చలిని చంపెయ్... స్టైల్‌ని పుట్టించెయ్
సాయంత్రం ఆరు దాటిందంటే చల్లగాలి మెలిపెడుతోంది. చేతులు, కాళ్లు పొడిబారి రంగు మారుతున్నాయి. అమ్మమ్మా తాతయ్యల్లా షాల్స్, స్వెటర్స్ వేసుకుని వెళ్లాలనే ఆలోచనకి ఇప్పుడు అవకాశమే లేదు. పైగా వెచ్చదనం వంకతో ఎన్నో స్టైలిష్ యాక్ససరీస్ ధరించే అవకాశం ఉన్న సీజన్ ఇది అంటున్నారు సిటీ స్టైలిస్ట్‌లు. మీ స్టైల్‌కి అనుగుణంగా స్టోల్స్, షాల్స్, ర్యాప్స్‌లతో చలిని చుట్టెయ్యమంటున్నారు. అప్పుడిక వింటర్ ‘వేర్’ అనడం మాత్రమే కాదు స్టైల్ ఈజ్ హియర్ అని కూడా అంటారిక.
షాల్స్‌ను దేవదాస్ తరహాలో వేసుకుని పాత కాలం హీరోల లుక్‌ని అబ్బాయిలు, అమ్మమ్మలను పోలిన లుక్‌ని అమ్మాయిలు క్యారీ చేయాల్సిన పనిలేదు. ముఖ్యంగా అమ్మాయిలకు నచ్చే విధంగా వివిధ రకాల షాల్స్, ర్యాప్స్ విరివిగా ఈ సీజన్‌లో సిటీలో లభ్యం. మాల్స్‌కి వెళ్లే పనెందుకు అనుకుంటే ఆన్‌లైన్‌లో టైప్ చేస్తే చాలు ఎన్నో వింటర్ వేర్ దుస్తులు ప్రత్యక్షం. మామూలు సీజన్‌లో కంటే వింటర్‌లో వులెన్, నెటెడ్ స్కార్ఫ్‌లకు ఎక్కువ గిరాకీ అని చెప్పారు ఆ యాక్సెసరీస్ విక్రయించే షోరూమ్ యజమాని వినోద్.
చలికి ‘టోపీ’పెట్టు...
ఈ సీజన్‌లో బయటికి వెళ్లి వస్తే చల్లగాలుల ధాటికి జుట్టు ఫుల్‌గా డ్రై అయిపోతుంది, సిటీలో కాంక్రీట్ నిర్మాణాల దుమ్ము ధూళితో స్కిన్, హెయిర్ మరీ పెళుసుగా మారుతాయి. అందుకని బయటకి వెళ్లినప్పుడు జుట్టు పూర్తిగా కవర్ చేసుకోవటం తప్పనిసరి. దీని కోసం టోపీలుండే జాకెట్‌లు వాడటం చాలా మందికి తెలిసిందే. అయితే ఇదే తరహాలో టోపీలుండే షాల్స్ ఇప్పుడు లేటెస్ట్ ఫ్యాషన్. షాల్స్‌తో పాటు క్లాక్ కేప్స్‌కి, స్కార్ఫ్‌స్‌కి టోపీలు అటాచ్ చేసి తయారు చేస్తున్నారు. విడివిడిగా వేసుకునే పనిలేదు. ప్రయాణాల్లోను ఎంతో కంఫర్ట్‌గా ఉంటాయి ఈ దుస్తులు. ఆన్‌లైన్‌లో హుడెడ్ షాల్స్, స్కార్ఫ్స్‌కి ఇప్పుడు గిరాకీ విపరీతం.
ఆకట్టుకునేలా చుట్టేసెయ్...
క్రోషే, వులెన్‌తో అల్లిన ర్యాప్స్, షాల్స్ ప్రతి వింటర్‌లో లేటెస్ట్‌గా అనిపించే ఫ్యాషన్ యాక్ససరీస్. క్రోషే అల్లికలో నగరంలో పలు చోట్ల శిక్షణ కూడా ఇస్తుండటంతో అమ్మాయిలు స్వయంగా తయారు చేసుకుని మరీ వీటిని ధరిస్తున్నారు. మన్నికతో పాటు లుక్స్‌లో ఎక్కడా కాంప్రమైజ్ కానివ్వవు నిట్టింగ్ దుస్తులు. స్టోల్స్, షగ్స్,్ర ర్యాప్స్, షాల్స్ ఇవే కాకుండా ఫర్ స్కార్ఫ్, క్రోషియా నిట్టింగ్ షాల్స్, స్లీవ్ ర్యాప్స్, వులన్ పాంచో, హుడెడ్ ర్యాప్, లేస్ ర్యాప్స్... ఇలా ఎన్నో రకాల చలిని చంపేస్తూ స్టైల్‌ని పుట్టించే యాక్సెసరీస్ వంటి మీద ఫ్యాషనబుల్‌గా ఉంటాయి. కాకపోతే కావలసిందల్లా వీటికి మీ స్టైల్, క్రియేటివిటీ కాస్త జోడించడమే.