ఎన్‘ఫోర్స్’మెంట్
►అక్రమ నిర్మాణాల కట్టడికి ప్రత్యేక చర్యలు
►ఎన్‌ఫోర్స్‌మెంట్ సెల్ ఏర్పాటు యోచనలో జీహెచ్‌ఎంసీ
►టౌన్‌ప్లానింగ్‌కు సంబంధం లేకుండా ప్రత్యేక విభాగం
సిటీబ్యూరో: గ్రేటర్‌లో ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ అక్రమ నిర్మాణాలు ఆగకపోవడంతో.. వీటిని ఎప్పటికప్పుడు అడ్డుకొని, తగిన చర్యలు తీసుకునేందుకు ప్రత్యేకంగా వీటి కోసమే ఒక ఎన్‌ఫోర్స్‌మెంట్ సెల్‌ను ఏర్పాటు చేసేందుకు జీహెచ్‌ఎంసీ యోచిస్తోంది. ప్రస్తుతం భవన నిర్మాణాలకు అనుమతులిస్తున్న టౌన్‌ప్లానింగ్ విభాగంలోని అధికారులే అక్రమ నిర్మాణాల కూల్చివేతల చర్యలు తీసుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో లోపాయికారీగా అక్రమ నిర్మాణాలను చూసీ చూడనట్లు వదిలేస్తున్నారు. టౌన్‌ప్లానింగ్ విభాగం వారికే కూల్చివేతల అధికారాలుండటంతో సరైన చర్యలు తీసుకోవడం లేదని ఉన్నతాధికారులు భావిస్తున్నారు.
అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తే సస్పెన్షన్లే కాక ఏకంగా ఉద్యోగంలోంచే తీసివేస్తామని స్వయంగా మున్సిపల్ మంత్రి హెచ్చరించినా ఎక్కడా అక్రమాలు ఆగడంలేదు. బీఆర్‌ఎస్ పథకానికి గడువు ముగిశాక సైతం అక్రమంగా వెలసిన భవనాలు వేల సంఖ్యలో ఉన్నట్లు అధికారుల దృష్టికి వచ్చింది. బీఆర్‌ఎస్ గడువు తర్వాత వెలసిన భవనాలను గుర్తించేందుకు శాటిలైట్ చిత్రాలను ఉపయోగించి, తగిన చర్యలు తీసుకుంటామన్నప్పటికీ, అక్రమాలకు అడ్డుకట్ట పడలేదు. ఈ నేపథ్యంలో అనుమతులిచ్చేవారికి, అక్రమ నిర్మాణాలు జరిపే వారికి మధ్య ఉండే సంబంధాలు, పరిచయాలతోనే అక్రమ నిర్మాణాలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయనే అంచనాకు వచ్చిన ఉన్నతాధికారులు...అక్రమాలను ఎప్పటికప్పుడు అడ్డుకునేందుకు ఇతర అధికారులతో ఎన్‌ఫోర్స్‌మెంట్ సెల్‌ను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.
బీఆర్‌ఎస్ పేరిట అక్రమ నిర్మాణాలు వెలుస్తుండటాన్ని హైకోర్టు సైతం ఆక్షేపించిన నేపథ్యంలో, అక్రమ నిర్మాణాలను ఆరంభంలోనే కూల్చివేసేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ సెల్ అవసరమని అధికారులు భావిస్తున్నారు.ఈ సెల్‌లో ఎవరిని నియమించాలి.. గ్రేటర్ మొత్తానికి ఒకటే సెల్ ఏర్పాటుచేయాలా.. లేక జోన్ల వారీగా ఏర్పాటు చేయాలా.. తదితర అంశాల్లో స్పష్టత రావాల్సి ఉంది. అనుమతులిచ్చేవారికి, కూల్చివేతలు నిర్వహించేవారికి సంబంధం లేకుంటేనే అక్రమ నిర్మాణాలు నిలువరించవచ్చుననే తలంపుతో ఇందుకు సిద్ధమయ్యారు. అక్రమ నిర్మాణాలను ఎప్పటికప్పుడు అడ్డుకునేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ సెల్‌ను ఏర్పాటు చేయాలనే ఆలోచన గతంలోనూ చేసినప్పటికీ, కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడైనా అమల్లోకి వస్తుందో, రాదో వేచి చూడాల్సిందే.
ట్రిబ్యునల్‌తోనూ తగ్గనున్న వివాదాలు..
త్వరలోనే బిల్డింగ్ ట్రిబ్యునల్ ఏర్పాటు కానుండటంతో అక్రమ నిర్మాణాలు చేసేవారు ఇప్పటిలా కోర్టులకు వెళ్లి స్టేలు తెచ్చుకునేందుకు అవకాశముండదు. ట్రిబ్యునల్ పని ప్రారంభించాక కోర్టు వివాదాలు తగ్గనున్నప్పటికీ, అసలు అక్రమ నిర్మాణాలే రాకుండా ఉండాలంటే నిర్మాణం ఆరంభంలోనే కఠినచర్యలుండాలని, ప్రస్తుతం నిర్మాణాలు పూర్తయ్యేంతదాకా మౌనం వహిస్తుండటంతో విచ్చలవిడిగా అక్రమనిర్మాణాలు పుట్టుకొస్తున్నాయని ఎన్‌ఫోర్స్‌మెంట్ సెల్‌ఏర్పాటుకు యోచిస్తున్నారు. దీని ద్వారా కొత్తగా అక్రమ నిర్మాణాలు జరుగకుండా అడ్డుకోవచ్చునని భావిస్తున్నారు.