అవతరణ అవార్డులకు కత్తెర
- 25 నుంచి 10కి కుదింపు
- రైతులు, జర్నలిస్టులకు మొండిచేయి
- నిధుల కేటాయింపులోనూ కోత
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అవతరణ వేడుకల్లో ‘భారీతనం’తగ్గనుంది. గత మూడు దఫాలుగా భారీగా నిధులు వెచ్చించి ఉత్సవాలు నిర్వహించిన సర్కారు... తాజా కేటాయింపులో కోత పెట్టింది. గతంలో ఉత్సవాల నిర్వహణ కోసం జిల్లాకు రూ.25 లక్షల చొప్పున నిధులివ్వగా... ప్రస్తుతం రూ.10 లక్షలకు కుదించింది. ఇందులో సాంస్కృతిక కార్యక్రమాలకు రూ.5 లక్షలే ఖర్చు చేయాలని స్పష్టం చేసింది. అవతరణ వేడుకల సందర్భంగా ఇచ్చే అవార్డుల సంఖ్యను సైతం తగ్గించింది.
ఇప్పటివరకు ప్రతి జిల్లాలో 25 విభాగాల్లో అత్యుత్తమ సేవలందించిన వారికి అవార్డులు ఇచ్చేవారు. తాజాగా ఈ సంఖ్యను 10కి కుదించింది. దీంతో ఉత్తమ రైతు, జర్నలిస్టు, వైద్యుడు, అడ్వకేట్, మాజీ సైనికోద్యోగి, నృత్యకారుడు, గాయకుడు, ఆధ్యాత్మిక గురువు, సంగీత విద్వాంసుడు తదితర విభాగాలకు కోత పెట్టగా... ఉత్తమ మండలం, గ్రామం, మున్సిపాలిటీ విభాగాల్లో ఒక దానికి మాత్రమే అవార్డు ఇవ్వాలని సూచించింది. అదేవిధంగా వేద పండితులు, అర్చకుల్లో ఒకరికి, సామాజిక కార్యకర్త, ఎన్జీఓలో ఒకరికి, ఉపాధ్యాయుడు, ఉద్యోగి విభాగాల్లో ఒకరికి చొప్పున అవార్డు ఇవ్వనున్నారు. జిల్లాల సంఖ్య పెరగడంతో ప్రభుత్వం నిధుల కేటాయింపునకు కోత పెట్టినట్లు తెలుస్తోంది.
జిల్లాకు రూ.10 లక్షలు: చందూలాల్
రాష్ట్ర అవతరణ వేడుకల నిర్వహణకు ప్రతి జిల్లాకు రూ.5 లక్షలు ఇవ్వనున్నట్లు మంత్రి అజ్మీరా చందూలాల్ పేర్కొన్నారు. విశిష్ట కార్యక్రమాలు నిర్వహించాలనుకుంటే అదనంగా మరో రూ.5 లక్షలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అవతరణ వేడుకల ఏర్పాట్లపై శుక్రవారం సచివాలయం నుంచి కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర అవతరణ దినోత్సవ కానుకగా వృద్ధ కళాకారులకు అదనంగా రూ.500 పింఛన్ ఇవ్వనున్నట్లు చెప్పారు. ఇందుకు సంబంధించి ప్రతిపాదనలు ఈనెల 24లోగా పంపాలన్నారు. అక్టోబర్ 22న ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ఈ మేరకు జిల్లాలో భాషా పండితులు, సాహితీవేత్తలతో సమావేశం నిర్వహించి ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపాలని ప్రభుత్వ సలహాదారుడు రమణాచారి కలెక్టర్లకు సూచించారు.