మనం మరింత ‘స్మార్ట్’ | Sophisticated public facilities Broaden technology | Sakshi
Sakshi News home page

మనం మరింత ‘స్మార్ట్’

Published Fri, Aug 28 2015 12:16 AM | Last Updated on Sun, Sep 3 2017 8:14 AM

మనం మరింత ‘స్మార్ట్’

మనం మరింత ‘స్మార్ట్’

{పజలకు అత్యాధునిక సౌకర్యాలు
సాంకేతిక పరిజ్ఞానం విస్తృతం
విద్య, వైద్య, రవాణా రంగాల్లో ప్రగతి
{పభుత్వ సేవలు వేగవంతం

 
సిటీబ్యూరో: బైరామల్‌గూడకు చెందిన జయంత్ మాదాపూర్ వెళ్లాలనుకున్నాడు. సమయం సాయంత్రం 4 గంటలు. అప్పుడు బయలుదేరితే ఎక్కడ ఎంత ట్రాఫిక్ ఉందో తెలియదు. ట్రాఫిక్ జామ్‌తో ఎంతసేపు ఆగాల్సి వస్తుందో అంతుపట్టడం లేదు. ఎలా?
 
...వర్షం కురిసిన సమయంలో ఖైరతాబాద్ జంక్షన్ వద్ద భారీ ట్రాఫిక్ జామ్. ఇది తెలియక వివిధ ప్రాంతాల నుంచి అక్కడికి చేరుకున్న వారితో మరింత రద్దీ. అత్యవసర పనులపై వెళ్లాల్సిన వారు ముందుకు కద ల్లేని దుస్థితి.  

 ...ఇలాంటి సమస్యలకు త్వరలో పరిష్కారం లభించనుంది. ఎక్కడి నుంచి ఎక్కడకు వెళ్లాలనుకుంటున్నారో... ఆ మార్గంలో ట్రాఫిక్ స్థితిగతులు... రహదారులపై పరిస్థితిని ఆన్‌లైన్‌లో ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. తద్వారా ప్రయాణం చేయడమో...  లేక వాయిదా వేసుకోవడమో... ప్రత్యామ్నాయ మార్గం ఎంచుకోవడమో చేయవచ్చు. ఇవే కాదు. ఇతర సమస్యలూ ‘స్మార్ట్’గా పరిష్కారం కాబోతున్నాయి.

 ...ఇప్పటికే స్మార్ట్ సిటీ వైపు ప్రయాణాన్ని ప్రారంభించిన హైదరాబాద్‌ను కేంద్రం అధికారికంగా ‘స్మార్ట్’గా ప్రకటించడంతో నగర వాసులకు ‘ఆధునిక’ ఫలాలు అందబోతున్నాయి. ఈ- గవర్నెన్స్‌లో భాగంగా ఈ- ఆఫీస్, కాల్‌సెంటర్, ఆన్‌లైన్, మొబైల్ యాప్‌ల ద్వారా ఫిర్యాదుల స్వీకరణ, ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఉచిత వైఫై వంటి సేవలు ఇప్పటికే నగరంలో అందుబాటులో ఉన్నాయి. ఇకపై ఈ సేవలు మరింత మెరుగవనున్నాయి. సిటిజన్ చార్టర్ కచ్చితంగా అమలయ్యే అవకాశం ఉంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని ప్రజలు కార్యాలయాల దాకా వెళ్లకుండానే సదుపాయాలు కల్పించడం స్మార్ట్‌సిటీ ముఖ్య లక్షణం. వేగంగా సమాచార మార్పిడి, సత్వర సేవలతో అత్యంత నివాసయోగ్య నగరంగా మారబోతోంది.

 సత్వర సదుపాయాలకు...
 భవన నిర్మాణ అనుమతులతో పాటు చక్కనైన టౌన్‌ప్లానింగ్, మెరుగైన ప్రజా రవాణా, నీటి సరఫరా, పారిశుద్ధ్యం, అందరికీ భద్రత, డిజిటల్ టెక్నాలజీ విరివిగా వినియోగానికి స్మార్ట్ సిటీతో అవకాశం ఉంటుంది. కేవలం సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడమే కాక, ప్రజలకు ఏం కావాలో... వాటిని సత్వరం అందజేయడమే దీనిలక్ష్యమని సంబంధిత రంగాల్లోని వారు చె బుతున్నారు. ఇప్పటికే స్లమ్‌ఫ్రీ సిటీ, మల్టీ ఫ్లై ఓవర్లు, ఘన వ్యర్థాల నిర్వహణకు ఇంటింటికీ రెండు చెత్తడబ్బాలు వంటి వాటికి జీహెచ్‌ఎంసీ శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఈ అడుగులు ఇకపై మరింత వేగవంతమవుతాయి.
 
నీటి సమస్యకు  పరిష్కారం
గ్రేటర్ పరిధిలో జలమండలికి 8.64 లక్షల నల్లాలు ఉన్నాయి. వీటికి రోజువారీగా 365 ఎంజీడీల నీటిని సరఫరా చేస్తున్నారు.  ప్రధాన నగరంలో రెండు రోజులకోసారి, శివారు ప్రాంతాల్లో నాలుగు రోజులు.. కొన్ని ప్రాంతాల్లో వారం,పదిరోజులకోసారి నీటి సరఫరా చేస్తున్నారు. జలమండలి నల్లా కనెక్షన్ లేని భవంతులు పది లక్షలకు పైమాటే. మహా నగర వ్యాప్తంగా జలమండలి మంచినీటి సరఫరా నెట్‌వర్క్ లేకపోవడంతో శివారు వాసులు బోరుబావులు, ప్రైవేటు నీటి ట్యాంకర్లు, ప్రైవేటు ఫిల్టర్‌ప్లాంట్లపైనే ఆధార పడుతున్నారు. ఇంటింటికీ నల్లా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. నగరమంతటా మంచినీరు, మురుగునీటి పారుదల వ్యవస్థలకు సుమారు రూ.20 వేల కోట్లు అవసరం. దీనికోసం జలమండలి సిద్ధంచేసిన ప్రతిపాదనలు కాగితాల్లోనే మగ్గుతున్నాయి. స్మార్ట్‌సిటీగా ఎంపికైన తరుణంలోనైనా ఈ పథకాలకు మోక్షం లభిస్తుందని సిటీజనులు ఆశిస్తున్నారు.
 
ఆరోగ్య భాగ్యం
రాజధానిలో ప్రస్తుతం అనారో గ్యం రాజ్యమేలుతోంది. రోజు రోజుకూ పెరుగుతున్న కాలుష్యం... మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు నగర వాసుల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. దేశంలోనే అత్యధిక మధుమేహ బాధితులు హైదరాబాద్‌లో ఉన్నారు. హృద్రోగులు, క్యాన్సర్ బాధితులు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నారు. తమకు జబ్బు ఉన్నట్లు ఇప్పటికీ చాలా మందికి తెలియదు. బస్తీవాసులకు సీజనల్, లైఫ్ స్టయిల్ వ్యాధులపై అవగాహన లేకపోవడమే దీనికి కారణం. గ్రేటర్‌లో వందకు పైగా ప్రభుత్వ ఆస్పత్రులు, 40-50 వరకు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు, వెయ్యికి పైగా నర్సింగ్ హోమ్‌లు, క్లీనిక్స్ ఉన్నాయి. ఇవి రోగుల అవసరాలను పూర్తి స్థాయిలో తీర్చలేకపోతున్నాయి. సీజన్ మారిందంటే చాలు.. ఆస్పత్రుల్లో బెడ్డు దొరకని పరిస్థితి. డెంగీ, మలేరియా, స్వైన్ ఫ్లూ వంటి సీజనల్ వ్యాధులు గ్రేటర్ వాసులను అతలాకుతలం చేస్తున్నాయి. ఒకటి రెండు కార్పొరేట్ ఆస్పత్రులు మినహా మరెక్కడా టెలిమెడిసిన్ సేవలు అందుబాటులో లేవు.  క్షతగాత్రులను, హృద్రోగులను, నిండు గర్భిణులను ట్రాఫిక్ రద్దీని చేధించుకుని ఆస్పత్రికి తరలించేందుకు అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. ప్రతిష్టాత్మక ఉస్మానియా, గాంధీ, నిమ్స్, నిలోఫర్, ఫీవర్, సరోజినిదేవి, ఈఎన్‌టీ, ఛాతి, మానసిక చికిత్సాలయం రోగుల అవసరాలు తీర్చలేక పోతున్నాయి. చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్తే కొత్త రోగాలు వ్యాపిస్తున్నాయి. భాగ్యనగరం స్మార్ట్ సిటీగా అభివృద్ధి చెందితే ప్రజలకు ఆరోగ్య భాగ్యం దక్కుతుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది.
 
విద్యా ప్రమాణాల మెరుగుకు...

విద్యా రంగంలో హైదరాబాద్ స్మార్ట్ సిటీ కావడానికి అర్హతలన్నీ దాదాపుగా ఉన్నాయని చెప్పవచ్చు. కొన్ని అంశాల్లో మెరుగు పడాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ప్రాథమిక, మాధ్యమిక విద్యా విషయంలో ప్రభుత్వ పాఠశాలల్లో వసతుల పరిస్థితి దయనీయంగా మారింది. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా బోధనా సిబ్బంది లేకపోవడం... ఇప్పటికీ 70 శాతం ప్రభుత్వ పాఠశాలలకు సొంత భవనాలు లేకపోవడం గమనార్హం. లెక్కకు మిక్కిలిగా ఉన్న ప్రైవేటు పాఠశాలల్లో వసతులు ఫర్వాలేదనిపించినా... అర్హత గల ఉపాధ్యాయులు లేకపోవడం లోటే. ప్రభుత్వ, ఎయిడెడ్ కళాశాలల్లో విద్యార్థులు ఉండడం లేదు. సాంకేతిక విద్యకు సంబంధించి నగరం, పరిసర ప్రాంతాల్లో దాదాపు 150 ఇంజినీరింగ్ కళాశాలలు ఉన్నాయి. వీటిలో నాణ్యమైన విద్య ఏమేరకు అందుతోందనేది ప్రశ్నార్థకమే. నగరంలో 10 విశ్వవిద్యాలయాలు కొలువు దీరాయి. ఇందులో చారిత్రాత్మకమైన ఉస్మానియా, ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన జేఎన్‌టీయూహెచ్‌లూ ఉన్నాయి. సీసీఎంబీ, ఐఐసీటీ, హెచ్‌సీయూ తదితర సంస్థలు పరిశోధనా రంగంలో తమ వంతు పాత్రను పోషిస్తున్నాయి. హైదరాబాద్ స్మార్ట్ సిటీ కాబోతున్న నేపథ్యంలో నగర జనాభాకు అనుగుణంగా మరిన్ని వసతులు కల్పించడంతో పాటు విద్యా ప్రమాణాలు మెరుగుపడే అవకాశం ఉంది.
 
రవాణా సౌకర్యం...

నగరం రోజురోజుకూ విస్తరిస్తోంది. దీనికి అనుగుణంగా రవాణా సదుపాయాలు పెరగడం లేదు. గ్రేటర్ హైదరాబాద్‌లో కేవలం  3,800 సిటీ బస్సులు...నిత్యం 32 లక్షల మందికి సేవలందిస్తున్నాయి. పొరుగున ఉన్న బెంగళూరులో 6000 బస్సులు రోజూ 45 లక్షల మందికి రవాణా సదుపాయం కల్పిస్తున్నాయి. దీన్ని బట్టి మన నగరంలో ప్రజా రవాణా వ్యవస్థ ఎంత బలహీనంగా ఉందో తెలుసుకోవచ్చు. నగర శివార్లలోని వందలాది కాలనీలు ఇంకా రవాణా సౌకర్యానికిదూరంగానే ఉన్నాయి. ఎంఎంటీఎస్ సేవలూ అంతంతమాత్రమే. రెండో దశ పూర్తయితే తప్ప శివార్లకు ఈ సేవలు అందే అవకాశం లేదు.  మరోవైపు నగరంలో బస్ ట్రాక్‌లు, బస్ బేలు లేవు. దీంతో  కొద్దిపాటి దూరం చేరుకోవడానికే చాలా సమయం పడుతోంది. గ్రేటర్‌లో వాహనాల సంఖ్య 43 లక్షలకు చేరుకుంది. దీనికి అనుగుణంగా రోడ్లు విస్తరణకు నోచుకోవడం లేదు. సైకిళ్లకు ప్రత్యేక మార్గాలు లేవు. పాదచారులు నడిచేందుకు ఫుట్‌పాత్‌లు లేవు. కేవలం 8 శాతం రోడ్లపైనే అన్ని రకాల వాహనాలు, జనజీవనం కొనసాగుతున్నాయి. దీంతో వాహన వేగం దారుణంగా పడిపోయింది. ట్రాఫిక్ రద్దీతో గంటకు 15 కిలోమీటర్లు కూడా ముందుకు వెళ్లలేని పరిస్థితి. ఇటీవల  ప్రభుత్వం ముంబయి తరహా క్యూ పద్ధతికి, బస్ బేల నిర్మాణానికి చే సినప్రయత్నాలు ఒక్క అడుగు కూడా ముందుకు పడ లేదు. ఒకవైపు మెట్రో నిర్మాణం, మరోవైపు  ఇరుకు రహదారులు. మొత్తంగా నగరంలో రవాణా సదుపాయం నరకప్రాయంగానే ఉంది. ‘స్మార్ట్ సిటీ’గా రూపాంతరం చెందితే ఈ సౌకర్యాలు మెరుగయ్యే అవకాశం ఉంది.
 
ఎలా ఉండాలంటే...

 హైదరాబాద్ వంటి నగరంలో ఒక చోటు నుంచి మరో చోటుకు 45 నిమిషాల్లో చేరుకునేలా  సదుపాయాలు ఉండాలి.
రహదారులకు ఇరువైపులా కనీసం 2 అడుగుల వెడల్పుతో ఫుట్‌పాత్‌లు ఉండాలి.
{పత్యేకంగా సైకిల్ ట్రాక్‌లు ఉండాలి.
{పజలందరికీ రవాణా సౌకర్యం
24 గంటల పాటు నీటి సరఫరా
అన్ని ఇళ్లకూ నీటి కనెక్షన్లు.
మనిషికి 135 లీటర్ల వంతున నీటి సరఫరా
అందరికీ మరుగుదొడ్లు
పాఠశాలల్లో బాలలు, బాలికలకు వేర్వేరుగా    మరుగుదొడ్లు
వృధా నీటిని ట్రీట్‌మెంట్ చేయగలగాలి.
సివరేజి నెట్‌వర్క్ ఉండాలి.
ఇంటింటి నుంచి చెత్త సేకరణ
తడి,పొడి చెత్త వేర్వేరుగా సేకరణ
ఘన వ్యర్థాల రీసైక్లింగ్
అన్ని ప్రాంతాల్లో వరదనీటి కాలువలు
నీటి నిల్వ ప్రాంతాలు ఉండకూడదు.
అందరికీ విద్యుత్, 24 గంటల పాటు అందుబాటులో ఉండాలి. విద్యుత్ వృథా చేయకుండా   తగిన టారిఫ్
ఇంటింటికీ ఫోన్ సదుపాయం. వైఫై. 100 ఎంబీపీస్ స్పీడ్
టెలిమెడిసిన్ సదుపాయాలు అవసరం.
అత్యవసరంగా స్పందించే సమయం 30 నిమిషాలు.
జనాభాకు తగిన ట్టుగా వివిధ స్థాయిల్లో
ఆస్పత్రులు, విద్యా సౌకర్యాలు ఉండాలి.
వీటిని సాధించేందుకు సదుపాయాలు
కల్పించాలి. దీనికి కేంద్రం తనవంతుగా నిధులు అందజేస్తుంది.  
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement