తెలంగాణ విజయోత్సవ సంబరాలు నిర్వహించాలని టీపీసీసీ నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జూన్ 1న రాత్రి నుంచి కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాష్ట్రమంతటా విజయోత్సవ వేడుకలు నిర్వహించాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నిర్ణయించింది. అందులో భాగంగా రాష్ట్రమంతటా రక్తదానం, అన్నదానం వంటి వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహించాలని తీర్మానించింది. ఆదివారం సాయంత్రం ఏఐసీసీ కార్యదర్శి ఆర్‌సీ కుంతియా అధ్యక్షతన గాంధీభవన్‌లో జరిగిన సమావేశంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలతోపాటు జిల్లా, మండల పరిషత్, మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు.
టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, కార్యనిర్వాహక అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మాజీమంత్రులు డీకే అరుణ, కె.జానారెడ్డి, డి.శ్రీనివాస్, దామోదర రాజనర్సింహ, షబ్బీర్‌అలీ, మాజీ ఎంపీలు వివేక్, పొన్నం ప్రభాకర్, నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆకుల లలిత, రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు వంశీచంద్‌రెడ్డి ఈ సమావేశానికి హాజరయ్యారు. జూన్ 1న అర్ధరాత్రి కొవ్వొత్తుల ప్రదర్శనను నిర్వహించడంతోపాటు తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించాలని తీర్మానించారు. అలాగే జూన్ 2న తెలంగాణ అంతటా పార్టీ పతాకాన్ని ఆవిష్కరించడంతోపాటు ఆసుపత్రుల్లో రోగులకు పండ్లు పంపిణీ చేయాలని నిర్ణయించారు. అదే సమయంలో ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కలను నెరవేర్చిన సోనియాగాంధీకి కృతజ్ఞతలు తెలియజేయాలని పార్టీ నిర్ణయించింది.
టీపీసీసీ సమన్వయ కమిటీ ఏర్పాటు
తెలంగాణలో అత్యధిక జిల్లా పరిషత్, మున్సిపల్ చై ర్మన్లను దక్కించుకునేందుకు అనుసరించాల్సిన వ్యూ హంపై చర్చించిన నేతలు కుంతియా చైర్మన్‌గా, పొన్నాల కన్వీనర్‌గా 8 మందితో సమన్వయ కమిటీని ఏర్పాటు చేశారు. జానారెడ్డి, ఉత్తమ్, డి.శ్రీనివాస్, రాజనర్సింహ, షబ్బీర్‌అలీ, గుత్తాసుఖేందర్‌రెడ్డి, వివే క్, పొన్నం ప్రభాకర్ ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. వీరంతా ఒక్కో జిల్లాకు సమన్వయకర్తగా వ్యవహరిస్తారు. మెదక్- ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మహబూబ్‌నగర్-జానారెడ్డి, నిజామాబాద్-డీఎస్, వరంగల్-షబ్బీర్‌అలీ, ఖమ్మం-గుత్తా సుఖేందర్‌రెడ్డి, నల్లగొండ- పొన్నం, కరీంనగర్-రాజనర్సింహ, ఆదిలాబాద్-వివేక్, రంగారెడ్డికి చిన్నారెడ్డిలను నియమించారు.
13నుంచి ఎన్నికల ఫలితాలపై సమీక్ష
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఓటమిపై జూన్ 13 నుంచి జిల్లాల వారీగా సమీక్షించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఈలోపు జిల్లాల వారీగా ఫలితాల సరళి, ఓటమికి గల కారణాలపై నివేదికలు తెప్పించుకుకోనున్నారు. ఇప్పటికే కొన్ని జిల్లాల నుంచి నివేదికలు అందినట్లు ఈ సమావేశం అనంతరం పొన్నాల మీడియాకు తెలిపారు.
జూన్ 1 రాత్రి నుంచి వేడుకలు
Published Mon, May 26 2014 1:48 AM | Last Updated on Thu, Sep 19 2019 8:44 PM
Advertisement