ముఖ్యమంత్రికి మూడు పేజీలు | SI Prabhakar Reddy given Three-page complaint letter to CM? | Sakshi
Sakshi News home page

ముఖ్యమంత్రికి మూడు పేజీలు

Published Thu, Jun 15 2017 2:50 AM | Last Updated on Sun, Sep 2 2018 3:42 PM

SI Prabhakar Reddy given Three-page complaint letter to CM?

- అధికారుల వసూళ్ల దందాపై ఫిర్యాదు
స్వహస్తాలతో రాసి సీక్రెట్‌ బాక్స్‌లో వేసిన ఎస్‌ఐ
అందుకే అధికారులు వేధించారంటున్న సిబ్బంది
 
సాక్షి, హైదరాబాద్‌: ఎస్‌ఐ ప్రభాకర్‌రెడ్డి సిద్దిపేట పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో జరుగుతున్న వసూళ్ల దందాపై ఇటీవలే ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఫిర్యాదు చేశారా? మొత్తం వ్యవహారంపై స్వహస్తాలతో సీఎంకు ఆయన లేఖ రాశారా? అవుననే తెలుస్తోంది. మే నెలలో సీఎం పోలీసుల కాన్ఫరెన్సు ఏర్పాటు చేయడం శాఖ తీరుతెన్నులపై సుదీర్ఘంగా సమీక్ష జరపడం తెలిసిందే. పోలీసు శాఖ పనితీరు తదితరాలపై ఫిర్యాదులు, సలహాలు, సూచనలేమైనా ఉంటే తన దృష్టికి తేవాలని ఆ సందర్భంగా సీఎం సూచించారు. రాజీవ్‌ రహదారి మీదుగా సాగుతున్న ఇసుక మాఫియా, దానికి వత్తాసు పలుకుతున్న పోలీసు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధుల వ్యవహారాలపై సీఎంకు ఫిర్యాదు చేయాలని ఎస్‌ఐ ప్రభాకర్‌రెడ్డి అప్పటికే భావించినట్టు ఆయన స్టేషన్‌లో పని చేస్తున్న పలువురు కానిస్టేబుళ్లు చెబుతున్నారు.

ఈ మేరకు పూర్తి వివరాలతో సరిగ్గా సమావేశానికి ముందు రోజే సీఎంను ఉద్దేశిస్తూ ఆయన స్వయంగా మూడు పేజీల ఫిర్యాదు లేఖ రాసినట్టు వివరిస్తున్నారు. నెలానెలా టార్గెట్‌ పెట్టి మరీ మామూళ్లు వసూళ్లు చేస్తున్న అధికారుల తీరును అందులో ఎస్‌ఐ నేరుగా ప్రస్తావించినట్టు వారు స్పష్టం చేశారు. ‘‘సీఎం సదస్సు సందర్భంగా ఆ ఫిర్యాదును ఎస్‌ఐ సీక్రెట్‌ బాక్స్‌లో వేశారు. అది ఉన్నతాధికారులు చూశారు. అప్పటినుంచి ఆయన కొంత టెన్షన్‌ పడ్డట్టుగా కనిపించారు’’అని వివరించారు. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు ఆయనను మందలించారని, ‘మాపైనే ఫిర్యాదు చేస్తావా?’అంటూ ఆగ్రహించారని కానిస్టేబుళ్లు చెప్పుకొచ్చారు. ‘‘చూస్తుంటే ఎస్‌ఐని టార్గెట్‌ చేసినట్టుగానే ఉంది.

ఎస్‌ఐ వ్యవహారాలపై దృష్టి పెట్టాలని డివిజన్‌ అధికారితో పాటు మరో కీలక అధికారి ఆయన పోలీస్‌ స్టేషన్‌లో రెండో వర్గాన్ని తయారు చేశారు. దానికి ఓ హెడ్‌కానిస్టేబుల్‌ నేతృత్వం వహిస్తున్నారు. స్టేషన్‌లో జరిగే ప్రతి వ్యవహారాన్నీ ఆ ఇద్దరు అధికారులకు చెప్తూ వచ్చారు. సీక్రెట్‌ బాక్స్‌లో తాను వేసిన ఫిర్యాదుపై ఉన్నతాధికారులు ఇప్పటివరకు స్పందించకపోవడంపై కూడా ఎస్‌ఐ రెండు మూడుసార్లు ఫోన్లలో ఎవరితోనో చర్చించారు. తనను టార్గెట్‌ చేస్తున్నారని మాట్లాడినట్టు అనిపించింది. ఆ ఫిర్యాదు సీక్రెట్‌ బాక్స్‌లో నుంచి బయటికొచ్చిందా, అందులోని ఫిర్యాదులపై అధికారులు విచారణేమైనా మొదలుపెట్టారా అన్నదానిపై స్పష్టత లేదు. ఈ వ్యవహారంలోనే తనను టార్గెట్‌ చేశారని, ఏదోలా సస్పెండ్‌ చేసే ప్రయత్నం చేస్తున్నారని ఎస్‌ఐ భావించి ఉంటారు’’అని ఆ కానిస్టేబుళ్లు స్పష్టం చేశారు. అయితే ఆయన దీనివల్ల ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కారన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement