
నగరంపై ముసుగు
గ్రేటర్‌ను పొగమంచు కమ్మేసింది. నీటి బిందువులతో కూడిన మంచు, వాహనాల నుంచి వెలువడే పొగ కలసిపోయి దట్టమైన...
గ్రేటర్‌ను కమ్మేసిన ‘పొగ’ మంచు
అనూహ్యంగా పడిపోయిన ఉష్ణోగ్రతలు
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్‌ను పొగమంచు కమ్మేసింది. నీటి బిందువులతో కూడిన మంచు, వాహనాల నుంచి వెలువడే పొగ కలసిపోయి దట్టమైన నల్లటి పొగమంచు(స్మాగ్)గా ఏర్పడి మహానగర వాతావరణంపై ఎన్నడూ లేనంతగా పంజా విసరడంతో సిటీజనులు విలవిల్లాడుతున్నారు. ఆదివారం మిట్ట మధ్యాహ్నం వేళల్లోనూ పొగమంచు కారణంగా చీకట్లు కమ్ముకోవడం గమనార్హం. ఈ పరిస్థితికి తోడు అరేబియా సముద్రంలో ఏర్పడిన వాయుగుండం తుపానుగా మారడం, ఉత్తరాది నుంచి వీస్తున్న తేమతో కూడిన చలిగాలుల ఉద్ధృతి అధికంగా ఉండడంతో చలితీవ్రతకు నగరవాసులు గజగజలాడుతున్నారు.
గాలిలో తేమ 98 శాతానికి చేరుకోవడంతో చలితీవ్రత అనూహ్యంగా పెరిగింది. ఇళ్లలో ఉన్నవారు సైతం చలికి తట్టుకోలేకపోయారు. మరో 48 గంటలపాటు ఇదే పరిస్థితి తప్పదని వాతావరణ శాస్త్రవేత్త కె.సీతారాం ‘సాక్షి’కి తెలిపారు. ప్రస్తుతం ఆకాశంలో దట్టమైన క్యుములో నింబస్ మేఘాలు కమ్ముకున్నాయని, పైకి వెళుతున్న కొద్దీ సాధారణంగా ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గాల్సి ఉండగా దానికి భిన్నంగా స్వల్పంగా పెరుగుతుండడంతో ఇన్‌వర్షన్ లేయర్ (పొగమంచుతో కూడిన పొర)ఏర్పడి వాతావరణంలో ఈ అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయన్నారు. సాయంత్రం, రాత్రి వేళల్లో పొగమంచు తీవ్రత అధికంగా ఉండే అవకాశాలున్నాయన్నారు.
నగరంలో పొగమంచు ఆవరించడంతో వాహనచోదకులు రహదారులు కనిపించక ఇబ్బందులు పడ్డారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరాల్సిన పలు విమానాలు ఆలస్యంగా బయలుదేరాయి. చలితీవ్రత పెరగడంతో నగరంలో ఏసీలు, ఫ్యాన్లు, ఇతర గృహోపకరణాలు ఉపయోగించకపోవడంతో విద్యుత్ వినియోగం పది మిలియన్ యూనిట్ల మేర తగ్గింది. నగరంలో నిత్యం సాధారణ విద్యుత్ వినియోగం 44 మిలియన్ యూనిట్లు కాగా ఆదివారం 34 మిలియన్ యూనిట్లకు తగ్గడం విశేషం.
గ్రేటర్ గజగజ: వాయుగుండం కారణంగా గ్రేటర్‌లో పగటి ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పడిపోయాయి. గత పదేళ్లుగా ఎన్నడూ లేనంతగా పగటి ఉష్ణోగ్రతలు పడిపోయినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నాలుగురోజుల క్రితం 34 డిగ్రీలుగా నమోదైన గరిష్ట ఉష్ణోగ్రతలు.. ఆదివారం ఏకంగా గరిష్టంగా 21.4 డిగ్రీలు, కనిష్టంగా 18.8 డిగ్రీలకు పడిపోవడంతో చలితీవ్రత అనూహ్యంగా పెరిగింది. రెండు రోజుల వ్యవధిలోనే ఉష్ణోగ్రతలు 13 డిగ్రీల మేర పడిపోవడంతో చలితీవ్రత హెచ్చింది. ఆదివారం సాయంత్రం 5.30 గంటల వరకు 2.6 మిల్లీమీటర్ల మేర వర్షపాతం నమోదైనట్లు బేగంపేట్‌లోని వాతావరణ శాఖ తెలిపింది.
పలు విమానాలు ఆలస్యం...
దట్టమైన పొగమంచు కారణంగా ఆదివారం శంషాబాద్ విమానాశ్రయం నుంచి బయలుదేరాల్సిన పలు విమానాలు 15 నుంచి 30 నిమిషాలు ఆలస్యంగా బయలుదేరి వెళ్లినట్లు విమానాశ్రయ వర్గాలు తెలిపాయి. ఆదివారం సాయంత్రం ముంబాయి నుంచి హైదరాబాద్‌కు రావాల్సిన ఓ జెట్ విమానం 15 నిమిషాలు ఆలస్యమైందని, శంషాబాద్ నుంచి పూణే వెళ్లాల్సిన ఇండిగో విమానం 20 నిమిషాలు ఆలస్యంగా బయలుదేరాయని పేర్కొన్నారు.
మరో 48 గంటల పాటు ఇదే పరిస్థితి..
అరేబియా సముద్రంలో ఏర్పడిన వాయుగుండం తుపానుగా మారనుందని అధికారులు తెలిపారు. మరో 48 గంటల పాటు గ్రేటర్ నగరంపై పొగమంచు ప్రభావం అధికంగా ఉండే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు.
అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్న వైద్యులు..
మహానగర వాతావరణంలో చోటు చేసుకుంటున్న అనూహ్య మార్పులను మానవ శరీరం వెంటనే స్వీకరించలేదని వైద్యనిపుణులు చెబుతున్నారు. గరిష్ట ఉష్ణోగ్రతలు ఏకంగా 13 డిగ్రీలు తగ్గి చలితీవ్రత అధికంగా ఉండడం, పొగమంచు కారణంగా ఆస్తమా రోగులు ఊపిరాడక విలవిల్లాడుతున్నారని తెలిపారు. ఈ వాతావరణ పరిస్థితుల కారణంగా పసిపిల్లలు, వృద్ధులు, గర్భిణులు, బాలింతలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. హృద్రోగుల్లోనూ ఆరోగ్యపరమైన సమస్యలు రెట్టింపవుతున్నాయని తెలిపారు.
ఏపీ, తెలంగాణ జిల్లాలోనూ ఇదే పరిస్థితి...
అరేబియా సముద్రంలో ఏర్పడిన వాయుగుండానికి హిమాలయాల నుంచి వీస్తున్న శీతల గాలులు తోడుకావడంతో తెలంగాణ, ఏపీలో ఉష్ణోగ్రతలు భారీగా తగ్గిపోయాయి. చలి తీవ్రత బాగా పెరిగిపోయింది. తుపానుకు పాకిస్థాన్ సూచించిన ప్రకారం.. ‘నీలోఫర్’గా పేరుపెట్టారు. దీని ప్రభావంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఆదివారం విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అరేబియా సముద్రంలో ఏర్పడిన తుపాను ఉత్తర దిశగా కదిలి గుజరాత్, దక్షిణ పాకిస్తాన్ వైపు వెళ్లే అవకాశాలున్నాయని, లేదా పశ్చిమ దిశ వైపు పయనించి ఒమన్ తీరం వైపు వెళ్లవచ్చని పేర్కొంది.
అయితే ఈ తుపాను ప్రభావంతో కర్ణాటక మీదుగా దక్షిణ కోస్తాంధ్ర వరకు అల్పపీడన ద్రోణి ఏర్పడింది. గత 24 గంటల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. తెలంగాణలో అత్యధికంగా నాగార్జునసాగర్‌లో 11 సెంటీమీటర్లు, ఏపీలోని మాచర్లలో 29 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాగల 24 గంటల్లో దక్షిణ కోస్తా, రాయలసీమ, తెలంగాణల్లోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశముంది. ఉత్తరాంధ్రలో కూడా ఒక మోస్తరు వర్షాలు పడొచ్చు.