ఒత్తిడికి చిత్తు కావొద్దు | software engineers suicides due to pressure | Sakshi
Sakshi News home page

ఒత్తిడికి చిత్తు కావొద్దు

Published Sun, Jan 19 2014 6:07 AM | Last Updated on Mon, Oct 22 2018 8:06 PM

software engineers suicides due to pressure

సెబర్‌సిటీ, న్యూస్‌లైన్:  లక్షల్లో సంపాదన...అయినా తీవ్ర మానసిక ఒత్తిడితో కొందరు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. బంగారం లాంటి భవిష్యత్‌ను మొగ్గలోనే తుం చేసుకుంటున్నారు. మరికొందరు వ్యాధులబారిన పడుతున్నారు. ఒత్తిళ్లను దూరం చేసుకుంటే ఆత్మహత్య ఆలోచన నుంచి బయటపడొచ్చని పలువురు మానసిక విశ్లేషకులంటున్నారు.

 ఐటీ నిపుణులు మానసిక ఒత్తిడిని జయించేందుకు అవసరమైన సూచనలపై ఇంటర్నేషనల్ స్ట్రెస్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ (ఇస్మా) ఫౌండర్ అండ్ ట్రస్టీ డాక్టర్ బి. ఉదయ్‌కుమార్ రెడ్డితో ‘సాక్షి’ వూట్లాడింది. ఒత్తిడికి కారణాలు, వాటిని తగ్గించుకొనేందుకు ఆయన ఇచ్చిన సూచనలు ఇవీ...
 మూడు రకాలు..

 సమస్యల్లో ఉన్న వ్యక్తి వూత్రమే ఒత్తిడికి గురవ్వాలని ఏం లేదు. ఎదుటి వారి కష్టాన్ని తమదిగా భావించి ఒత్తిడికి లోనయ్యే వారూ ఉంటారు.  ఇలాంటి వారికే కష్టం వస్తే ఇక అంతే సంగతులు. ప్రధానంగా ఒత్తిడి వుూడు రకాలు.

 మొదటి దశ: మొదటి దశలో నిరుత్సాహంగా ఉంటారు. ఒంటరిగా ఉండేందుకు ఇష్టపడతారు. విద్యార్థులైతే కళాశాల/పాఠశాలలకు, ఉద్యోగులైతే ఆఫీసులకు వెళ్లరు. వె ళ్లినా ఎవరితో మాట్లాడకుండా ఒంటరిగా గడుపుతారు. డ్రెస్‌సెన్స్ పాటించరు.

 రెండోదశ: చీటికి మాటికి చిరాకు పడతారు. తలనొప్పిగా ఉన్నట్టు ఫీలవుతుంటారు. రాత్రి నిద్రపోకుండా ఆలోచిస్తుంటారు. బంధువులతో గంటల తరబడి మాట్లాడదామని అనుకుంటారు. వారు మాట్లాడకపోతే కన్నీరు పెట్టుకుంటారు.

 మూడో దశ: సమాజం తనను వెలి వేసిందని అంటుంటారు. తమని తాము ఒంటరిగా భావిస్తుంటారు. నేను దీనికీ పనికిరానని అనుకుంటారు. ఆత్మహత్యకు పాల్పడే దశలో రెండు మూడు రోజుల ముందు తమ స్నేహితులతో చనిపోతేనే అన్ని సమస్యలకు తీరతాయని చెబుతుంటారు.

 యోగాతో ఎంచక్కా...
 ప్రతి మనిషిలోనూ పాజిటివ్, నెగిటివ్ ఆలోచనలుంటాయి. కొందరు తాను చేయబోయే ప్రతీ పనిలోను కష్టాలే ఎదురవుతాయేమోననే నెగిటివ్ ఆలోచనలతో ఒత్తిడికి గురవుతుంటారు. ఈ ఒత్తిడికి దూరంగా ఉండాలంటే ఈ తరహా నెగిటివ్ ఆలోచనలు ముందుగా దూరం చేసుకోవాలి. ఇందుకు యోగా ఎంతగానో దోహదపడుతుంది. నిత్యం యోగా చేసేవారు చలాకీగా ఉంటారు.

  అంతేకాదు ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. దీంతో ఇక ఒత్తిడికి గురయ్యే అవకాశమే ఉండదు.  ఇదే తరహాలో ఎరోబిక్స్ వంటి వ్యాయామాలు కూడా ఒత్తిడిని దూరం చేస్తారుు. సమస్యలతో బుర్రవేడెక్కినప్పుడు మంచి పాట విన్నా, సినిమా చూసినా, పుస్తకాన్ని చదివినా ఉపశమనం కలుగుతుంది. అంతేకాకుండా నాట్యం, ఫొటోగ్రఫీ వంటి వ్యాపకాలు ఒత్తిడిని దూరం చేస్తాయి.

