
శివప్రసాద్‌రెడ్డి, మణిగాంధీలపై సస్పెన్షన్ ఎత్తివేత
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు శివప్రసాద్‌రెడ్డి, మణిగాంధీలపై రెండు రోజుల క్రితం విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేసినట్టు స్పీకర్ కోడెల శివప్రసాదరావు గురువారం అసెంబ్లీలో ప్రకటించారు. ప్రశ్నోత్తరాల అనంతరం సభ తిరిగి ప్రారంభమైన వెంటనే వైఎస్సార్‌సీపీ శాసనసభాపక్ష ఉప నేత జ్యోతుల నెహ్రూ సస్పెన్షన్ తొలగింపు విషయాన్ని స్పీకర్ దృష్టికి తెచ్చారు. సభ్యులు సభకు వచ్చి క్షమాపణ చెబితే ఎత్తివేయవచ్చని శాసనసభా వ్యవహారాలశాఖ మంత్రి యనమల చెప్పడంతో సభ్యులు సిద్ధంగా ఉన్నారన్న నెహ్రూ వారిని సభలోకి తీసుకువచ్చారు.
సభాసంప్రదాయాలకు ఆటంకం కలిగించారన్న ఆరోపణపై తనను, మణిగాంధీని గత మంగళవారం సస్పెండ్ చేశారని, అయితే తాము ఉద్దేశపూర్వకంగా సంప్రదాయాలను ఉల్లంఘించలేదని, సభలో తొలిసారి ఇలా మాట్లాడాల్సి వస్తోందని శివప్రసాదరెడ్డి అన్నారు. ఏదిఏమైనా జరిగిన దానికి క్షమాపణ చెబుతున్నానన్నారు. మణిగాంధీ మాట్లాడుతూ తమ నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడేందుకు స్పీకర్ అవకాశం ఇవ్వలేదని భావించి అలా వ్యవహరించామని, ఇందుకు సారీ చెబుతున్నానన్నారు. యనమల ప్రతిపాదించిన సస్పెన్షన్ ఎత్తివేత తీర్మానాన్ని మూజువాణి ఓటుతో సభ ఆమోదించినట్లు స్పీకర్ ప్రకటించారు.