
విదేశీయులపై నిఘా
ఎఫ్‌ఆర్‌ఆర్‌ఓతో పూర్తి సమన్వయం
ఇతర విభాగాల నుంచీ సమాచారం
వారి డేటా ఎప్పటికప్పుడు అప్‌డేట్
సన్నాహాలు చేస్తున్న స్పెషల్ బ్రాంచ్
సిటీబ్యూరో: నైజీరియాకు చెందిన సోలా, శ్యాంసన్ ఎబూపా, అటోబ్ బోషా కెల్విన్, ఉజోమ్ ప్రామిస్ 90 గ్రాముల కొకైన్‌తో ఫిబ్రవరిలో జూబ్లీహిల్స్ పోలీసులు పట్టుబడ్డారు. సోలా గతంలోనూ అనేకసార్లు అరెస్టు కాగా.. ప్రామిస్ వీసా గడువు ముగిసినా ఇక్కడే తిష్టవేశాడు. నైజీరియాకే చెందిన జాన్ ఉకో ఓకొన్ గంజాయితో సెప్టెంబర్‌లో గచ్చిబౌలి పోలీసులకు చిక్కాడు. గుర్తింపుపత్రాలను తనిఖీ చేయగా... ఇతడి వీసా గడువు ఏడాది క్రితమే పూర్తయినట్టు తేలింది.
బహదూర్‌పుర, ఎస్బీ విభాగం పోలీసులు ఇటీవల పాతబస్తీలోకి కిషన్‌బాగ్, ఎంఎం పహాడ్, కిస్మత్‌పూర్‌ల్లో తనిఖీలు చేపట్టారు. అవసరమైన అనుమతులు లేకుండా శరణార్థులుగా నివసిస్తున్న పలువురు బర్మా దేశీయుల్ని గుర్తించారు.
ఇలాంటి ఉదంతాలను పరిగణలోకి తీసుకున్న నగర నిఘా విభాగం (ఎస్బీ) అధికారులు సిటీలో నివసిస్తున్న విదేశీయులపై పటిష్ట నిఘా ఉంచాలని నిర్ణయించారు. ఇందు కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడానికి అదనపు పోలీసు కమిషనర్ వై.నాగిరెడ్డి సన్నాహాలు ప్రారంభించారు.
విద్య, ఉపాధి పేరుతో వచ్చి తిష్ట...
శరవేగంగా విస్తరిస్తున్న నగరంలో కుప్పతెప్పలుగా విద్య, ఉపాధి అవకాశాలు పుట్టుకొస్తున్నాయి. దీంతో నిత్యం అనేక మంది విదేశీయులు ఇక్కడికి వచ్చి ఇళ్లు అద్దెకు తీసుకుంటున్నారు. ఇలా వస్తున్న వారిలో సౌతాఫ్రికన్లు ఎక్కువగా ఉంటున్నారు. వీసా గడువు ముగిసినా అక్రమంగా నివసిస్తున్న సౌతాఫ్రికన్లు యథేచ్ఛగా నేరాలకు పాల్పడుతున్నారు. అంతర్జాతీయ డ్రగ్ రాకెట్స్‌లో కీలకపాత్ర పోషిస్తూ పెడ్లర్స్‌గా మారుతున్నారు. వీరిని గుర్తించి పట్టుకోవడానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం, సిబ్బంది నగర పోలీసులకు ప్రస్తుతం అందుబాటులో లేవు.
వెరిఫికేషన్ మెకానిజం కరువు...
ఈ నల్లజాతీయులే కాదు... వివిధ దేశాల నుంచి సిటీకి ఎంత మంది వస్తున్నారు? ఎక్కడ ఉంటున్నారు? వీసా గడువు ప్రకారమే నివసిస్తున్నారా? అసలు ఎంతమంది ఉన్నారు? గడువు ముగిశాక తిరిగి వెళ్తున్నారా? అనేవి తనిఖీ చేయడానికి పోలీసు విభాగంలో పక్కా మెకానిజం అంటూ లేదు. నగరానికి వచ్చే ముందు ఓ చిరునామాను ఇచ్చిన విదేశీయుడు ప్రస్తుతం అక్కడే ఉంటున్నాడా? అసలు అది నిజమైన అడ్రస్సేనా? అనేవి పరిశీలించడం సాధ్యం కావట్లేదు. ఎస్బీ విభాగం ప్రస్తుతం మాన్యువల్‌గా పని చేస్తుండటంతో పూర్తిస్థాయి నిఘా సాధ్యం కావట్లేదు.
ఎఫ్‌ఆర్‌ఆర్‌ఓ రాకతో మరో ఇబ్బంది...
ఫారెనర్స్ రిజిస్ట్రేషన్ అనేది కొన్నాళ్ల క్రితం వరకు స్పెషల్ బ్రాంచ్ పరిధిలోనే ఉండేది. ఆపై ఈ బాధ్యతలు కేంద్రం ఆధీనంలోని ఇమ్మిగ్రేషన్ బ్యూరోలోని ఫారెనర్స్ రీజనల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ (ఎఫ్‌ఆర్‌ఆర్‌ఓ) చేతికి వెళ్లింది. కేవలం బంగ్లాదేశ్, పాకిస్థాన్ నుంచి వచ్చే వారి రిజిస్ట్రేషన్లు మాత్రమే స్పెషల్‌బ్రాంచ్ చేస్తోంది. దీని వల్లా సమస్య ఉత్పన్నం అవుతోంది. మరోపక్క ఐక్యరాజ్య సమితి శరణార్థి గుర్తింపు కార్డులు ఎంత మందికి జారీ చేసిందనేదీ ఎస్బీకి స్పష్టంగా తెలియట్లేదు. ఇదీ విదేశీయులపై నిఘాకు నగర పోలీసులకు అడ్డంకిగా మారుతున్న పరిణామమే.
సాంకేతికతతో సమస్యల పరిష్కారం...
ఈ తరహా సమస్యలన్నింటికీ సాంకేతిక పరిజ్ఞానంతో అధిగమించాలని స్పెషల్ బ్రాంచ్ అధికారులు నిర్ణయించారు. సిటీ పోలీసు వద్ద అందుబాటులో ఉన్న విదేశీయుల డేటాతో పాటు ఎఫ్‌ఆర్‌ఆర్‌ఓ, ఇతర ఇమ్మిగ్రేషన్ విభాగాల నుంచీ ఎప్పటికప్పుడు సమాచారం సేకరించనున్నారు. వీటన్నింటినీ క్రోడీకరిస్తూ డేటాబేస్ ఏర్పాటు చేస్తున్నారు. ఫలితంగా సిటీకి ఎందరు, ఏ దేశాలకు చెందిన వారు ఉంటున్నారు? ఎక్కడ ఉంటున్నారు? వీసా గడువు ఏంటి? అనేవి ఎప్పటికప్పుడు తెలుస్తాయి. ఫలితంగా స్థానిక పోలీసుల సహకారంతో వారిపై నిఘా ఉంచడానికి ఆస్కారం ఏర్పడుతుంది.