ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన సచివాలయంలోని సీ బ్లాక్‌లో మంత్రివర్గం భేటీ అయ్యింది.
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం సోమవారం సమావేశమైంది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన ఇవాళ సాయంత్రం 5 గంటలకు సచివాలయంలోని సీ బ్లాక్‌లో మంత్రివర్గం భేటీ అయ్యింది. మంగళవారం ఉదయం 11 గంటలకు అసెంబ్లీ, కౌన్సిల్ ప్రత్యేక సమావేశాలు జరగనున్న నేపథ్యంలో సమావేశాల ప్రాధాన్యం, ఆమోదించాల్సిన కీలక అంశాలను భేటీలో చర్చించనున్నారు. కేంద్ర ప్రభుత్వం సూచించిన జీఎస్‌టీ బిల్లును ఆమోదించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ నేపథ్యంలో బిల్లు ప్రాధాన్యాన్ని చర్చించి అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు మంత్రివర్గం ఈ సమావేశంలో ఆమోదం తెలుపనుంది. అలాగే గతంలో దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయ పాలక మండళ్లలో సభ్యుల సంఖ్య పెంచుతూ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ను, సైబరాబాద్ కమిషనరేట్ విభజనకు సంబంధించిన ఆర్డినెన్స్‌నూ చట్టంగా మార్చేందుకు ఈ సమావేశంలోనే బిల్లును ప్రవేశపెట్టనున్నారు. మంత్రి వర్గ భేటీలో ప్రధానంగా ఈ మూడు అంశాలను ఎజెండాగా చేర్చినట్లు సమాచారం.