సాక్షి, హైదరాబాద్: గోదాముల్లో బియ్యం (బాయిల్డ్ రైస్) నిల్వలకు అవసరమైన స్థలాన్ని చూపించాలని పౌరసరఫరాలశాఖ కమిషనర్ అకున్ సబర్వాల్ భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ)కి విజ్ఞప్తి చేశారు. డిమాండుకు సరిపడా గోదాముల సంఖ్యను పెంచాలని కోరారు. శుక్రవారం ఆయన ఎఫ్‌సీఐ అధికారులు, రైస్ మిల్లర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా అకున్ సబర్వాల్ మాట్లాడుతూ.. బియ్యం నిల్వలకు సరిపడా నిల్వ స్థలం చూపించడమే కాకుండా, బియ్యాన్ని ఎప్పటికప్పుడు గోదాముల్లో అన్‌లోడింగ్ చేసుకోవాలని ఎఫ్‌సీఐ అధికారులను కోరారు. నిల్వ సమస్య తీవ్రంగా ఉన్న నిజామాబాద్, కామారెడ్డి తదితర జిల్లాలపై దృష్టి సారించాలన్నారు.
ప్రస్తుతం రబీలో పౌరసరఫరాలశాఖ 39.11 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు లక్ష్యంగా పెట్టుకుందని, మిల్లర్ల నుంచి 23.93 లక్షల మెట్రిక్ టన్నుల (90%) బాయిల్డ్ రైస్‌ను ఎఫ్‌సీఐకి అందజేయాల్సి ఉందన్నారు. ఇందుకోసం 11 నుంచి 12 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వ స్థలం అవసరమన్నారు. ప్రతి రైస్ మిల్లు నుంచి ప్రతిరోజు 40 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఎఫ్‌సీఐకి అప్పగిస్తేనే అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటామని సబర్వాల్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment