
పడవ ప్రయాణం కాదు... బుడగ ప్రయాణం!
హైదరాబాద్‌కు ఓ మూసీ... ముంబైకి మీఠీ నది, అక్కడే విశాలమైన అరేబియా సముద్రం, ఢిల్లీలో యమునా నది! దేశంలోనే కాదు... ప్రపంచవ్యాప్తంగా చాలావరకూ మహానగరాల్లో నదులు, లేదంటే సుముద్రతీరం ఉన్నాయి. రోడ్డుపై వాహనాలతో వెళ్లడం కంటే నీటిపై పడవల్లో వెళ్లడం చౌక, కాలుష్యరహితం కూడా. ఇప్పుడు ఈ రెండు అంశాలను కలిపి చూస్తే... పక్కనున్న ఫోటోలేమిటన్నది ఇట్టే అర్థమైపోతుంది. అవునండి... ఇవి నీటి ట్యాక్సీలు! పడవలు, ఫెర్రీలతో అయ్యే కాలుష్యాన్ని, సమయం వృథా అవడాన్ని కూడా నివారించేందుకు ఫ్రాన్స్‌కు చెందిన ‘సీ బబుల్స్’ అనే సంస్థ వీటిని అదే పేరుతో అభివృద్ది చేసింది. ఒక్కమాటలో చెప్పాలంటే ఇది జల రవాణా కోసం ఊబర్ లాంటిది.
స్మార్ట్‌ఫోన్ ఆప్ ద్వారా పనిచేస్తుంది. ఒక్కో సీబబుల్‌లో ఐదుగురు మాత్రమే వెళ్లగలరు. కాబట్టి... ఫెర్రీ, పడవ నిండేంత వరకూ వేచి చూడాల్సిన అవసరం లేదన్నమాట. పైగా దీని డిజైన్ కారణంగా ఇది అతితక్కువ ఇంధనాన్ని వాడుతుంది. నీటి ఉపరితలంపైకి విసిరేసిన కుండ పెంకు మాదిరిగా గాల్లో ఎగురుకుంటూ వెళుతుంది. బ్యాటరీల నుంచి శక్తిని గ్రహించి ఇంజిన్ దాదాపు 240 కిలోల చోదక శక్తిని అందుకుని గంటకు 13 కిలోమీటర్ల నుంచి 56 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. సౌరశక్తి ద్వారా బ్యాటరీలను నింపుకునే అవకాశమూ ఉంది. అలెన్ థీబాల్ట్, ఆండర్స్ బ్రింగ్‌డాల్ అనే ఇద్దరు ఔత్సాహికులు అభివృద్ది చేసిన సీబబుల్‌ను ఎయిర్‌బస్, రాఫేల్ విమాన కంపెనీల్లో పనిచేసిన బోరిస్ ప్రాట్, ఫిలెప్పీ పెరియర్‌లు డిజైన్ చేశారు. వచ్చే నెలలో తొలిసారి ఈ సీబబుల్‌ను ప్యారిస్‌లో పరీక్షించనున్నారు. వచ్చే ఏడాదికల్లా మరో 10 - 15 వాహనాలను తయారు చేసి పరీక్షిస్తారు. ఆ తరువాత 15 భారతీయ నగరాలతోపాటు ప్రపంచవ్యాప్తంగా వీటిని అందుబాటులోకి తీసుకురావాలన్నది ఆలోచన. ప్రస్తుతానికి వీటిని డ్రైవర్ల సాయంతోనే నడుపుతున్నా... త్వరలోనే డ్రైవర్‌ల అవసరం లేని విధంగానూ మార్పులు చేయనున్నారు.