తుర్కయంజాల్: ఫేస్‌బుక్‌లో ఇద్దరు క్లాస్‌మేట్లు చేసుకున్న కామెంట్ల వ్యవహారం ముదిరి.. ఓ యువకుడి ఆత్మహత్యాయత్నానికి దారి తీసింది. బుధవారం వనస్థలిపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ సంఘటన చోటు చేసుకుంది. బాధితుడి కథనం ప్రకారం.. వనస్థలిపురం శక్తినగర్‌లో నివాసముండే గుండా గోపికృష్ణ (20) కొత్తపేటలోని శ్రీరాం కళాశాలలో డిగ్రీ చదువుతున్నాడు. ఇతడి క్లాస్‌మేట్ అఖిల్.. ఫేస్‌బుక్ అకౌంట్‌లో ఉంచిన ఫొటోపై అసభ్యకరంగా కామెంట్లు చేసుకున్నారు. అంతటితో ఆగక అఖిల్... గోపికృష్ణకు ఫోన్ చేసి తిట్టాడు. మనస్తాపం చెందిన గోపీకృష్ణ వనస్థలిపురం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకై వెళ్లాడు.
ఎస్‌ఐ సైదులు వద్దకు వెళ్లి విషయం చెబుతుండగానే గోపికృష్ణను కొట్టుకుంటూ బయటకి తీసుకువచ్చాడు. మరో హోంగార్డు పద్మారావు గోపీకృష్ణపై చేయి చేసుకున్నాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన యువకుడు ఇంటికి వెళ్లి కిరోసిన్, అగ్గిపెట్టెతో ఈరోజు మధ్యాహ్నం వనస్థలిపురం పోలీస్‌స్టేషన్ వద్దకు వచ్చాడు. పోలీసు జులుం నశించాలని నినాదం చేస్తూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పక్కనే ఉన్న కానిస్టేబుల్ వెంటనే స్పందించి యువకుడిని అదుపులోకి తీసుకున్నాడు. పూర్తి వివరాలను తెలుసుకుని విచారణ చేపడతామని ఏసీపీ భాస్కర్‌గౌడ్ తెలిపారు..