
సిమి ఉగ్రవాదుల అరాచకాల చిట్టా!
హైదరాబాద్: నల్గొండ జిల్లా మోత్కూరు మండలం జానకీపురం శివారులో శనివారం ఉదయం జరిగిన ఎదురు కాల్పుల ఘటనలో మృతి చెందిన ఇద్దరు సిమి ఉగ్రవాదులు అస్లాం అయూబ్, జాకీర్ బాదల్లు దేశంలో పలు ప్రాంతాలలో అనేక అరాచకాలకు పాల్పడ్డారు. హత్యలు, దోపిడీలు, దొంగతనాలకు చేశారు. విశ్వసనీయంగా తెలిసిన సమాచారం ప్రకారం వీరు 2009లో మధ్యప్రదేశ్లోని సాత్నా జైలర్ సంజయ్ పాండేపై హత్యాయత్నం చేశారు. 2009లో తీవ్రవాద నిరోధక దళంలో పని చేస్తున్న సీతారామ్ నాయక్ అనే కానిస్టేబుల్ని హత్య చేశారు. 2009 జనవరిలో బీజేపీ నేత ప్రమోద్ తివారీపై కాల్పులు జరిపారు. అదే సంవత్సరం విజయ్ ముండీ పట్టణంలో బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్లో 9 లక్షల 50 వేల రూపాయలు దోపిడీ చేశారు. దేవాస్లోని నర్మదా గ్రామీణ బ్యాంకులో లక్షా 50 వేల రూపాయలు దోపిడీ చేశారు.
2010లో రత్నాం జిల్లాలో పంజాబ్ నేషనల్ బ్యాంకు బ్రాంచ్లో రెండు లక్షల రూపాయలు దొంగిలించారు. 2010 మార్చిలో ఇటార్సీలో కెనారా బ్యాంకులో దోపిడీ చేశారు. 2010 సెప్టెంబరులో భోపాల్లో మణప్పురం బ్యాంకు బ్రాంచ్లోకి ప్రవేశించి ఒక వ్యక్తి నుంచి పది తులాల బంగారం దోచుకెళ్లారు.