వేరు ప్రమాదాలలో నగరానికి చెందిన ముగ్గురు ప్రముఖులు మృత్యువాత పడ్డారు. మంగళవారం చోటుచేసుకున్న ఈ వరుస ఘటనలతో జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లలో విషాదఛాయలు అలముకున్నాయి. స్విమ్మింగ్‌లో అనేక అంతర్జాతీయ అవార్డులు గెలుచుకున్న జూబ్లీహిల్స్‌కు చెందిన ఇంటీరియర్‌డిజైనర్ అపర్ణాకార్వీ (44) గోవా బీచ్‌లో ఈత కొడుతూ దురదృష్టవశాత్తూ మృత్యువాత పడ్డారు. థాయిలాండ్ విహార యాత్రకు వెళ్లిన బంజారాహిల్స్‌కు చెందిన యువ పారిశ్రామికవేత్త యష్ అగర్వాల్ (27), ఆయన భార్య పంకూరి మిట్టల్ (25)లు అక్కడ జరిగిన ప్రమాదంలో మరణించారు. వారి ముగ్గురి మరణ వార్తలు వినగానే బంధువులు, స్నేహితులు, అభిమానులు పెద్ద సంఖ్యలో జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లలోని వారి ఇళ్ల వద్దకు చేరుకున్నారు. మృతుల కుటుంబీకులు, బంధువుల రోదనలు మిన్నంటాయి.
ఇదిలా ఉండగా, సట్టా ఆడొద్దని అడ్డుకున్న పాపానికి తిరుమల గిరిలో ఓ వ్యక్తి కట్టుకున్న భార్యనే కడతేర్చాడు. ఈ సంఘటన స్థానికులను కలచివేసింది. మరోవైపు తండ్రి ప్రొఫెసర్ గురుప్రసాద్ చేతిలో హత్యకు గురైన ఇద్దరు పిల్లలు విఠల్ విరించి (9), నందవిహారి (5) అంత్యక్రియల సందర్భంగా మల్కాజ్‌గిరిలో విషాదఛాయలు అలముకున్నాయి. దసరా, బక్రీద్ పండుగల ఆనందంలో ఉన్న నగర వాసులు ఈ సంఘటనలతో విషాదంలో కూరుకుపోయారు.