
నయా గ్యాంగ్..
మానవహక్కుల పరిరక్షణ ముసుగులో అరాచకాలు సెటిల్ మెంట్లు.. బెదిరింపులు.. భూ దందాలు పోలీసులకు సైతం బ్లాక్ మెయిల్
కళ్లు చెదిరే భవంతులు అధునాతన సౌకర్యాలు పోలీసుల అదుపులో సాదత్ అహ్మద్ ఉలిక్కిపడ్డ పాండు బస్తీ
నగరంలో నయా గ్యాంగ్ పుట్టుకొచ్చింది.. సిటీలో సంచలనం సృష్టించిన స్నేక్ గ్యాంగ్‌ను తలదన్నే రీతిలో దందాలు చేస్తోంది. మానవహక్కుల సంఘం ముగుసులో అరాచకాలకు పాల్పడుతోంది. లక్షల్లో సెటిల్ మెంట్లు.. కోట్లలో సంపాదన.. సామాన్యులే కాదు పోలీసుల్ని సైతం బ్లాక్‌మెయిల్ చేస్తోంది. భూ దందాలు.. సెటిల్ మెంట్లు.. హత్యలకు సైతం తెగబడుతున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. గ్యాంగ్ స్థావరాలపై మంగళవారం రాత్రి భారీ సంఖ్యలో జీడిమెట్ల పోలీసులు దాడులు చేశారు. విస్తుపోయే అంశాలు వెలుగుచూశాయి.
ఇంటి ముందేమో హ్యుమన్ రైట్స్ బోర్డులు.. లోపల అధునాతన సౌకర్యాలు. ఇంటి ముఖ ద్వారం నుంచి కార్యాలయం వరకు 12 సీసీ కెమెరాలు.. బాంబ్ డిటెక్టర్, కార్పొరేట్ సంస్థ కార్యాలయాలను తలదన్నేలా సంస్థ కార్యాలయం.. జిమ్.. పలు వాహనాలు, విలువైన డాక్యుమెంట్లు.. దుబాయ్‌కు పంపే పాస్‌పోర్టులు.. ఇవి పోలీసుల తనిఖీల్లో వెలుగుచూశాయి.
జీడిమెట్ల పారిశ్రామిక వాడను సాయిబాబానగర్ పాండు బస్తీలో ఉంటున్న సాదత్ అహ్మద్ ఇంటర్నేషనల్ హ్యుమన్ రైట్స్ ఆర్గనైజేషన్ ‘ఎస్‌ఏ’ పేరుతో సంస్థను ఏర్పాటు చేశాడు. సమాజసేవ చేస్తున్నట్టుగా ఫోజులిస్తూ చీకటి కార్యకలాపాలకు తెరలేపాడు. ఓ ముఠాను నడుపుతూ దందాలకు పాల్పడుతున్నాడు. సాదత్ సంగారెడ్డిలో ఉండగా పలు హత్యా నేరాలు, దోపిడీలు, లూఠీల్లో తలదూర్చి అక్కడ నుంచి కుత్బుల్లాపూర్‌కు మకాం మార్చాడని పోలీసులకు ఫిర్యాదులు వచ్చాయి. ఇక్కడ నుంచే ఓ గ్యాంగ్‌ను నిర్వహిస్తూ పలు సెటిల్‌మెంట్లకు తెరలేపాడు. అటు పోలీసులను.. ఇటు సామాన్య, మధ్యతరగతి ప్రజలను.. మరో వైపు పారిశ్రామికవేత్తలను హ్యుమన్ రైట్స్ ఆర్గనైజేషన్ ముసుగులో బ్లాక్‌మెయిల్ చేసేవాడు. ఈ ముఠాపై పలు ఆరోపణలు, ఫిర్యాదులు అందాయి.
శ్రుతి మించిన ఆగడాలు.. పోలీసులపైనే పెత్తనం..
