‘సిమి’ కీటకాలే | terrorists identified as SIMI suspects | Sakshi
Sakshi News home page

‘సిమి’ కీటకాలే

Published Mon, Apr 6 2015 1:14 AM | Last Updated on Thu, Sep 13 2018 3:15 PM

‘సిమి’ కీటకాలే - Sakshi

‘సిమి’ కీటకాలే

ఎన్‌కౌంటర్ దుండగులను మధ్యప్రదేశ్‌కు చెందిన సిమి ఉగ్రవాదులుగా నిర్ధారించిన పోలీసులు
 మృతులు అబు ఫైజల్ ముఠాలోని ఎజాజుద్దీన్, అస్లం
 మధ్యప్రదేశ్ పోలీసుల సహకారంతో ధ్రువీకరణ
 ఖాండ్వా జైలు నుంచి పరారైన ఆరుగురిలో వీరు సభ్యులు
 పలు రాష్ట్రాల్లో పేలుళ్లు, హత్యలు, బ్యాంకు దోపిడీలు
 
 సాక్షి, హైదరాబాద్: ముష్కర మూక గుట్టు వీడింది. అనుమానించినట్లే దుండగులు నిషేధిత స్టూడెంట్ ఇస్లామిక్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా(సిమి)కు చెందిన కరడుగట్టిన ఉగ్రవాదులని తేలింది. జానకీపురం ఎన్‌కౌంటర్‌లో హతమైన ఇద్దరు దుండగులను మధ్యప్రదేశ్‌కు చెందిన మోస్ట్ వాంటెడ్ ‘సిమి’ ఉగ్రవాదులు ఎండీ ఎజాజుద్దీన్, ఎండీ అస్లం అలియాస్ బిలాల్‌గా పోలీసులు ధ్రువీకరించారు. ఉగ్రవాది అబు ఫైజల్ నేతృత్వంలో దేశవ్యాప్తంగా బాంబు పేలుళ్లు, హత్యలు, బ్యాంకు దోపిడీలకు పాల్పడిన ఆరుగురి ముఠాలో వీరిద్దరు సభ్యులుగా ఉన్నట్లు నిర్ధారించారు. నల్లగొండ జిల్లా సూర్యాపేట బస్టాండ్‌లో గత బుధవారం అర్ధరాత్రి కాల్పులకు తెగబడి రెండు రోజులపాటు తప్పించుకుని తిరిగిన దుండగులు శనివారం ఉదయం ఆత్మకూరు(ఎం) మండలం జానకీపురం వద్ద ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన సంగతి తెలిసిందే.
 
 ముష్కరుల కాల్పులకు ముగ్గురు పోలీసులు బలి కాగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. కాల్పులకు తెగబడిన తీరు, ఇతర అంశాలను బట్టి దుండగులు ఎవరన్న దానిపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. చివరకు మధ్యప్రదేశ్  నుంచి వచ్చిన పోలీసుల సాయంతో వారిని సిమి ఉగ్రవాదులుగా ఆదివారం నిర్ధారించారు. దుండగులను మధ్యప్రదేశ్‌లోని నర్సింగ్‌పూర్ జిల్లాలోని కారేలీకి చెందిన ఎండీ ఎజాజుద్దీన్(తండ్రి పేరు అజీజుద్దీన్), అదే రాష్ట్రంలోని ఖాండ్వా జిల్లా గణేష్ తలాయ్‌కు చెందిన ఎండీ అస్లామ్ అలియాస్ బిలాల్(తండ్రి పేరు అయూబ్)గా ధ్రువీకరించినట్లు డీజీపీ అనురాగ్ శర్మ ప్రకటించారు. మధ్యప్రదేశ్ పోలీసులు తీసుకొచ్చిన ఫొటోలు, ఫింగర్ ప్రింట్స్‌ను విశ్లేషించిన తర్వాతే ముష్కరుల గుర్తింపుపై రాష్ర్ట ప్రభుత్వం అధికారికంగా స్పందించడం గమనార్హం.
 
 పోలీసులంటే పగ..!
 
