వరదనీటిలో చిక్కుకున్న స్కూలు బస్సు
కూకట్పల్లి ఆల్విన్ కాలనీ సమీపంలోని ధరణి నగర్లో ఓ ప్రైవేటు పాఠశాల బస్సు వరద నీటిలో చిక్కుకుంది. అందులో 40 మంది చిన్నారులు ఉన్నారు. స్థానికులు ఎంత చెప్పినా బస్సు డ్రైవర్ వినకుండా వరద నీటిలోకి బస్సును తీసుకెళ్లాడని అంటున్నారు. స్థానికులు వెంటనే అప్రమత్తమై.. పిల్లలను బస్సులోంచి దించేయడంతో పెను ప్రమాదం తప్పింది.
భారీ వర్షాల కారణంగా జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు అన్నింటికీ సెలవు ఇచ్చినా, పరీక్ష ఉందన్న పేరుతో ధరణి నగర్లోని రాఘవ కాన్సెప్ట్ స్కూలు విద్యార్థులను స్కూలు బస్సులో తీసుకెళ్లారు. ఆ ప్రాంతంలో దాదాపు నడుంలోతు నీళ్లు ఉన్నాయి. అయినా మొండిగా ఆ నీళ్లలోకి బస్సును డ్రైవర్ తీసుకెళ్లాడని స్థానికులు ఆరోపించారు. పిల్లలను జాగ్రత్తగా రక్షించి ఇవతలకు తీసుకొచ్చారు.