ఒమర్‌గా మారిన సుబ్రహ్మణ్యం!
- ఆన్‌లైన్ ద్వారా ఐసిస్ వైపు ఆకర్షణ
- అరెస్టు చేసిన నగర సిట్ పోలీసులు
సాక్షి, హైదరాబాద్: నగరంలో మరోసారి ఐసిస్ కలకలం రేగింది. ఈ సంస్థకు సానుభూతిపరుడిగా ఉండి ముంబైకి చెందిన వ్యక్తి ప్రేరణతో విధ్వంసాలకు కుట్రపన్నుతున్న వ్యక్తిని నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) అధీనంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు శుక్రవారం అరెస్టు చేశారు. కృష్ణా జిల్లాకు చెందిన ఇతడి అసలు పేరు సుబ్రహ్మణ్యం అని, కొన్నాళ్ల క్రితం మతం మార్చుకుని ఒమర్‌గా మారాడని నగర అదనపు కమిషనర్ (నేరాలు, సిట్) స్వాతి లక్రా శుక్రవారం వెల్లడించారు. ఏపీలోని కృష్ణాజిల్లా చల్లపల్లికి చెందిన కొనకళ్ల సుబ్రహ్మణ్యం స్వస్థలంలోనే విద్యనభ్యసించాడు. ఇంటర్మీడియట్ చదువుతుండగా తనకున్న మరో వర్గం స్నేహితుల్ని చూసి స్ఫూర్తి పొందాడు. డిగ్రీ చదువుతుండగా 2014లో మతం మారిన సుబ్రహ్మణ్యం తన పేరును ఒమర్‌గా మార్చుకున్నాడు.
తన తండ్రి వెంకట నర్సింహారావుకు కూడా తెలియకుండా గుజరాత్ నుంచి వచ్చిన మత ప్రచారకులతో కలసి ఆ రాష్ట్రం వెళ్లిపోయాడు. దాదాపు 40 రోజుల పాటు వారితో గడిపిన ఒమర్... ఆపై అక్కడి సిద్ధాపూర్‌లోని ఓ మదర్సాలో చేరాడు. 9 నెలల పాటు ఉర్దూ సహా ఇతర అంశాలు నేర్చుకున్నాడు. కుమారుడి కోసం గాలించిన తండ్రి ఎట్టకేలకు గుర్తించి చల్లపల్లి తీసుకువెళ్లాడు. తండ్రి మందలించడంతో మళ్లీ ఇల్లు వదిలిన సుబ్రహ్మణ్యం ఈసారి తమిళనాడులోని కోయంబత్తూరు వెళ్లాడు. అక్కడి ఒమ్రా ప్రాంతంలో ఉన్న మరో మదర్సాలో చేరాడు. మరోసారి కుమారుడి ఆచూకీ గుర్తించిన తండ్రి అక్కడకు వెళ్లి ఇంటికి తీసుకువచ్చాడు.
ఫేస్‌బుక్‌లో పరిచయం... ఐసిస్ వైపు పయనం...
తండ్రితో ఉండటం నచ్చని ఒమర్... రెండేళ్ల కిందట నగరంలోని బాలానగర్‌లో ఉంటున్న బంధువుల వద్దకు వచ్చాడు. అక్కడే ఉంటూ సోడా బండి వ్యాపారం చేశాడు. ఫేస్‌బుక్ ద్వారా ముంబైకి చెందిన అబు క్వాహఫా అల్–హింద్‌తో ఇతడికి పరిచయమైంది. అతడితో ఫేస్‌బుక్, వాట్సాప్, టెలిగ్రామ్ ద్వారా తరచూ చాటింగ్ చేయడం ప్రారంభించాడు. అల్ హింద్ ఇచ్చిన స్ఫూర్తితోనే ఐసిస్ వైపు ఆకర్షితుడైన ఒమర్ ఆ ఉగ్రవాద సంస్థకు సానుభూతిపరుడిగా మారాడు. అతడి ఆహ్వానం మేరకు ముంబై వెళ్లిన ఇతగాడు మూడు రోజులు అక్కడే ఉండి వచ్చాడు. అల్‌హింద్ సూచనల మేరకు గుజరాత్, శ్రీనగర్, ఓమ్రాబాద్, అంబూర్‌ల్లో సైతం సంచరించాడు.
ఐసిస్ వైపు ఆకర్షితులను చేసే యత్నం...
ఒమర్‌కు ఫేస్‌బుక్ ద్వారా టోలీచౌకీలో నివస్తున్న వరంగల్‌కు చెందిన అమీర్‌తో పరిచయమైంది. వికలాంగుడైన ఇతడికి సహాయంగా ఉంటానంటూ అతడి ఇంట్లోకే మకాం మార్చాడు. అక్కడ ఉంటూనే ఫేస్‌బుక్ ద్వారా మరికొందరిని ఐసిస్ వైపు ఆకర్షితుల్ని చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. దీనిపై సమాచారం అందుకున్న సిట్ అధికారులు శుక్రవారం ఒమర్‌ను అరెస్టు చేశారు. ముంబైకి చెందిన అబు క్వాహఫా అల్–హింద్ పైనా కేసు నమోదు చేసిన అధికారులు అతడి కోసం గాలిస్తున్నారు.