
'శ్రీమంతుడు సక్సెస్ ఆనందంగా ఉంది'
హైదరాబాద్ : శ్రీమంతుడు చిత్రం ద్వారా యువత స్ఫూర్తి పొందితే చాలని ప్రిన్స్ మహేశ్ బాబు తెలిపారు. ఆదివారం హైదరాబాద్లోని తాజ్ కృష్టా హోటల్ లో శ్రీమంతుడు చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా హీరో మహేశ్ బాబు మాట్లాడుతూ.... శ్రీమంతుడు చిత్రం సక్సెస్ ఆనందంగా ఉందన్నారు. ఈ సినిమా సక్సెస్ ఇంత స్థాయిలో ఉంటుందని అసలు ఊహించలేదని వెల్లడించారు. ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించడం కూడా ఆనందాన్ని ఇచ్చిందని మహేశ్ చెప్పారు.
చిత్రంలోని 'సైకిల్' ఐడియా దర్శకుడు కొరటాల శివ చెప్పినప్పుడు చాలా కొత్తగా అనిపించిందన్నారు. తన తండ్రి స్వగ్రామమైన గుంటూరు జిల్లా బుర్రిపాలెం గ్రామాన్ని దత్తత తీసుకున్న తర్వాత తనకు స్పష్టత వస్తుందని మహేశ్ పేర్కొన్నారు. సినిమా కలెక్షన్ల కన్న గౌరవం చాలా ముఖ్యమని ఓ విలేకరి అడిగిన ఓ ప్రశ్నకు మహేశ్ సమాధానమిచ్చారు. తన కెరీర్లోనే శ్రీమంతుడు ఉత్తమ చిత్రమని పలువురు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారని మహేశ్ చెప్పారు.
కష్టపడి చదివి పరీక్ష రాసిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో... ఈ చిత్రం విడుదల సమయంలో తమ పరిస్థితి అలానే ఉందని ఈ దర్శకుడు కొరటాల శివ తెలిపారు. హీరో రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ... ఒకప్పుడు హీరో ఎలా ఉండేవాడు ... ఇప్పుడు ఎలా ఉన్నాడు... శ్రీమంతుడు తర్వాత ఎలా ఉన్నాడు అనే విషయం చాలా స్పష్టంగా తెలుస్తుందన్నారు.
శ్రీమంతుడుతో తెలుగు సినిమా ట్రెండ్ మారిందన్నారు. ఈ చిత్రం చూసి చాలా మంది ప్రేరణ పొందుతున్నారని రాజేంద్ర ప్రసాద్ చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నటులు జగపతి బాబుతోపాటు ఈ చిత్రంలో నటించిన పలువురు నటీనటులు హాజరయ్యారు. ప్రిన్స్ మహేశ్ బాబు, శ్రుతి హాసన్ జంటగా నటించి శ్రీమంతుడు ఆగస్టు 7 ప్రపంచ వ్యాప్తంగా విడుదలై కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్న సంగతి తెలిసిందే.