గత కొన్నేళ్లుగా పోలీసులపైనే తిరగబడేంత స్థాయికి ఎదిగాడు సాదత్. జీడిమెట్ల పీఎస్‌లో పని చేసిన ఓ ఎస్‌ఐ నే అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టించి బెదిరింపులకు దిగాడు. రూ.5 లక్షలిస్తే కేసు సెటిల్ చేయిస్తానని చెప్పి అందుకు సస్పెండైన ఓ క్రైం ఎస్‌ఐతో బేరసారాలు నడిపారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయమై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. అన్యాయంగా ఎస్‌ఐని బలి పశువు చేశారని అప్పటినుంచి సాదత్‌పై కన్నేశారు. రోజు రోజుకు మితిమీరుతున్న ఆగడాలతో పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాడు. తాజాగా ఓ కానిస్టేబుల్.. అన్న భార్య విషయంలో గొడవ పడితే 498 కేసు కింద ఇరికిస్తానంటూ సదరు కానిస్టేబుల్‌ను బెదిరించాడు. అతని వద్ద నుంచి రూ.1.70 లక్షలు గుంజినట్టు పోలీసులు గుర్తించారు. ఇలా పోలీసులను బెదిరింపులకు గురిచేస్తూ.. ఉన్నతాధికారులే తన జేబులో ఉన్నారని చెప్పేవాడు. శివారు ప్రాంతాల్లోని పలు పోలీస్‌స్టేషన్లకు నాలుగైదు కార్లలో వెళ్లి దర్జాగా వెళ్లి సీఐ స్థాయి అధికారులపై సైతం బ్లాక్ మెయిల్‌కు దిగేవాడని తెలిసింది.
అంతేకాకుండా సామాన్య ప్రజలను సైతం ముప్పు తిప్పలు పెడుతూ వచ్చాడు. భార్యాభర్తల పంచాయితీలను సెటిల్‌మెంట్ చేస్తానని చెప్పి పలువురిని లొంగ దీసుకుని బెదిరింపులకు గురిచేశారని బాలానగర్ డీసీపీ ఏ.ఆర్.శ్రీనివాస్‌కు పలువురు బాధితులు ఫిర్యాదు చేశారు. ఇలా ఇతని ఆగడాలు శృతి మించడంతో పోలీసులు పకడ్బందీగా ఏడు కేసుల్లో ప్రధాన నిందితుడిగా చేర్చి అదుపులోకి తీసుకుని రహస్య విచారణ చేపట్టారు. గతంలో ఇతని ఆగడాలపై ‘సాక్షి’లో ‘ఇక్కడా ఉన్నాయి స్నేక్ గ్యాంగ్’ అన్న కథనం ప్రచురితం కాగా అప్పట్లో చర్చానీయాంశంగా మారింది. ఈ విషయంలో కూడా పోలీసులు మరింత లోతుగా దృష్టి సారించి వేట ముమ్మరం చేశారు. ఎట్టకేలకు ముఠా సభ్యులను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో ప్రశ్నిస్తున్నారు.
భారీ బలగాలతో దాడులు..
జీడిమెట్ల, టాస్క్‌ఫోర్స్, ఎస్‌ఓటీ పోలీసులు సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి ఈ ముఠాపై దాడి చేశారు. 21 మందిని అదుపులోకి తీసుకున్నారు. రహస్య ప్రదేశంలో విచారిస్తున్నారు. వారి ఇళ్లపైనా దాడి చేసి విలువైన డాక్యుమెంట్లను సీజ్ చేసి 7 కేసుల్లో నిందితులుగా నమోదు చేశారు. బాలానగర్ ఏసీపీ నంద్యాల నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో ముగ్గురు సీఐలు చంద్రశేఖర్, వెంకటేశ్వర్లు, మోహన్‌రెడ్డి, పది మంది ఎస్‌ఐలు సుధాకర్, భూపాల్‌గౌడ్, వీరప్రసాద్, శ్రీని వాస్, 20 మంది కానిస్టేబుళ్లు దాడులు కొనసాగిం చారు. బుధవారం జీడిమెట్ల పోలీస్‌స్టేషన్‌లో మీడియా సమావేశంలో వివరాలు వెల్లడిస్తామని ఏసీపీ నర్సిం హారెడ్డి దాడుల అనంతరం విలేకరులకు తెలిపారు.