
ప్రజలను మోసం చేస్తే.. టీఆర్‌ఎస్‌కు బుద్ధి చెబుతాం
మహాజన పాదయాత్రలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని హెచ్చరిక
హైదరాబాద్: రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో విద్య, వైద్య రంగాలు దారుణంగా మారాయని, సీఎం కేసీఆర్ చెప్పిన డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఊసే లేదని, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాల పేరిట రూ.వేల కోట్ల ప్రజాధనం వృథా చేస్తున్నార ని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. హామీలు నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తే.. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీకి గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.
తమ్మినేని చేపట్టిన మహాజన పాదయాత్ర గురువారం రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో సాగింది. మంతన్ గౌరెల్లిలో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ ఈ ఊళ్లో 90 శాతం మంది పేదలు ఫ్లోరైడ్ వ్యాధితో బాధపడుతున్నారనీ, వీరిని వికలాంగులుగా గుర్తించి నెలకు రూ.1,500 పింఛన్ ఇవ్వాలన్నారు. మూడు రోజులపాటు 20 గ్రామాల్లో సాగిన మహాజన పాదయాత్ర బుధవారం సాయంత్రం ముగియగా, నల్లగొండ జిల్లా సరిహద్దులో నాయకులు తమ్మినేని బృందానికి వీడ్కోలు పలికారు.
రైతుల భూములను లాక్కోవద్దు
మర్రిగూడ: రిజర్వాయర్ల నిర్మాణం పేరిట రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కోవద్దని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రభుత్వాన్ని కోరారు. 123 జీవో ప్రకారం ఎకరం భూమికి రూ. 4.15 లక్షలు చెల్లించడం సరికాదన్నారు. సీపీఎం చేపట్టిన మహాజన యాత్ర గురువారం నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం వెంకపల్లితండాకు చేరుకుంది. తండాలో తమ్మినేని మాట్లాడుతూ.. ఒకవేళ రైతుల భూములను తీసుకోవాల్సి వస్తే కేంద్ర ప్రభుత్వం తెచ్చిన 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఎకరాకు రూ.32 లక్షల పరిహారమివ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. డిండి ప్రాజెక్టు నిర్మాణంలో కోల్పోతున్న ఒక్కో ఇంటికి రూ.7.5 లక్షలు చెల్లించి, ఇల్లు కట్టి ఇవ్వాలన్నారు.
ఉపాధి పనులను చేపట్టాలని సీఎం కేసీఆర్‌కు లేఖ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పనులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నందున వెంటనే ఉపాధి పనులు చేపట్టాలని సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కోరారు. ఈ మేరకు గురువారం సీఎం కేసీఆర్‌కు ఆయన లేఖ రాశారు. అలాగే, కొన్ని మండలాల్లో ఉపాధి కూలీలకు నెలల తరబడి వేతనాలివ్వలేదని పాదయాత్రలో తమ దృష్టికి వచ్చిందనీ, వెంటనే చెల్లించాలన్నారు.