30నుంచి అసెంబ్లీ సమావేశాలు
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఈ నెల 30 నుంచి ప్రారంభం కానున్నాయి. వచ్చే నెల 3వ తేదీ వరకూ ఈ సమావేశాలు జరుగుతాయి. ఈ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వస్తుసేవల పన్ను బిల్లు(జీఎస్టీ)కు సవరణ బిల్లును ఆమోదించనుంది. ఈ నెల 30న ఉదయం 11 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతాయి.
జీఎస్టీ బిల్లను ఆమోదించడానికి ఈ నెల 30న శాసనసభను సమావేశపరచాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం అసెంబ్లీ వ్యవహారాల శాఖమంత్రి హరీశ్ రావు, అసెంబ్లీ కార్యదర్శి రాజా సదారాం, అడ్వకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి, న్యాయశాఖ కార్యదర్శి సంతోష్ రెడ్డి తదితరులతో సీఎం సమావేశం అయ్యారు.
రాజ్యాంగాన్ని సవరిస్తూ ఇటీవల పార్లమెంట్ జీఎస్టీ చట్టం తెచ్చిన విషయం తెలిసిందే. ఈ చట్టం అమల్లోకి రావడానికి దేశంలోని సగం రాష్ట్రాలు ఆమోదించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో జీఎస్టీ బిల్లుపై చర్చించడానికి ఈనెల 30న ఉదయం 11 గంటలకు అసెంబ్లీని సమావేశపర్చాలని స్పీకర్ మధుసూదనాచారిని సీఎం కోరారు. రాజ్యాంగ సవరణకు సంబంధించిన బిల్లు కాబట్టి సభ్యులకు పూర్తి వివరణ ఇవ్వడానికి అడ్వకేట్ జనరల్ రామకృష్ణారెడ్డిని ఈ సమావేశానికి ప్రత్యేక ఆహ్వానితుడిగా పిలవాలని కూడా స్పీకర్ ను ఈ సందర్భంగా సీఎం కోరారు.