జూరాల నుంచే నీళ్లు తీసుకోవాలి
- నారాయణపేట-కొడంగల్ ప్రాజెక్టుపై కోదండరాం డిమాండ్
- ఒరిజినల్ పాలమూరు పథకాన్ని కొనసాగించాలి
సాక్షి, హైదరాబాద్ : జలసాధన ఉద్యమాలు తెలంగాణకు కొత్త కాదని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ఎం.కోదండరాం అన్నారు. ఉద్యమాల ద్వారానే ఉమ్మడి రాష్ట్రంలో నల్లగొండ, జనగామ, కరీంనగర్‌లో సాగునీటి ప్రాజెక్టులు సాధించుకున్నట్లు తెలిపారు. అదే స్ఫూర్తితో నారాయణపేట-కొడంగల్ ప్రాజెక్టు కోసం ముందుకెళ్లాలన్నారు. నారాయణ పేట-కొడంగల్ ఎత్తిపోతల జలసాధన సమితి ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్‌లోని ప్రెస్‌క్లబ్‌లో రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది. దీనికి కోదండరాంతో పాటు కేంద్ర మాజీ మంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి, రిటైర్డ్ జస్టిస్ చంద్రకుమార్, గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ... ‘‘వెనుకబాటుతనం పోవడానికి నీరు అవసరం. వెనుకబడ్డ పడమటి పాలమూరు, రంగారెడ్డి జిల్లాలోని పరిగి వరకు సాగు, తాగునీరు అందించే ఉద్దేశంతో పాలమూరు-రంగారెడ్డి జిల్లా ఎత్తిపోతల పథకాన్ని రిటైర్డ్ ఇంజనీర్లు రూపొందించారు. జూరాల నుంచి నీటిని తీసుకోవడం ద్వారా వెనుకబడిన ప్రాంతాలను సస్యశ్యామలం చేయడమే ఈ ప్రాజెక్టు లక్ష్యం. అయితే ప్రభుత్వం శ్రీశైలం నుంచి పాలమూరు ఎత్తిపోతల పథకానికి నీటిని తీసుకోవాలని నిర్ణయించింది. దీనివల్ల నారాయణ పేట, కొడంగల్, మక్తల్, పరిగి, చేవెళ్ల ప్రాంతాలకు నీరు రాదు. ప్రభుత్వం జూరాల నుంచి నీటిని తీసుకొని నారాయణపేట- కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని అమలు చేయాలి. శ్రీశైలం నుంచి వచ్చే నీరు రానీయండి.
కానీ ఒరిజినల్ పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని మాత్రం కొనసాగించాలి’’ అని పేర్కొన్నారు. జైపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. 45 ఏళ్ల నుంచి ఎమ్మెల్యే, ఎంపీగా ఉన్న తనకు సీఎం కేసీఆర్ తీరు అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. కేసీఆర్‌కు ఎంపీగా ఐదేళ్లు అవకాశం ఇచ్చిన మూడు నియోజకవర్గాల ప్రజలపై కృతజ్ఞతతోనైనా జూరాల నికర జలాల ద్వారా వచ్చే నారాయణపేట-కొడంగల్ ప్రాజెక్టును పాత డిజైన్ ద్వారా చేపట్టాలని సీఎంకు సూచించారు. నారాయణపేట-కొడంగల్ ప్రాజెక్టు కోసం జీవో 69 జారీ చే సి, సర్వే పూర్తయిన తర్వాత ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లకపోవడం శోచనీయమని రిటైర్డ్ జస్టిస్ చంద్రకుమార్ అన్నారు. సమావేశంలో డీకే అరుణ, నాగం, సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, జలసాధన సమితి అధ్యక్షుడు అనంతరెడ్డి, పీసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్,దేవరకద్ర కాంగ్రెస్ ఇన్‌చార్జి పవన్‌కుమార్‌రెడ్డి, రైతు సంఘం అధ్యక్షుడు చంద్రారెడ్డి, సీపీఎం కార్యవర్గ సభ్యుడు భూపాల్, జేఏసీ కో- కన్వీనర్ వెంకటరెడ్డి మాట్లాడారు.