ఎట్టకేలకు మొదలైన మహాగణేశుడి శోభాయాత్ర
ఖైరతాబాద్లో కొలువైన మహాగణపతి శోభాయాత్ర ఎట్టకేలకు సోమవారం మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో మొదలైంది. వాస్తవానికి ఉదయం 9 గంటలకే ప్రారంభం అవుతుందని తొలుత భావించినా, ట్రాఫిక్ క్లియరెన్స్ రాకపోవడంతో బాగా ఆలస్యమైంది. అంతకుముందు 59 అడుగుల గణేశుడి విగ్రహాన్ని ప్రత్యేక వాహనంపైకి చేర్చి వెల్డింగ్ తదితర పనులు పూర్తి చేశారు.
కాగా, ఈసారి ఖైరతాబాద్ వినాయకుడి విగ్రహ నిమజ్జన కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు మనవడు, మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాంశు పాల్గొన్నాడు. ముందుగా ఖైరతాబాద్ గణపతికి పూజలు చేసిన హిమాంశు, తాను ప్రతిసారీ ఇక్కడ విగ్రహాన్ని దర్శించుకుంటున్నాను గానీ, నిమజ్జనానికి వెళ్లడం మాత్రం ఇదే మొదటిసారని చెప్పాడు. తాత, నాయనమ్మలతో పాటు రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని వినాయకుడిని పూజించినట్లు తెలిపాడు.