ఆ పేర్లు పెట్టుకుంటే మీ అకౌంట్లు బ్లాకే!
సోషల్ నెట్‌వర్కింగ్ దిగ్గజం ఫేస్‌బుక్ ఈ మధ్య పేర్ల విషయంలో కాస్తా విచిత్రంగా ప్రవర్తిస్తోంది. కొందరి పేర్లు సమంజసంగా లేవంటూ వారి అకౌంట్లను ఫేస్‌బుక్ నిషేధించడం.. నెటిజన్ల నుంచి తీవ్ర ఆగ్రహానికి కారణమవుతుంది. మొన్నటికిమొన్న ఐఎస్ఐఎస్ పేరిట ఉన్న ఓ మహిళా సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఖాతాను ఫేస్‌బుక్ బ్లాక్ చేసింది. తాజాగా ఆస్ట్రేలియాలో నివసిస్తున్న ఓ ప్రవాస వియత్నం పౌరుడి విషయంలోనూ ఇలాగే ప్రవర్తించింది.
ఆయన పేరు ఫూ దట్ బిక్. కానీ ఆంగ్ల అక్షరాల్లో రాసేటప్పుడు (Phuc Dat Bich) ఆ పేరుకు వేరే దురార్థం వస్తుండటంతో ఆయన అకౌంట్‌ను ఇప్పటికే అనేకసార్లు ఫేస్‌బుక్ బ్లాక్ చేసింది. దీంతో ఫేస్‌బుక్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తాజాగా ఆయన ఓ పోస్టు పెట్టారు. తన అసలు పేరును ఇదేనని రుజువు చేస్తూ ఆయన తన పాస్‌పోర్టును పోస్టు చేశాడు. తన పేరును తప్పుబడుతూ హేళన చేస్తున్నవారి నోళ్లు మూయించే ప్రయత్నం చేశారు.
'నా పూర్తి చట్టబద్ధమైన పేరు చెప్పిన ప్రతిసారి ఎవరూ నన్ను నమ్మకపోవడం చాలా చికాకు కలిగిస్తున్నది. నేను తప్పుడు పేరు తప్పుదోవ పట్టిస్తున్నట్టు నన్ను అందరూ నిందిస్తున్నారు. ఇది చాలా బాధాకరం' అని పేర్కొంటూ ఆయన పెట్టిన పోస్టుకు 13వేలకుపైగా లైకులు, 65వేలకు పైగా షేర్లు వచ్చాయి. తను పేరును ఆంగ్లంలో 'Phuc Dat Bich' అని రాసినా దానిని ఫూ దట్ బిక్‌గా పలుకుతారని వివరించారు. ఇదేవిధంగా ఐఎస్ఐఎస్ ఆంగ్ల సంక్షిప్తనామంతో పేరు కలిగిన అమెరికా సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఐసీస్ యాంకలీ ఖాతాను ఫేస్‌బుక్ బ్లాక్ చేయడం విమర్శలకు తావిచ్చింది. ఫేస్‌బుక్ తనను ఉగ్రవాదిగా చూస్తోందని ఆమె నిరసన వ్యక్తం చేయడంతో తిరిగి ఆమె అకౌంట్‌ను పునరుద్ధరించారు.