కరీంనగర్: ‘బిల్లులో ఏముందనేది సంబంధం లేదు.. నేను చెప్పిందానికి సంతకం పెట్టలేదంటే అంతే. మీ ఎంబడి పడుడైతది చెబుతున్నా.. నా గురించి తెలుసు కదా.. నన్ను ఏ కొడుకు.. ఏం చేయలేడు’.. ఇది నగరపాలకసంస్థలో ఓ డీఈ దౌర్జన్యకాండ. నగరపాలక సంస్థలో పనులు పూర్తికాకున్నా బిల్లులపై సంతకాల కోసం ఇంజినీరింగ్ అధికారులపై వివాదాస్పద డీఈ వేధింపులు మళ్లీ మొదలయ్యాయి. నిత్యం వివాదాల్లో ఉండే సదరు డీఈ కాంట్రాక్టర్ల తరఫున రంగంలోకి దిగాడు. ఏఈలు, డీఈలను సంతకాలకోసం బెదిరిస్తుండగా, వారు సెలవుపై వెళ్లేందుకు కూడా సిద్ధమవుతున్నారు.
పూర్తి కాని, నాణ్యత పాటించని పనులకు..
ఓ వైపు స్మార్ట్ సిటీ, సీఎంఏ తదితర నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి పనుల్లో వందల కోట్ల రూపాయల అవినీతి అక్రమాలు జరిగాయని అధికార, విపక్షాలనే తేడా లేకుండా ఫిర్యాదులు చేస్తుంటే.. మరో వైపు ఎలాంటి భయం లేకుండా పూర్తి కాని, నాణ్యత పాటించని పనులకు రికార్డులు తయారుచేసి బిల్లులు ఎత్తే పనిని సదరు డీఈ విజయవంతంగా పూర్తి చేసే పనిలో నిమగ్నమయ్యాడు. దీనికోసం ఏఈలు, సహచర డీఈలపై బెదిరింపులకు దిగుతున్నాడు. సంతకాలు పెట్టకపోతే మీ సంగతి చెబుతానంటూ బూతులందుకుంటున్నాడు.
మళ్లీ వేధింపులు షురూ!
బల్దియాలో వివాదాస్పద అధికారిగా పేరొందిన సదరు డీఈ బెదిరింపులు మళ్లీ మొదలయ్యాయి. గతంలో ఉన్నతాధికారులను సైతం అసభ్యపదజాలంతో దూషించిన వ్యవహారం అప్పట్లో కలకలం సృష్టించింది. కొద్దికాలంగా స్థబ్దుగా ఉన్న ఆయన నాలుగైదు రోజుల నుంచి కిందిస్థాయి, సహచర, ఉన్నత అనే తేడా లేకుండా ఇంజినీరింగ్ అధికారులపై దూషణలకు దిగుతున్నాడు. వారి పరిధిలోని పనులకు సంబంధించిన బిల్లుల తయారీలో సంతకాలు పెట్టాలంటూ ఒత్తిడి తెస్తున్నాడు.
సెలవులో వెళ్లేందుకు ప్రయత్నం
సదరు డీఈ ఆగడాలు ఎక్కువవుతున్న క్రమంలో సెలవులో వెళ్లేందుకు అధికారులు సిద్ధపడుతున్నారు. నగరపాలకసంస్థలో ఇటీవల వరుసగా చోటుచేసుకుంటున్న ఆరోపణలు, ఫిర్యాదుల నేపథ్యంలో అధికారులు ముఖ్యంగా ఇంజినీరింగ్ అధికారులు ఒత్తిడిలో ఉన్నారు. ఈ క్రమంలో డీఈ సంతకాల కోసం దౌర్జన్యానికి దిగుతుండడంతో తాము సంతకాలు చేసి ఉద్యోగాలను ఫణంగా పెట్టలేమని అధికారులు పేర్కొంటున్నారు. దీనికన్నా సెలవులో వెళ్లడం మేలని, అవసరమైతే బదిలీకి కూడా సిద్ధపడుతున్నారు. కాగా నగరంలో అభివృద్ధి పనుల్లో జరుగుతున్న అక్రమాలు, సదరు డీఈ వ్యవహారంపై లోతుగా విచారణ జరిపించి ఆయన ఆగడాలకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉన్నతాధికారులపై ఉంది.
Comments
Please login to add a commentAdd a comment