‘మధ్యంతరం’కోసం కేసీఆర్ ఎత్తులు: షబ్బీర్ అలీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు వస్తాయన్న విషయాన్ని సీఎం కేసీఆర్ పరోక్షంగా చెబుతున్నారని శాసనమండలిలో ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ అన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇప్పటిదాకా ఇచ్చిన హామీలను 2019 లోగా అమలుచేయలేమని కేసీఆర్‌కు అర్థమయిందన్నారు. అందుకే 2017లోనే మధ్యంతర ఎన్నికలకు వెళ్లాలని అనుకుంటున్నారన్నారు.
ఇప్పటిదాకా అమలుచేసిన హామీలపై శ్వేతపత్రం విడుదల చేయాలని కోరామని, అయినా సీఎం పట్టించుకోవడం లేదన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేసినా స్పీకరు పట్టించుకోవడం లేదని, అందుకే ఉన్నత న్యాయస్థానాలను ఆశ్రయించామన్నారు. 23 అసెంబ్లీ సీట్లకు, రెండు లోక్‌సభ స్థానాలకు, శాసనమండలికి వచ్చే ఉప ఎన్నికలను ఎదుర్కొనడం కంటే మొత్తం అసెంబ్లీని రద్దుచేసి మధ్యంతర ఎన్నికలకు వెళ్లాలని కేసీఆర్ నిర్ణయించుకున్నట్టుగా కనిపిస్తోందన్నారు.