వెంటనే విధుల్లో చేరండి | somesh Kumar appealed to the Commissioner of GHMC | Sakshi
Sakshi News home page

వెంటనే విధుల్లో చేరండి

Published Fri, Jul 10 2015 12:07 AM | Last Updated on Tue, Aug 14 2018 10:54 AM

వెంటనే విధుల్లో చేరండి - Sakshi

వెంటనే విధుల్లో చేరండి

జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్ విజ్ఞప్తి
పారిశుద్ధ్యానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు

 
సిటీబ్యూరో: ‘స్వచ్ఛ హైదరాబాద్’ సందర్భంగా సీఎం కేసీఆర్ తనంత తానుగా  వేతనాలు పెంచుతామన్నందున కార్మికులు సమ్మె విరమించి... వెంటనే విధుల్లో చేరాల్సిందిగా జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. రంజాన్, బోనాల పండుగలు, వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజలకు ఇబ్బందుల్లేకుండా చూడాల్సి ఉందన్నారు. గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, కార్మికుల సమస్యలు తీర్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. మంత్రులు కూడా కొంత సమయం కావాలని కోరారని చెప్పారు. ప్రభుత్వం సానుభూతితో వ్యవహరిస్తున్నందున కార్మికులు సానుకూలంగా వ్యవహరించాలని కోరారు. కార్మికుల సమస్యలను తనవిగా భావించి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సమ్మె వల్ల ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టినట్లు చెప్పారు. చర్చలకు తాను ఎప్పుడూ సిద్ధమేనని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తమవైపు నుంచి    ప్రతిపాదనలు పంపామని, నిర్ణయం తీసుకోవాల్సింది ప్రభుత్వమేనన్నారు. ప్రజా క్షేమం దృష్ట్యా ప్రత్యామ్నాయ ప్రణాళికతో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టామన్నారు. హోటళ్లు, దుకాణాల యజమానులు చెత్తను రోడ్లపై, బహిరంగ ప్రదేశాల్లో  వేయకుండా సహకరించాలని సూచించారు. చెత్తను డబ్బాల్లో వేసి.. రవాణా కేంద్రానికి తరలించేందుకు వాహనాలను సమకూర్చుకోవాల్సిందిగా కోరారు. అంతకుముందు పారిశుద్ధ్య కార్యక్రమాలపై స్పెషల్ కమిషనర్ నవీన్‌మిట్టల్, అడిషనల్ కమిషనర్లు రవికిరణ్, కెన్నెడిలతో కలిసి డిప్యూటీ కమిషనర్లు, వివిధ విభాగాల ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు.

ఇదీ ప్రత్యామ్నాయ ప్రణాళిక...
 చెత్త తరలింపు పనులకు 400 స్వచ్ఛ యూనిట్లకు 400 ప్రైవేట్ వాహనాలు. ఒక్కో వాహనానికి నలుగురు కార్మికులు. స్వచ్ఛ యూనిట్ల ఆధ్వర్యంలో పనులు. చెత్త తరలింపు పనులకు ఒక్కో స్వచ్ఛ యూనిట్ 20 మంది కార్మికులను నియమించుకోవచ్చు. ఒక్కొక్కరికి రోజుకు రూ. 350 వంతున చెల్లిస్తారు.జీహెచ్‌ఎంసీలోని 86 మాన్‌సూన్ ఎమర్జెన్సీ బృందాలకు చెందిన 400 మంది సిబ్బందిని వినియోగించుకుంటారు.
 
టౌన్‌ప్లానింగ్ నిఘా విభాగంలోని 18 వాహనాలకు చెందిన 60 మంది కార్మికుల సేవలను వినియోగించుకుంటారు.డిప్యూటీ కమిషనర్, ఏఎంఓహెచ్, ఈఈ, ప్రాజెక్ట్ ఆఫీసర్‌లతో కూడిన కోర్ కమిటీలు పారిశుద్ధ్య కార్యక్రమాలను నిరంతరం పర్యవేక్షిస్తాయి. పని చేసేందుకు ఆసక్తి కనబరిచే సెల్ఫ్‌హెల్ప్ గ్రూప్ మహిళలు, యువత, డ్రైవర్ల సేవలు వినియోగించుకుంటారు.జీహెచ్‌ఎంసీలో చెత్తను తరలించే కార్మికులు 2వేల మంది ఉన్నారని, ఈ ఏర్పాట్లతో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు. అద్దె వాహనాలకు ఒక్కోదానికి దాదాపు రూ. 5వేలవుతుందని అంచనా వేశారు.
 
నో వర్క్ .. నో పే
 విధుల్లో లేని కార్మికులకు వేతనాలు చెల్లించబోమని ఒక ప్రశ్నకు సమాధానంగా కమిషనర్ చెప్పారు. నో వర్క్.. నో పే అని స్పష్టం చేశారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement