గ్రేటర్ హైదరాబాద్‌లో చేతులు తడిపితేనే..
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సబ్ రిజిస్ట్రార్ల కాసుల కక్కుర్తి సాధారణ స్థిరాస్తుల దస్త్రావేజులను సైతం పెండింగ్‌లో పడవేసింది. దస్తావేజుల నమోదులో అక్రమాలకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. మియాపూర్ భూ కుంభకోణం నేపథ్యంలో తవ్విన కొద్ది సబ్ రిజిస్ట్రార్ల అక్రమాలు బయటపడుతూనే ఉన్నాయి. నిషేధిత ప్రభుత్వ భూములకు యథేచ్చగా రిజిస్ట్రేషన్ చేసిన సబ్ రిజిస్ట్రార్లు... సాధారణ దస్త్రావేజులకు మాత్రం అడిగినంత నజరానాలను ముట్ట చెప్పలేదని పెండింగ్‌లో పడేశారు. ఇటీవల రిజిస్ట్రేషన్ శాఖ ప్రత్యేక బృందాలతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహించగా భారీగా పెండింగ్ దస్తావేజులు వెలుగు చూశాయి.
హైదరాబాద్ మహా నగర పరిధిలోని 38 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహించగా సుమారు 2.517 దస్తావేజులు పెండింగ్‌లో ఉన్నట్లు తెలింది. వాటిని పరిశీలించిన అధికారులు కొన్ని దస్తావేజులపై సరైన కారణాలు పేర్కొనకుండానే పెండింగ్‌లో ఉంచినట్లు గుర్తించారు. ఎన్‌కంబరెన్స్ (ఈసీ) స్టేటస్ కూడా కనిపించకుండా సాంకేతిక తప్పిదాలు చేసినట్లు అధికారులు పసిగట్టారు. కనీసం పెండింగ్ కారణాలను రికార్డు చేసే మినిట్స్ బుక్ నిర్వహణ కూడా లేకపోవడం గమనార్హం.
పెండింగ్‌లోనూ టాప్: పెండింగ్ డాక్యుమెంట్ల జాబితాలో కూడా కూకట్‌పల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం అగ్రస్థానంలో నిలిచింది. కూకట్‌పల్లిలో 156, ఎల్బీనగర్‌లో 150, బాలనగర్‌లో 78 దస్తావేజులు వివిధ కారణాలతో పెండింగ్‌లో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దస్తావేజులకు స్టాంప్ డ్యూటీ వసూలు చేయకపోవడమే కాకుండా కనీసం మినిట్ బుక్ నిర్వహించకపోవడం గమనార్హం.
నిబంధనల ప్రకారం రిజిస్ట్రేషన్ చట్టం సెక్షన్ 71 కింద రిజిస్ట్రేషన్ వచ్చిన ప్రతి డాక్యుమెంట్‌ను అడ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యంతరాలు ఉంటే పెండింగ్‌లో పెట్టి తమ వద్దగల రికార్డులు పరిశీలించి ప్రభుత్వ స్ధలమా? కాదా నిర్థారించుకోవాలి. జిల్లారిజిస్ట్రార్ అనుమతితో 30 రోజుల్లో తగిన వివరణతో నమోదు కానీ, తిరస్కరణ కానీ చేయాల్సి ఉంటుంది. దస్తావేజుల నమోదుకు నిర్ధేశిత కారణాలపై అభ్యంతరాలు ఉంటే రిజిస్ట్రేషన్ ప్రక్రియను సబ్ రిజిస్ట్రార్ పెండింగ్‌లో పెట్టాలి. లేదా తిరస్కరించాలి. దరఖాస్తుదారుడు పేర్కొన్న కారణం సరైనదేనని భావిస్తే డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ పెండింగ్‌లో పెట్టి నాలుగు నెలలు గడువిచ్చే అధికారం సబ్ రిజిస్ట్రార్లకు ఉంది. గడువు దాటిన తర్వాత రిజిస్ట్రేషన్ చేయలంటే జిల్లా రిజిస్ట్రార్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. మరోవైపు సెక్షన్ 47 కింద మార్కెట్ విలువల్లో వ్యత్యాసం ఉంటే 50 శాతం స్టాంప్ డ్యూటీతో డాక్యుమెంట్‌ను పెండింగ్‌లో పెట్టి తదుపరి చర్యలకు జిల్లా రిజిస్ట్రార్లకు రెఫర్ చేయాల్సి ఉంటుంది.
గ్రేటర్ పరిధిలో పెండింగ్ రిజిస్ట్రేషన్లు..
రిజిస్ట్రేషన్ జిల్లా పెండింగ్ దస్తావేజులు
హైదరాబాద్ 210
హైదరాబాద్ సౌత్ 496
రంగారెడ్డి 1254
మేడ్చల్–మల్కాజిగిరి 557