
మిస్సయిన ఫోన్.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగినికి వేధింపులు
హైదరాబాద్: సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని పోగొట్టుకున్న సెల్‌ఫోన్..ఓ ఆకతాయికి దొరికింది. అదే అవకాశంగా తీసుకున్న ఆ యువకుడు సదరు యువతిని అసభ్య మెసేజ్‌లతో వేధించటం ప్రారంభించాడు. బాధితురాలి ఫిర్యాదుతో సదరు యువకుడిని పోలీసులు కటకటాల్లోకి నెట్టారు.
వివరాలు... మాదాపూర్‌లోని సాఫ్ట్‌వేర్ సంస్థలో ఓ యువతి పనిచేస్తోంది. ఇటీవల అనుకోకుండా ఆమె తన సెల్‌ఫోన్‌ను పోగొట్టుకుంది. అది సిద్ధు అనే యువకుడికి దొరికింది. ఆ ఫోన్‌లో ఉన్న సదరు యువతికి సంబంధించిన వ్యక్తిగత ఫొటోలను, ఇతర వివరాలను అతడు చూశాడు. వాటిని ఉపయోగించుకుని ఆమెను వేధించటం మొదలుపెట్టాడు. అసభ్యకర సందేశాలను పంపిస్తున్నాడు. మొదట్లో సెల్ పోయిన విషయాన్ని పట్టించుకోని బాధితురాలు...వేధింపులతో విసిగిపోయింది. చివరికి మాదాపూర్ పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు ఫోన్‌కాల్స్‌ను ట్రేస్ చేసి, సిద్దును అదుపులోకి తీసుకున్నారు. అతనిపై 354డి, 506, 509 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.