భూ వివాదాల పరిష్కారానికి ప్రత్యేక విధానం | Special policy to solve on land crisis | Sakshi
Sakshi News home page

భూ వివాదాల పరిష్కారానికి ప్రత్యేక విధానం

Published Fri, May 20 2016 2:31 AM | Last Updated on Wed, Aug 15 2018 9:30 PM

Special policy to solve on land crisis

- రెవెన్యూ శాఖ సమీక్షలో సీఎం కేసీఆర్
- ఆన్‌లైన్‌లో అందరికీ భూముల వివరాలు

 
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భూ వివాదాలను పరిష్కరించేందుకు ప్రత్యేకమైన విధానం అవసరమని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అభిప్రాయపడ్డారు. ప్రతి ఎకరా భూమికీ రికార్డు సక్రమంగా ఉండేలా విధానాన్ని రూపొందించాలని అధికారులను ఆదేశించారు. రెవెన్యూ అంశాలపై గురువారం క్యాంపు కార్యాలయంలో ఆ శాఖ ఉన్నతాధికారులతో ఆయన సమీక్షించారు. భూ దందాలను అరికట్టడంతో పాటు పేదలకు పంచిన భూములను సక్రమంగా వినియోగంలోకి తీసుకు రావడానికి పటిష్టమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ‘‘ఒకే భూమి పలువురి పేరిట రిజిస్టరవుతోంది.
 
 పట్టాదారు పాస్ పుస్తకాల్లోని వివరాలకు వాస్తవ వివరాలకు వ్యత్యాసం ఉంటోంది. ప్రభుత్వం ఇచ్చిన అసైన్డ్ భూములు ఎవరి అధీనంలో ఉన్నాయన్నది స్పష్టత రావాలి. సీలింగ్, భూదాన్ భూముల క్షేత్రస్థాయి పరిస్థితి ప్రభుత్వ రికార్డులకు పూర్తి భిన్నంగా ఉంది’’ అన్నారు. సాదా బైనామాలపై కొనసాగుతున్న భూములను హక్కుదారులు సత్వరం రిజిస్టర్ చేయించుకునేలా ప్రోత్సహించాలని అధికారులను ఆదేశించారు. ఈ అంశాలపై రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు, కలెక్టర్లు ప్రభుత్వానికి సూచనలు చేయాలని కోరారు. వరంగల్ కలెక్టర్, పెద్దపల్లి, సిద్దిపేట ఆర్డీవోలకు ఫోన్ చేసి వాస్తవ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.
 
 ఆన్‌లైన్‌లో భూముల వివరాలు
 భూమి రికార్డులన్నీ ప్రక్షాళన చేశాక, కంప్యూటరీకరించాలని, అవి ఆన్‌లైన్‌లో అందుబాట్లో ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. పేదలకు మూడెకరాల భూ పంపిణీని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఈవిధానం దోహదపడుతుందన్నారు. పేద వర్గాల్లో ప్రభుత్వం నుంచి ఎవరెవరు ఎంత భూమి పొందారు, వారికింకా ఎంత భూమివ్వాలి వంటి వివరాలు తెలుస్తాయన్నారు. దళితులకు మూడెకరాల భూమి ఇవ్వడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో వారికి ఆదాయ వనరు సమకూరుతుందన్నారు. మెరుగైన సాగు కోసం కమతాల ఏకీకరణకు రైతులను ప్రోత్సహించాలని అధికారులను కోరారు.
 
 హైదరాబాద్, వరంగల్ నగరాల్లో అర్బన్ ల్యాండ్ సీలింగ్ వ్యవహారాలను కలెక్టర్లకు అప్పగించాలని రెవెన్యూ ఉన్నతాధికారులను ఆదేశించారు. సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, ఆర్ధిక మంత్రి ఈటల రాజేందర్, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ ప్రశాంత్‌రెడ్డి, ఎంపీలు కేశవరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, బాల్క సుమన్, ఎమ్మెల్యేలు పువ్వాడ అజయ్, పాయం వెంకటేశ్వర్లు, సీసీఎల్‌ఏ రేమండ్ పీటర్, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి బీఆర్ మీనా, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు, ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్ తదితరులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement