
ఎదురు కాల్పులలో మృతి చెందిన సిమి కార్యకర్తలు
హైదరాబాద్: నల్గొండ జిల్లా మోత్కూరు మండలం జానకీపురం శివారులో శనివారం ఉదయం జరిగిన ఎదురు కాల్పుల ఘటనలో మృతి చెందిన ఇద్దరూ సిమి కార్యకర్తలుగా నిర్ధారణ అయింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం నార్కెట్పల్లిలోని కామినేని ఆస్పత్రిలో మృతదేహాలను మధ్యప్రదేశ్ ఏటీఎస్ పో్లీసులు పరిశీలించారు. వారు మధ్యప్రదేశ్ లోని ఖండ్వా జైలు నుంచి పరారైన సిమి కార్యకర్తల వేలిముద్రలను తీసుకువచ్చారు. మృతదేహాలను పరిశీలించి, ఆ వేలి ముద్రలతో పోల్చి చూసి వారిని అస్లాం అయూబ్, జాకీర్ బాదల్గా నిర్ధారించారు. యూపీకి చెందిన ఈ ఇద్దరూ ఎన్ఐఏ(నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజన్సీ) జాబితాలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్గా ఉన్నారు.
మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలలో వీరిపై అనేక కేసులు ఉన్నట్లు సమాచారం. వీరు 2007లో కేరళలో తీవ్రవాద శిక్షణ శిబిరాన్ని నిర్వహించినట్లుగా తెలుస్తోంది. 2010లో భో్పాల్లోని ఓ బంగారు దుకాణంలో వీరు చోరీ చేసినట్లు దర్యాప్తు సంస్థలు భావిస్తున్నాయి. కరీంనగర్ జిల్లా చొప్పదండి బ్యాంకు చోరీకి పాల్పడింది కూడా వీరేనని పోలీసులు అనుమానిస్తున్నారు.
పోలీసులు కథనం ప్రకారం 2013 అక్టోబరు 1న ఖండ్వా జైలు నుంచి ఆరుగురు తప్పించుకొని పారిపోయారు. వారిలో అయిదుగురు సిమి కార్యకర్తలు కాగా, ఒకరు స్థానిక నేరస్థుడు. వారు ఆ రోజు అర్ధరాత్రి 2 గంటలకు వెంటిలేటర్ విరగగొట్టి బ్యారెక్ నుంచి బయటకు వచ్చారు. దుప్పట్లను తాడులా పేని 16 అడుగుల గోడను ఎక్కి, కిందకు దిగి పారిపోయారు. అయోధ్య రామమందిరం కేసు తీర్పు ఇచ్చిన అలహాబాద్ బెంచ్లో ముగ్గురు జడ్జిలను హత్య చేయాలని అప్పట్లో వారు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. ఆ కుట్రను అమలు చేయడానికి వారు రెండు నెలలు రెక్కీ కూడా నిర్వహించినట్లు సమాచారం. వారు తమ పని పూర్తి చేసుకోవడానికి స్థానికంగా ఉన్న మరో సిమి కార్యకర్త సహాయం కోరినట్లు తెలుస్తోంది. ఇదే ప్రయత్నంలో వారు 2011 జూన్లో అరెస్ట్ అయ్యారు.
జైలు నుంచి పారిపోయినవారిలో అబిద్ మీర్జా, అస్లాం అయూబ్, అబు ఫైసల్, షేక్ మహబూబ్, మహ్మద్ ఇజాజుద్దీన్, జాకీర్ బాదల్ ఉన్నారు. పరారైన కొన్ని గంటలకే అబిద్ మీర్జాను మధ్యప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. డిసెంబరు 24న అబు ఫైసల్ను బర్వానీలో పోలీసులు పట్టుకున్నారు. అప్పటి నుంచి అస్లాం అయూబ్, మహ్మద్ ఇజాజుద్దీన్, జకీర్ బాదల్ పరారీలో ఉన్నారు. 2009 నవంబరు 11 ఏటీఎస్ కానిస్టేబుల్ని హత్య చేసినట్లు వారిపై ఆరోపణలు ఉన్నాయి.బోఫాల్లో రెండు బ్యాంకులలో చోరీ చేసి, ఆ సొమ్ముని తీవ్రవాద కార్యకలాపాలకు వాడినట్లు వారిపై కేసులు ఉన్నాయి.
నిన్న నల్గొండ జిల్లాలో మృతి చెందిన ఇద్దరూ 2010 నవంబరులో లక్నోలో ఉన్నట్లు తెలుస్తోంది. దొరక్కుండా తప్పించుకు తిరుగుతున్న మరో ఉగ్రవాది నల్లొండ జిల్లాలోనే తిరుగుతున్నట్లు పో్లీసులు అనుమానిస్తున్నారు. అతని కోసం తెలంగాణ పోలీసులతోపాటు మహారాష్ట్ర పోలీసులు కూడా వెతుకుతున్నారు.