
ప్రతిభకు పట్టం.. సేవకు స్ఫూర్తి
⇒ ‘సాక్షి’ ఎక్సలెన్స్ అవార్డులకు ఎంపిక ప్రక్రియ మొదలు
⇒ ఎంట్రీలు పంపేందుకు ఈ నెల 25 వరకు అవకాశం
సాక్షి, హైదరాబాద్: ప్రతిభ, కృషి ఏ ఒక్కరి సొంతమో కాదు! సమాజమంతటికీ విస్తరించాలి. అసాధారణమైన ప్రతిభామూర్తులు, నిబద్ధత కలిగిన సంస్థల సామాజిక సేవ ఇంకా ఎందరెందరికో స్ఫూర్తి కావాలి. సమాజహితం కోసం జరిగే ఇలాంటి కృషి మరింత పెరగాలి. ఈ భావనతోనే ‘సాక్షి ఎక్సలెన్స్ అవార్డులు’ ఇవ్వడం ద్వారా లక్ష్య సాధనలో విశేష కృషి సల్పిన విజేతల్ని ప్రోత్సహించడంతో పాటు ఇతరులకు ప్రేరణ కల్పించేందుకు పూనుకుంది. ఇదే తలంపుతో అవార్డుల ప్రక్రియను ఒక సామాజిక బాధ్యతగా సాక్షి మీడియా హౌస్ చేపట్టి రెండేళ్లవుతోంది.
తెలుగునాట వివిధ రంగాలలో విశేషంగా కృషి చేస్తున్న పలువురు 2014, 2015లలో జరిగిన ప్రక్రియలో ఈ అవార్డులకు ఎంపికై ఎందరెందరిలోనో స్ఫూర్తిని రగిలించారు. కొత్త చిగుళ్లుగా ఎదుగుతున్న యువకిశోరాల నుంచి జీవన సాఫల్యం పొందిన మహామహుల వరకు ఈ అవార్డులు పొందిన వారిలో ఉన్నారు. అసాధారణ ప్రతిభ, విశేష సేవల్ని గుర్తించిన సాక్షి తగు రీతిన వారిని సత్కరించి తద్వారా ఇతరులకు స్ఫూర్తి, ప్రేరణ కలిగించింది. 2016కుగాను అవార్డు ఎంపిక ప్రక్రియ ఇటీవలే మొదలైంది. ఫిబ్రవరి 25 వరకు గడువుండటంతో ఎంట్రీలు అందుతున్నాయి. ఈ ప్రక్రియలో విశేషమేమంటే.. ఎవరికి వారు ఎంట్రీలు పంపే అవకాశం లేదు. విశేషంగా ప్రతిభ కనబరుస్తున్న, సేవలందిస్తున్న, లక్ష్యాలు సాధిస్తున్న విజేతల్ని గుర్తించి వారినెరిగిన ఇతరులెవరైనా ఈ ఎంట్రీలు పంపొచ్చు. ఆయా రంగాల్లో నిష్ణాతులైన వారు న్యాయనిర్ణేతలుగా ఉండే జ్యూరీలు తుది ఎంపిక జరుపుతాయి. మరిన్ని వివరాలకు లాగాన్ చేయండి:
www.sakshiexcellenceawards.com
సంప్రదించాల్సిన నంబర్: 040–23322330