
విషమే విరుగుడు!
ఎయిడ్స్‌కు హోమియో మందు
‘క్రొటాలస్.హరిడస్’ ఔషధంతో హెచ్‌ఐవీని నిర్మూలించవచ్చని గుర్తించిన ఆయుష్ వైద్యులు
పాము విషంతో తయారీ.. వైరల్ ఇన్ఫెక్షన్లలో వినియోగం
ఔషధం సామర్థ్యాన్ని నిర్ధారించిన ఐఐసీటీ
హైదరాబాద్ లో 3,900 మందిపై క్లినికల్ ట్రయల్స్
ఆశాజనకంగా ఫలితాలు.. మరో రెండేళ్లు ప్రయోగాలు
సాక్షి, హైదరాబాద్: వైరల్ ఇన్ఫెక్షన్ల చికిత్సలో ఉపయోగించే ‘క్రొటాలస్.హరిడస్’ అనే హోమియో మందు ఎయిడ్స్ వ్యాధిని నియంత్రిస్తుందని తెలంగాణ ఆయుష్ వైద్యులు గుర్తించారు. బ్రెజిల్‌కు చెందిన ఒక రకమైన పాము విషంతో తయారుచేసే ఈ మందు... హెచ్‌ఐవీ వైరస్‌ను పూర్తిస్థాయిలో నియంత్రిస్తుందని తమ పరిశోధనలో గుర్తించారు. ఈ మందు సామర్థ్యాన్ని హైదరాబాద్‌లోని ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ) శాస్త్రవేత్తలు కూడా నిర్ధారించారు. అంతేకాదు ఈ ‘క్రొటాలస్.హరిడస్’ మందు పనితీరును పూర్తిస్థాయిలో తేల్చేం దుకు 3,900 మంది హెచ్‌ఐవీ/ఎయిడ్స్ రోగులపై క్లినికల్ ట్రయల్స్ కూడా చేస్తున్నారు. హైదరాబాద్‌లోని రామంతాపూర్ హోమియో మెడికల్ కాలేజీలో జరుగుతున్న ఈ ట్రయల్స్‌లో ఆశాజనకమైన ఫలితాలు వచ్చాయని ఆయుష్ వర్గాలు వెల్లడించాయి. 13 మందిలో హెచ్‌ఐవీ వైరస్ శూన్య స్థితికి వచ్చిందని, ఇద్దరిలో ఎయిడ్స్ పూర్తిగా తగ్గిపోయిందని తెలిపాయి.
పాము విషం నుంచి..
ప్రస్తుతమున్న హోమియో మందులు ఎయిడ్స్ నియంత్రణలో 60-70 శాతం మాత్రమే ఫలితాలు ఇవ్వగలుగుతున్నాయి. ఈ నేపథ్యంలో నూటికి నూరు శాతం నియంత్రణ చేయగలిగే ఔషధం కోసం ఆయుష్ అధికారులు పరిశోధన చేశారు. ఎబోలా వైరస్ విజృంభణ సమయంలో దాని నియంత్రణకు ‘క్రొటాలస్.హరిడస్’ ఔషధాన్ని వినియోగించినట్లుగా గుర్తించారు. బ్రెజిల్‌లో ఉండే ఒక రకమైన పాము విషంతో తయారయ్యే ఈ హోమియో మందును ఇప్పటికే అధిక కామెర్లు, పక్షవాతం తదితర వ్యాధుల చికిత్సలో ఉపయోగిస్తున్నారు కూడా. ఈ నేపథ్యంలోనే ఎబోలా వైరస్‌కు సరిసమాన లక్షణాలున్న హెచ్‌ఐవీ వైరస్‌పై ఈ ఔషధం పనిచేయగలదని భావించి పరిశోధన చేపట్టారు. దీనిపై ఐఐసీటీని సంప్రదించారు. అక్కడి శాస్త్రవేత్తలు ఈ మందును ప్రయోగాత్మకంగా పరీక్షించి... అది హెచ్‌ఐవీ వైరస్‌పై పనిచేస్తుందని ప్రాథమికంగా నిర్ధారించినట్లు ఆయుష్ కమిషనర్ రాజేందర్‌రెడ్డి వెల్లడించారు.
ఆరు నెలలుగా క్లినికల్ ట్రయల్స్
రివర్స్ ట్రాన్స్‌క్రిప్టేస్ ఎంజైమ్ సహాయంతో ఎయిడ్స్ వ్యాధి శరీరంలో విస్తరిస్తుంది. దీనిని ‘క్రొటాలస్.హరిడస్’ నియంత్రిస్తుందని గుర్తించారు. ఈ నేపథ్యంలోనే క్లినికల్ ట్రయల్స్ చేపట్టారు. గతేడాది జూన్ నుంచి 3,900 మందిపై ఈ ట్రయల్స్ జరుగుతున్నాయి. వారిని నాలుగు గ్రూపులుగా చేశారు. ఒక గ్రూపులో ఏ మందులూ వాడనివారు, రెండో గ్రూపులో అల్లోపతి వైద్యం తీసుకునేవారు, మూడో గ్రూపులో వైరల్ లోడ్ ఎక్కువగా ఉండి సీడీ-4 కౌంట్ తక్కువగా ఉన్నవారు, నాలుగో గ్రూపులో హెచ్‌ఐవీ పాజిటివ్ ఉన్నా ఇతర లక్షణాలు లేనివారిని చేర్చారు. మొత్తంగా 2,200 మందికి ప్రస్తుతం ఎయిడ్స్ నియంత్రణకు అందుబాటులో ఉన్న మందులు ఇస్తూనే... ‘క్రొటాలస్.హరిడస్’నూ ఇస్తున్నారు. మిగతా వారికి కేవలం ‘క్రొటాలస్.హరిడస్’ ఔషధాన్ని మాత్రమే ఇస్తున్నారు. వారందరిపైనా ఈ ఔషధాన్ని ప్రయోగిస్తున్నారు. ఆరు నెలలుగా జరుగుతున్న ఈ క్లినికల్ ట్రయల్స్‌లో సానుకూల ఫలితాలు కనిపిస్తున్నాయని... బాధితుల్లో సీడీ-4 కౌంట్ పెరుగుతోందని ఆయుష్ అధికారులు చెబుతున్నారు.
అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది
‘‘హోమియో మందుతో ఎయిడ్స్‌ను నయం చేయొచ్చని తెలంగాణ ఆయుష్ వైద్యులు కనుగొనడం మంచి పరిణామం. దీనిపై జరిగిన పరిశోధనలు కూడా ఆశాజనకంగా ఉన్నాయి. క్లినికల్ ట్రయల్స్ విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నా.. ఈ మందు ఎయిడ్స్/హెచ్‌ఐవీ చికిత్సకు పనికి వస్తుందన్న విషయంపై అధికారిక ధ్రువీకరణ కావాల్సి ఉంది. తుది ఫలితాలు కోసం వేచిచూస్తున్నాం..’’
- లక్ష్మారెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి
ఎయిడ్స్ నియంత్రణ మండలికి నివేదిక ఇచ్చాం
‘‘ఎయిడ్స్/హెచ్‌ఐవీ నియంత్రణలో ‘క్రొటాలస్.హరిడస్’ పనిచేస్తుందని ఐఐసీటీ పరిశీలనలో వెల్లడైంది. దీనిపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నాం. ఇది పనిచేసే విధానంపై ఎయిడ్స్ నియంత్రణ మండలికి సమగ్ర నివేదిక ఇచ్చాం. ఇంకా పరిశోధన జరగాల్సి ఉంది. క్లినికల్ ట్రయల్స్ ఇంకా రెండేళ్లు కొనసాగుతాయి..’’
- డాక్టర్ రాజేందర్‌రెడ్డి, ఆయుష్ కమిషనర్
క్లినికల్ ట్రయల్స్‌లో మంచి ఫలితాలు
3,900 మందిపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నాం. మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. క్రొటాలస్.హరిడస్ హోమియో మందు ప్రస్తుతం పక్షవాతం, అధిక కామెర్లు వంటి వాటిని నయం చేయడంలో ఉపయోగిస్తున్నాం. ఇప్పుడు ఎయిడ్స్ నియంత్రణకు ఉపయోగపడుతుందని ఐఐసీటీ ప్రాథమికంగా నిర్ధారించింది.
- డాక్టర్ సువర్ణ ప్రవీణ్‌కుమార్, రామంతాపూర్ ప్రభుత్వ హోమియో వైద్య కళాశాల వైస్ ప్రిన్సిపాల్