ప్రాణం తీసిన 'ఫేస్‌బుక్' ఫొటో..
ప్రేమ వేధింపులతో వేధింపులు తాళలేక ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది.
హైదరాబాద్ (మీర్‌పేట్): ప్రేమ వేధింపులతో వేధింపులు తాళలేక ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. మీర్‌పేట్ ఠాణా పరిధిలోని ఓం సాయినగర్‌లో ఈ ఘటన జరిగింది. సీఐ రంగస్వామి కథనం ప్రకారం.. జిల్లెలగూడ మున్సిపాలిటీ పరిధిలోని ఓం సాయినగర్‌లో గల విజయహోమ్స్‌లో నివాసం ఉండే విష్ణుమూర్తి కూతురు మమత(19) ఇంటర్ వరకు చదివి ఇంట్లో ఉంటోంది. ఈమెకు గాయత్రీనగర్‌లోని నివాసం ఉండే మహేశ్వరం నాగరాజు(26)తో పరిచయం ఏర్పడింది. ఈ సాన్నిహిత్యంతో మమతను పెళ్లి చేసుకుంటానని ఆమెతో పాటుగా వారి కుటుంబసభ్యులకు సైతం తెలిపాడు. అయితే మమత ఇంట్లో వీరి వివాహానికి అభ్యంతరం తెలిపారు. దీంతో మమత కూడా నాగరాజును వివాహం చేసుకునేందుకు నిరాకరించింది.
ఈ క్రమంలో గతనెల 30న మమత పుట్టినరోజును పురస్కరించుకుని మమతతో కలిసి ఉన్న ఫొటోను నాగరాజు తన ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేశాడు. ఇది గమనించిన మమత మనస్తాపానికి గురై శుక్రవారం సాయంత్రం వంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటిచుకుంది. 90 శాతం కాలిన గాయాలతో ఉన్న ఆమెను చికిత్స కోసం గాంధీ ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతు శనివారం మృతి చెందింది. మృతురాలి తండ్రి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నామని నాగరాజును అదుపులోకి తీసుకున్నామని సీఐ తెలిపారు. ఇష్టంలేని పెళ్లికి బలవంతపెట్టడాన్ని తాళలేక తన కూతురు ఆత్మహత్యకు పాల్పడిందని ఫిర్యాదులో పేర్కొన్నాడు.