 అబు ఫైజల్ ఉగ్రమూకకు పోలీసులంటే పగ. ముంబైకి చెందిన అబు ఫైజల్ మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో హోమియోపతి వైద్యం చదువుకున్నాడు. అదే రాష్ట్రంలోని ఖాండ్వాకు చెందిన యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఖాండ్వా జిల్లాలో సిమి కదలికలను పసిగట్టిన స్థానిక ఉగ్రవాద నిరోధక విభాగం(ఏటీఎస్) అబు ఫైజల్ భార్య, మరదలితోపాటు పలువురిని అరెస్టు చేసింది. అప్పటికే సిమి కార్యకలాపాలకు ఆకర్షితుడైన ఫైజల్ ఈ అరెస్ట్‌లతో పోలీసులపై పగ పెంచుకున్నాడు. జానకీపురం ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన ఎజాజుద్దీన్, అస్లాంతో పాటు మధ్యప్రదేశ్‌కే చెందిన మహబూబ్, అంజాద్, జాకీర్ హుస్సేన్‌తో కలిసి ఉగ్రమూకగా ఏర్పడ్డాడు. ఉగ్రవాదుల ఏరివేతలో క్రియాశీలకంగా పనిచేసిన ఖాండ్వా ఏటీఎస్ కానిస్టేబుల్ సీతారాం యాదవ్‌ను లక్ష్యం చేసుకున్న ఈ ముఠా 2009 నవంబర్‌లో ఆయన్ను హతమార్చింది. పోలీసులపై తీవ్ర స్థాయిలో పగ ఉండడం వల్లే తాజాగా రాష్ర్టంలోనూ పోలీసులు తారసపడగానే ఆ ముఠా సభ్యులు విచ్చలవిడిగా కాల్పులు జరిపి ఉంటారని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు.
 
 తప్పిన భారీ ముప్పు!
 
 ఖాండ్వా ఏటీఎస్ కానిస్టేబుల్ హత్య కేసులో గతంలో అరెస్టయిన ఈ ఉగ్రమూక 2013 అక్టోబర్ 1న ఖాండ్వా జైలు గోడ దూకి తప్పించుకుంది. తర్వాత రెండు నెలలకే ముఠా నేత అబు ఫైజల్ పోలీసులకు చిక్కాడు. మిగిలిన ఐదుగురు ఉగ్రవాదులు మాత్రం అప్పటి నుంచి పోలీసుల కళ్లు గప్పి తప్పించుకుని తిరుగుతున్నారు. మధ్యప్రదేశ్, పశ్చిమబెంగాల్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల పోలీసులతో పాటు జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) కూడా వెతుకుతున్న మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల జాబితాలో ఈ ముఠా సభ్యులు ఉన్నారు. విచ్చలవిడి నేరప్రవృత్తితో కరుడుగట్టిన ఈ ఉగ్రవాదులు పలు రాష్ట్రాల్లో బాంబు పేలుళ్లు, హత్యలు, బ్యాంకు దోపిడీలకు పాల్పడ్డారు.
 
 2009 నుంచి ఇప్పటివరకు తమిళనాడు, మహారాష్ర్ట, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో బాంబు పేలుళ్లతో పాటు దేశవ్యాప్తంగా 11 బ్యాంకులను దోచుకున్నారు. ఈ డబ్బును ఉగ్రవాద కార్యకలాపాలకు వినియోగించేవారని పోలీసులు భావిస్తున్నారు. తాజాగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో విద్రోహ చర్యకో లేక బ్యాంకు దోపిడీకో పథక రచన చేసుకుని హైదరాబాద్‌కు వచ్చి ఉంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పథకం అమలులో భాగంగా ఎజాజుద్దీన్, అస్లామ్.. విజయవాడకు వెళ్తూ గత బుధవారం రాత్రి సూర్యాపేట బస్టాండ్‌లో స్థానిక పోలీసులకు తారసపడ్డారని, చివరకు వారి ఎన్‌కౌంటర్‌తో భారీ ముప్పు తప్పిందని పోలీస్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అయితే, ఈ ముఠాలోని మిగిలిన ఉగ్రవాదులు మహబూబ్, అంజాద్, జాకీర్ హుస్సేన్ కదలికలపై మాత్రం నిఘా వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement