పక్కాగా లెక్క..! | Security Audit in North Zone | Sakshi
Sakshi News home page

పక్కాగా లెక్క..!

Published Sat, Jun 3 2017 12:10 AM | Last Updated on Tue, Aug 21 2018 9:06 PM

పక్కాగా లెక్క..! - Sakshi

పక్కాగా లెక్క..!

ఉత్తరమండల పోలీసులు సెక్యూరిటీ ఆడిట్‌కు శ్రీకారం చుట్టారు. సీసీ కెమెరాలకు ప్రాధాన్యం ఇస్తూ ఠాణాల వారీగా ఈ ఆడిట్‌

నార్త్‌జోన్‌లో ‘సెక్యూరిటీ ఆడిట్‌’
సీసీ కెమెరాలపై డీసీపీ ప్రత్యేక దృష్టి
ప్రభుత్వ, కమ్యూనిటీతో పాటు ప్రైవేట్‌వీ లెక్కింపు
జియో ట్యాగింగ్‌ ద్వారా ప్రదేశాల గుర్తింపు కెమెరాలు లేని చోట్ల  ఏర్పాటు చేసుకునేలా అవగాహన


 సిటీబ్యూరో: ఉత్తరమండల పోలీసులు సెక్యూరిటీ ఆడిట్‌కు శ్రీకారం చుట్టారు. సీసీ కెమెరాలకు ప్రాధాన్యం ఇస్తూ ఠాణాల వారీగా ఈ ఆడిట్‌ నిర్వహిస్తున్నారు. సెక్టార్ల వారీగా ఉన్న ప్రైవేట్‌ సీసీ కెమెరాలను గుర్తిస్తూ... వాటిని జియో ట్యాగింగ్‌ చేయిస్తున్నారు. గత వారం రోజుల ఆడిట్‌ నేపథ్యంలో ఈ మండలంలో 15,563 ప్రైవేట్‌ సీసీ కెమెరాలు ఉన్నట్లు గుర్తించామని డీసీపీ సుమతి ‘సాక్షి’కి తెలిపారు. కెమెరాలు లేనిచోట్ల ఏర్పాటు చేసుకునేలా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు.

ప్రైవేట్‌ వాటినీ..  
సిటీలో కేవలం ప్రభుత్వ, కమ్యూనిటీ సీసీ కెమెరాలే కాకుండా వ్యక్తిగత (ప్రైవేట్‌) సీసీ కెమెరాలు సైతం ఉన్నాయి. పలువురు తమ ఇళ్లు, దుకాణాలు, అపార్ట్‌మెంట్స్‌లో వీటిని ఏర్పాటు చేసుకుంటారు. ఇలాంటి వాటిని నేరాల నిరోధం, కేసులు కొలిక్కి తీసుకురావడానికి వినియోగించుకోచ్చని నార్త్‌జోన్‌ పోలీసులు భావించారు. ఈ నేపథ్యంలో తమ పరిధిలో ఉన్న ప్రైవేట్‌ కెమెరాలను గుర్తించేందుకు డీసీపీ ఆడిట్‌ కు శ్రీకారం చుట్టారు. దీంతో ఠాణాల్లోని ఎస్‌సైలు నేతృత్వం వహించే సెక్టార్ల వారీగా గత నెల 23 నుంచి గణన ప్రారంభించారు. ప్రతి సెక్టార్‌ను ఐదు జోన్లుగా విభజించి క్షేత్రస్థాయి సిబ్బంది ద్వారా వీటిని లెక్కిస్తున్నారు. బుధవారం వరకు జరిగిన లెక్కింపులో 15,563 ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది.

అవసరమైన ప్రాంతాల గుర్తింపు...
 ఆడిట్‌ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్న సిబ్బంది సీసీ కెమెరాలు లేని ఇళ్లనూ గుర్తిస్తున్నారు. రెండు అంతస్తులు, అంతకంటే ఎక్కువ ఫ్లోర్లతో పాటు కీలక, సున్నిత ప్రాంతాలకు ప్రాధాన్యం ఇస్తూ సీసీ కెమెరాల అవసరాన్ని గుర్తించి నివేదికలు రూపొందిస్తున్నారు. వారం రోజుల అధ్యయనంలో నార్త్‌జోన్‌లోని 12 ఠాణాల పరిధిలో 8539 నివాస సముదాయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాల్సి ఉందని గుర్తించారు. దీన్ని పరిగణలోకి తీసుకున్న పోలీసులు వీటి ఏర్పాటు ప్రాధాన్యాలను వివరిస్తూ, ప్రజల్లో అవగాహన కల్పించేందుకు చర్యలు చేపట్టారు. ఇందుకు ప్రత్యేకంగా కొన్ని వీడియోలను రూపొందించారు.

మ్యాప్‌ మీదకు‘ప్రైవేట్‌ కెమెరాలు’...
సిటీలోని అన్ని పోలీసుస్టేషన్ల పరిధిలో నేరాలు జరిగే ప్రాంతాలను డిజిటలైజ్‌ చేసినట్లే... ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్రైవేట్‌ సీసీ కెమెరాలను జియో ట్యాగింగ్‌ ద్వారా మ్యాప్‌ పైకి తీసుకువచ్చేందుకు నార్త్‌జోన్‌ పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. ఏదైనా నేరం జరిగినప్పుడు అనుమానితుల గుర్తింపు, ఆధారాల సేకరణకు ఈ విధానం ఉపయోగపడుతుందని అధికారులు పేర్కొంటున్నారు. నేరం జరిగిన ప్రాంతానికి సమీపంలో ఎక్కడెక్కడ ఎన్ని ప్రైవేట్‌ కెమెరాలు ఉన్నాయనేది మ్యాప్‌లో చూపించేలా రూపొందించనున్నారు.

ముమ్మరంగా అవగాహన
 ‘ప్రైవేట్‌ సీసీ కెమెరాలకూ ప్రాధాన్యం ఇస్తున్నాం. అవి లేని చోట్ల ఏర్పాటు చేసుకునేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నాం. ఓ నివాసం వద్ద ఏర్పాటు చేసుకునే కెమెరాల్లో ఒకటి ఐపీ, నైట్‌విజన్‌ టెక్నాలజీలు ఉన్నవి ఏర్పాటు చేయించాలని భావిస్తున్నాం. వీటిలో రికార్డు అయ్యే ఫీడ్‌ను కనీసం నెల రోజుల భద్రపరిచేలా అవగాహన కల్పించనున్నాం‘ అని పేర్కొన్నారు.
–డీసీపీ సుమతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement