షీ-టీమ్స్‌కు పట్టుబడ్డ 37 మంది మైనర్లు
అదనపు సీపీ స్వాతిలక్రా
సిటీబ్యూరో: ఈవ్‌టీజింగ్‌పై ఉక్కుపాదం మోపిన షీ-టీమ్స్ డెకాయి ఆపరేషన్‌లను ముమ్మరం చేసింది. వారం రోజుల వ్యవధిలో 37 మంది మైనర్లు ఈవ్‌టీజింగ్‌కు పాల్పడి పోలీసులకు చిక్కారు. వీరందరికీఈసారి యూనివర్సిటీ ప్రొఫెసర్లు, స్వచ్ఛంద సంఘాల కౌన్సెలర్లతో వారికి బుధవారం సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్)లో ప్రత్యేకంగా కౌన్సెలింగ్ ఇప్పించారు. ఈ సంద ర్భంగా క్రైమ్స్ అదనపు పోలీసు కమిషనర్ స్వాతి లక్రా తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఇప్పటి వరకు 80 మందిపై ఈవ్‌టీజింగ్ కేసులు నమోదు చేశామన్నారు. వీరిలో ఎనిమిది మందికి జైలు శిక్ష పడగా మిగతావారికి చలానా విధించామన్నారు. తాజాగా ఈ వారం రోజుల్లో షీ-టీమ్స్ నిర్వహించిన స్పెషల్ డ్రైవ్‌లో 37 మంది బాలలు దొరికారన్నారు. వీరందరికీ వారి తల్లిదండ్రుల సమక్షంలోనే ఈవ్‌టీజింగ్‌పై నిపుణులైన ప్రొఫెసర్లు, మహిళా సంఘాల నేతలతో కౌన్సెలింగ్ ఇప్పించామన్నారు.
కౌన్సెలింగ్ నిర్వహించిన తీరు చూస్తే వీరంతా మారిపోతారనే నమ్మకం కలిగిందని స్వాతి లక్రా ఆశాభావం వ్యక్తం చేశారు. ఎక్కడైనా ఈవ్‌టీజింగ్ జరిగితే డయల్ 100కు ఫోన్ చేయాలన్నారు. బాధితుల పేర్లు, ఇతర వివరాలు గోప్యంగా ఉంచుతున్నామన్నారు. డీసీపీ పాలరాజు మాట్లాడుతూ నగరంలో తప్పిపోయిన పిల్లల ఆచూకీపై సీఐడీ అధికారులు నిర్వహిస్తున్న ఆపరేషన్ స్మైల్‌కు నగర పోలీసులు పూర్తిగా సహకరిస్తున్నారన్నారు. డివిజన్ల వారీగా ఇందుకోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో ఏసీపీలు వి.శ్రీనివాస్, కె.ప్రసన్నరాణి, కవితతో పాటు ఈవ్‌టీజింగ్‌లో పట్టుబడిన మైనర్లు, వారి తల్లిదండ్రులు, వివిధ యూనివర్సిటీల నుంచి వచ్చిన కౌన్సెలర్లు పాల్గొన్నారు.