 మనసైన వారితో కాసేపు..
 నగరంలోని ఐటీ ఉద్యోగుల్లో దాదాపు భార్యాభర్తలిద్దరూ ఉద్యోగం చేస్తుంటారు.  కెరీర్‌లో ఎదగాలనే తపనతో తమ సమయాన్నంతా ఆఫీసుకే అంకితం చేస్తారు. ఈ కారణంగా మనసైన వారితో కాసేపు గడిపేందుకు కూడా సమయం దొరకదు. దీంతో కుటుంబ సంబంధాలు కూడా దెబ్బతింటున్నాయి. దీనికి తోడు ఆఫీసులోని సమస్యలు కూడా ఉక్కిరిబిక్కిరి చేస్తుంటాయి.

 ఈ కారణాలతోనే చిన్న చిన్న సమస్యలకే భయపడిపోయి తమ జీవితాలనే అర్ధంతరంగా ముగించేస్తున్నారు. కుటుంబ సంబంధాలు మెరుగుపడి ఇంట్లో మనల్ని వెన్నుతట్టి ప్రోత్సహించే మనషుల అండదొరికితే ఎంతటి సమస్యలనైనా సులభంగా ఎదుర్కోవచ్చనే ధైర్యం కలుగుతుంది. అందుకే కుటుంబసభ్యులతో మనసు పంచుకోవడానికి వీకెండ్‌లో షికార్లలకు వెళ్లడం, పిల్లలతో కాసేపు కార్టూన్ నెట్‌వర్క్‌లు చూడడం, తల్లిదండ్రులతో కాసేపు కబుర్లు చెప్పడం వంటివి చేయాలి. ఇవి మనలోని ఒత్తిళ్లను దూరం చేస్తాయి.

 
 నోట్ రాసి సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య
 ఉప్పల్, న్యూస్‌లైన్: ‘కేవలం పని చేయడానికి, డబ్బులు సంపాదించడానికేనా జీవితం... స్నేహితులు లేరు.. బంధువు లేరు... జీవితంలో ఆనందం లేదు... నిత్యం ఒత్తిడి తోనే ఉద్యోగం చేయాల్సి వస్తుంది.. ఈ ఒత్తిడిని తట్టుకోలేక జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకుంటున్నా’ .. అమ్మా నన్ను క్షమించు... వచ్చే జన్మంటూ ఉంటే నీ కడుపునే పడతా.. అంటూ సూసైడ్ నోట్ రాసి’ విదేశాల్లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్న ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన ఉప్పల్‌లో శనివారం వెలుగులోకి వచ్చింది.

 పోలీసుల కథనం ప్రకారం...  ఉప్పల్ పద్మావతి కాలనీకి చెందిన యేశాల మార్కండేయ కుమార్తె నందిత(30) అమెరికాలోని పోర్ట్‌ల్యాండ్‌లో ఇంటెల్ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఎయిరో స్పేస్ ఇంజినీర్‌గా 2011 జనవరిలో చేరింది. తండ్రి మార్కండేయ ఏపీసీపీడీసీఎల్‌లో  అత్యున్నత స్థాయి ఉద్యోగం చేస్తూ ఐదేళ్ల క్రితం గుండెపోటుతో చనిపోయారు. తండ్రి మృతి చెందినప్పటి నుంచీ నందిత  తీవ్రమానసిక వేదనకు గురవుతోంది.  సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా నెలకు దాదాపు రూ. 10 లక్షల రూపాయలు సంపాదిస్తున్న ఆమెకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకపోయినప్పటికీ ఒంటరితనాన్ని ఆమె భరించలేకపోయింది.

 పని ఒత్తిడితోపాటు, మానసిక ప్రశాంతత లేకపోవడంతో జీవితంపై విరక్తి చెందింది. రెండు నెలల పాటు సెలవు పెట్టి సంక్రాంతి పండుగ కోసమని ఈనెల 9 న ఉప్పల్‌లోని ఇంటికి వచ్చింది. ఈనెల 16  సాయంత్రం ఇంట్లోని బెడ్‌రూంలోకి వెళ్లి సీలింగ్ ఫ్యాన్‌కు ఊరేసుకొని ఆత్మహత్య చేసుకుంది.  తల్లి పిలిచినా పలకక పోవడంతో అనుమానం వచ్చి చూసే సరికి ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది.

సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహానికి పోస్టుమార్టం చేయించి బంధువులకు అప్పగించారు. కాగా, నందిత ఆత్మహత్య చేసుకోవడానికి ముందే 14వ తేదీన సూసైడ్ రాసి ఇంట్లోని టేబుల్ డెస్క్‌లో పెట్టింది. కాగా, నందిత ఆత్మహత్య విషయం శనివారం వెలుగులోకి వచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement