స్వప్నాల దారిలో... | special chat with Hyderabad Metro Rail Managing Director | Sakshi
Sakshi News home page

స్వప్నాల దారిలో...

Published Sun, Jan 25 2015 12:07 AM | Last Updated on Tue, Sep 4 2018 3:39 PM

స్వప్నాల దారిలో... - Sakshi

స్వప్నాల దారిలో...

అది ఒక మహా స్వప్నం. వైవిధ్యభరితం.... భిన్న సంసృతుల సమ్మిళితమైన చారిత్రక భాగ్యనగరిని ప్రపంచ మహా నగరాల సరసన నిలబెట్టే మహత్తర యత్నం. అదే నిలువెత్తు ఒంటి స్తంభం పట్టాలపై పరుగులు తీసే నీలి అంచుల తెల్లటి అందమైన మెట్రో రైలు. ఈ కలల సాకార యత్నంలో ఎన్నో ఒడిదుడుకులు. మరెన్నో ఆటంకాలు. ఆ  ప్రతిబంధకాలనే నిచ్చెనమెట్లుగా మలుచుకొని...‘మెట్రో’ను పట్టాలెక్కించేందుకు ఆయన భగీరథ ప్రయత్నం సాగిస్తున్నారు. ఆయనే హైదరాబాద్ మెట్రో రైలు మేనేజింగ్ డెరైక్టర్... ఎన్‌వీఎస్ రెడ్డిగా అందరికీ తెలిసిన నల్లమిల్లి వెంకట సత్యనారాయణరెడ్డి. ‘ఆధునిక సాంకేతిక ఫలాలు సామాన్యుడి చెంతకు చేరాలనే దే నా లక్ష్యం. అంతర్జాతీయ ప్రమాణాలతో అన్ని వర్గాలకు అందుబాటులో మెట్రో రైలు ప్రయాణం ఉండాలనేది సంకల్పం. అప్పటి ప్రణాళికా సంఘ సభ్యుడు గజేంద్ర హల్దియాతో కలిసి ప్రాజెక్టు రూపురేఖలు, విధి విధానాల రూపకల్పనలో పాలు పంచుకోవడంతో నా సంకల్ప యాత్ర మొదలైందని చెప్పవచ్చు’ అంటారాయన. శనివారం మార్నింగ్ వాక్‌లో తన అంతరంగాన్ని, జీవన ప్రస్థానాన్ని ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే...    - సాక్షి, సిటీబ్యూరో
 
కొత్తగా ఆలోచిస్తేనే...
 
ఎనిమిదోతరగతిలో ఇంగ్లీష్ రాకపోవడంతో చాలా ఇబ్బంది పడ్డాను. దాంతో నెహ్రూ ‘డిస్కవరీ ఆఫ్ ఇండియా’ను తెలుగులోనే చదివా. ఇంటర్ వరకు ఇంగ్లీష్ బాధలు తప్పలేదు. డిగ్రీలో మా లెక్చరర్ వై.వెంకట్రామయ్య ఆంగ్లంలో ప్రావీణ్యున్ని చేశారు. మరో లెక్చరర్ డాక్టర్ రుద్రయ్య చౌదరి గొప్ప మేథావి. ఆ ఇద్దరి నుంచి విశాల దక్పథం అలవర్చుకున్నాను. జేఎన్‌యూలో రషీదుద్దీన్‌ఖాన్ అనే ప్రొఫెసర్ చక్కటి మార్గనిర్దేశం చేశారు. ఓపెన్ మైండ్‌తో ఉండడం, ఓటమికి వెరవకపోవడం నేను నమ్మిన ఫిలాసఫీ. తార్కిక దక్పథంతో ఆలోచించాలి. కొత్త విషయాలను నేర్చుకోవడం అలవాటు చేసుకుంటే వరుస విజయాలు సాధించవచ్చని నమ్మాను. ఆ నమ్మకమే నన్ను విజయం వైపు నడిపించింది. ప్రతి నిత్యం కొత్తగా ఆలోచించడం నేర్చుకుంటేనే ఏ రంగంలోనైనా విజయ శిఖరాలు అధిరోహించవచ్చన్న సూత్రాన్ని మనస్ఫూర్తిగా నమ్ముతాను.‘ డీస్కూలింగ్ సొసైటీ ’ అన్న పుస్తకం నా ఆలోచనలను బాగా ప్రభావితం చేసింది.
 
చేదు జ్ఞాపకం...

 
2008లో సత్యం కుంభకోణం వెలుగు చూసినపుడు మెట్రో పనులు దక్కించుకున్న మైటాస్ సంస్థ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. మెట్రో ప్రాజెక్టుపై నీలినీడలు క మ్ముకున్నాయి. మా టీం కూడా డీలాపడింది. నన్ను ఈ బాధ్యతల నుంచి తొలగించాలని అప్పటి ప్రభుత్వంపై ఇంటా బయటా ఒత్తిడి అధికమైంది. కానీ నేను ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. ఆ సమయంలోనే నాకు కొన్ని బహుళజాతి సంస్థల నుంచి మంచి అవకాశాలు వచ్చాయి. ఏడాదికి రూ.కోటికి పైగా జీతం ఇస్తామన్నారు. కానీ నేను అంగీకరించలేదు. ఎంతో శ్రమించి సాధించిన మెట్రో ప్రాజెక్టును మధ్యలో వదిలేయడం ఏ మాత్రం ఇష్టం లేదు. పైగా జట్టు సభ్యులు నాపై నమ్మకంతోనే ఈ ప్రాజెక్టులో పని చేసేందుకు ముందుకొచ్చారు. తిరిగి 2010లో ఎల్‌అండ్‌టీ సంస్థ మెట్రో పనులు దక్కించుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నాం. జీవితంలో ప్రతి దశలోనూ గెలుపోటములను సమంగా భావించాను. జీహెచ్‌ఎంసీలో అడిషనల్ కమిషనర్‌గా పని చేస్తున్నపుడు పంజగుట్ట ఫ్లైఓవర్ కూలిపోయింది. నన్ను తొలగించాలని ప్రభుత్వం పైన ఒత్తిడి. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్సార్ నిపుణులైన ఇంజినీర్ల బృందంతో వాస్తవాలను వెలికి తీయించారు. నా తప్పు లేదని తేలింది.  
 
రైతు కుటుంబం...

 
తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం కుతుకులూరు మా సొంతూరు. నాన్న సత్యనారాయణరెడ్డి. అమ్మ ఆదిలక్ష్మి. మాది రైతు కుటుంబం. మొదటి నుంచీ నాన్న గ్రామ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనేవారు. ఆ రాజకీయాల్లో పడిపోయి చాలా ఆస్తులు పోగొట్టుకున్నారు. అమ్మ ఎక్కువగా చదువుకోకపోయినా లోక జ్ఞానం తెలిసిన మనిషి. జీవిత పాఠాలు అమ్మ దగ్గరే నేర్చుకున్నాను. ఆమె నేర్పిన పాఠాలు... సమాజంలో మసలుకోవలసిన తీరు... మార్గదర్శకాలు ఇప్పటికీ నన్ను ముందుకు నడిపిస్తూనే ఉంటాయి. ఎలా జీవించాలో అమ్మ చెబితే... విధులు, బాధ్యతలు ఎలా నిర్వర్తించాలో మా తాత నుంచి నేర్చుకున్నాను. ఆయన నాకు మేనేజ్‌మెంట్ గురువు. ఆయన వ్యవసాయ పనులు నిర్వహించే తీరు చూసిన నేను చిన్నప్పుడే మేనేజ్‌మెంట్ పాఠాలు నేర్చుకున్నా.
 
డాక్టర్‌ను చేయాలనుకున్నారు...

 అమ్మానాన్నలు నన్ను డాక్టర్‌ను చేయాలని కలలుగన్నారు. నేను సివిల్స్ వైపు వెళ్లాను. హైస్కూల్ వరకు మా ఊళ్లోనే చదువుకున్నాను. రామచంద్రాపురం వీఎస్‌ఎం కళాశాలలో ఇంటర్ చదివాను. ఆ తరవాత సివిల్స్ లక్ష్యంగా బీఏలో చేరాను. అప్పుడు మా అమ్మానాన్న, టీచర్లు కోప్పడ్డారు. సైన్స్ గ్రూపు చదివి ఆర్ట్స్‌కు వెళ్లడమేమిటని ని లదీశారు. కొందరు ఎగతాళి చేశారు. నేను ఎవరి మాటా వినిపించుకోలేదు. డిగ్రీలో ఆంధ్రా యూనివర్సిటీ టాపర్‌గా నిలిచాను. ఆ తరవాత ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ వర్సిటీలో ఎంఏ పొలిటికల్ సైన్స్‌లో చేరాను. అప్పట్లో సివిల్స్‌కు ఎంపికయ్యే వారిలో అత్యధికులు అక్కడి వారే. తొలి ప్రయత్నంలో సివిల్స్‌లో విఫలమయ్యాను. రెండో ప్రయత్నంలో (1983లో) ఇండియన్ రైల్వే అకౌంట్స్ సర్వీసెస్ (ఐఆర్‌ఏఎస్)కు ఎంపికయ్యాను.పీజీలో మా పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ రషీదుద్దీన్ ఖాన్ నా సిద్ధాంత పత్రాలు చూసి..హార్వర్డ్‌లో ప్రొఫెసరయ్యే అర్హతలుండి...సివి ల్స్‌కు ప్రిపేరవ్వడం దండగనేవారు. కానీ నేను సివిల్స్ బాటనే ఎంచుకున్నా. ఆ తరువాత దక్షిణ మధ్య రైల్వేలోనూ, రాష్ట్ర ప్రభుత్వంలోనూ వివిధ పదవులు చేపట్టాను. ఎంఎంటీఎస్ మొదటి దశ రైలు పట్టాలెక్కించిన అనుభవం కూడా ఉంది.
 
కారల్‌మార్క్స్  ప్రభావం
 
నాపైన మార్క్సిజం ప్రభావం ఉంది. కారల్‌మార్క్స్ సాహిత్యం బాగా చదివాను. ప్రపంచంలో ఎందరో తత్వవేత్తలు ఉన్నప్పటికీ సగానికి పైగా ప్రపంచాన్ని కమ్యూనిజం వైపు మలుపు తిప్పిన గొప్ప తత్వవేత్త ఆయన. చార్లెస్ డార్విన్, కార్ల్ పాపర్, థామస్ కున్‌ల రచనలు బాగా ప్రభావితం చేశాయి. తెలుగు సాహిత్యం అంటే ఎంతో ఇష్టం. ఉన్నవ లక్ష్మీనారాయణ ‘మాలపల్లి’ చిన్నప్పుడే చదివాను. చలం, రంగనాయకమ్మ, బుచ్చిబాబు, తిలక్, ఆరుద్ర, విశ్వనాథ సత్యనారాయణ, సినారె, దాశరథి, గజ్జెల మల్లారెడ్డి వంటి ఎంతోమంది రచనలు బాగా చదివాను. శ్రీశ్రీ అంటే చాలా ఇష్టం.
 
 తీపి గుర్తులు...

 కొంకణ్ రైల్వే ప్రాజెక్టులో పని చేసేందుకు మెట్రో మ్యాన్ శ్రీధరన్ నన్ను ప్రత్యేకంగా ఎంపిక చేశారు. ఆయన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఆ ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేశాం. నగరంలో ఎంఎంటీఎస్ మొదటి దశ విజయవంతానికి శక్తివంచన లేకుండా ప్రయత్నించాను. మన రాష్ట్రంలో విద్యుత్ సంస్కరణలు మొదలైనపుడు నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలో ఫైనాన్స్ డెరైక్టర్‌గా చేరాను. రూ.500 కోట్ల నష్టంతో ఉన్న సంస్థను ఏడాది తిరిగే లోగా లాభాల బాట పట్టించడం మరిచిపోలేని తీపి జ్ఞాపకం.
 
పేరు    :    ఎన్వీఎస్ రెడ్డి
స్వస్థలం    :    తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం కుతుకులూరు
తల్లిదండ్రులు    :    సత్యనారాయణ రెడ్డి, ఆదిలక్ష్మి
భార్య    :    {పతిమ, కస్తుర్బా గాంధీ కళాశాలలో ఇంగ్లిష్ లెక్చరర్
పిల్లలు    :    ఇద్దరు అబ్బాయిలు. మొదటివాడు అర్జున్. అమెరికాలో ఎంఎస్ చేసి మెకిన్సే కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు.రెండోవాడు రాహుల్. నగరంలో బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్నాడు.
పుట్టిన తేదీ    :    13 ఏప్రిల్ 1957
అభిమాన నాయకులు    :    జవహర్‌లాల్ నెహ్రూ, మహాత్మాగాంధీ.
ఇష్టమైన ప్రదేశం    :    సింగపూర్
హాబీలు    :    పుస్తక పఠనం, కవితలు రాయడం, గార్డెనింగ్.
మధుర జ్ఞాపకం    :     చిన్నపుడు పాఠశాలలో రాసిన ఓ విప్లవ కవితకు మహాకవి శ్రీశ్రీ చేతుల మీదుగా ప్రశంసాపత్రం అందుకోవడం. కొంకణ్ రైల్వే ప్రాజెక్టును విజయవంతంగా పూర్తిచేసి నాటి ప్రధాన పీవీ నరసింహారావు నుంచి అవార్డు అందుకోవడం.
ఇష్టమైన ఆటలు    :     చిన్నప్పుడు కబడ్డీ బాగా ఆడేవాడిని.
ఇష్టమైన ఆహారం    :     చికెన్ కర్రీ, పాలకూర కర్రీ
సినిమాలు    :    గత 30 ఏళ్లుగా చూడలేదు. చిన్నప్పుడు శంకరాభరణం చూశా.
గుర్తుంచుకొనేవి    :    కొంకణ్ రైల్వే ప్రాజెక్టును పూర్తి చేయడం. తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల్లో మీటర్‌గేజ్ రైల్వే లైన్లను బ్రాడ్‌గేజ్‌లుగా మార్చే పనుల్లో కీలక బాధ్యతలు నిర్వహించడం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement