లక్ష మంది వచ్చినా ఇబ్బందులుండొద్దు
యాదాద్రిపై అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశం
► స్వామి దర్శనం చేసుకుని భక్తులు సంతృప్తితో వెనుదిరగాలి
► కొండపైకి వెళ్లివచ్చేందుకు వేరువేరు మార్గాలుండాలి
సాక్షి, హైదరాబాద్: ఒకేసారి లక్షమంది భక్తులు వచ్చినా ఎలాంటి ఇబ్బంది, అసౌకర్యం తలెత్తని విధంగా యాదాద్రి ఆలయం రూపొందాలని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. సాఫీగా స్వామి దర్శనం చేసుకుని భక్తులు సంతృప్తితో తిరిగి వెళ్లేలా పరిస్థితులు ఉండాలని పేర్కొన్నారు. ‘‘తెలంగాణలో యాదాద్రి ప్రధాన ఆలయం. యాదగిరి, లక్ష్మి నరసింహం, నరసింహ, నరసింహారావు, యాదయ్య... ఇలాంటి పేర్లు లేని ఊళ్లుండవు, మాఘం, చైత్యం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, ఫాల్గుణ మాసాల్లో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. కొంతకాలంగా సెలవు రోజుల్లో రద్దీ బాగా పెరిగింది. ఇలా ఒకేరోజు లక్ష మంది వస్తే సంతృప్తికర దర్శనంతోపాటు అందరికీ మంచి వసతి దొరకాలి, ఎక్కడా ట్రాఫిక్ చిక్కులు ఉండొద్దు.
రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు వస్తున్నందున యాదాద్రికి నలువైపులా నాలుగు లేన్ల రోడ్లు నిర్మించాలి, నాలుగు వరసల రింగు రోడ్డు, ప్రదక్షిణ మార్గాలను నిర్మించాలి. ప్రధాన గుట్టకు అభిముఖంగా ఉండే గుట్టపై అన్ని వసతులతో కూడిన కాటేజీలు ఏర్పడాలి. ఈశాన్య భాగంలో 13 ఎకరాల విస్తీర్ణంలోని గుట్టపై ప్రెసిడెంట్ సూట్ నిర్మించాలి. ఇప్పుడున్న బస్టాండ్, బస్ డిపోలను వేరేచోటికి మార్చాలి. పోలీసు, ఫైర్, హెల్త్ సేవలు మెరుగుపడాలి. వాటిని అత్యవసరంగా భావించాలి’’అని పేర్కొన్నారు. సోమవారం తన క్యాంపు కార్యాలయంలో యాదాద్రి అభివృద్ధి పనులను సీఎం సమీక్షించారు.
యాదాద్రిని గొప్పగా తీర్చిదిద్దేందుకు అవసరమైన నిధులు కేటాయించామని, కావాల్సినంత భూమిని కూడా సేకరించిపెట్టామని, ఇక మెరుగైన ప్రణాళికతో నిర్మాణాలు చేపట్టడమే మిగిలి ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. అనేక విశిష్టతలతో దేశంలోనే గొప్ప దివ్య క్షేత్రంగా మార్చాల్సి ఉన్నందున ఎలాంటి తొందరపాటుకు అవకాశం ఇవ్వకుండా ప్రత్యేక ప్రణాళికలతో పనులు చేపట్టాలని ఆదేశించారు. దేశంలోని ప్రధాన క్షేత్రాల్లో ఉన్న వసతులను గుర్తించి వాటిపై సూచనలు ఇవ్వాలని పేర్కొన్నారు.
అవతారాలన్నీ ప్రతిబింబించాలి
లక్ష్మినరసింహస్వామివారికి 32 అవతారాలున్నాయని, అవన్నీ యాదాద్రిలో ప్రతిబింబించాలని సీఎం అన్నారు. అక్కడి వివిధ ప్రాంతాలకు దేవుడి పేర్లను పెట్టాలని, వాటి ఉఛ్చారణతో భక్తులు అన్యాపదేశంగానైనా దైవనామస్మరణ చేసిన ఫలితం వస్తుందన్నారు. ఆలయ ప్రాంగణంలో దైవ స్తోత్రాలు, కీర్తనలు వినిపించే ఏర్పాటు చేయాలని ఆదేశించారు. యాదగిరీశుడికి ప్రత్యేక కీర్తనలు, వాగ్గేయకారులుండేవారన్నారు. ఆ కీర్తనలను సేకరించి ప్రాచుర్యంలోకి తేవాల్సి ఉందన్నారు. కింది నుంచి గుట్టపైకి భక్తులను తరలించేందుకు ఆలయ ప్రత్యేక బస్సులుండాలని, వచ్చి వెళ్లేందుకు వేర్వేరు దారులు అవసరమని, దిగువకు వచ్చేందుకు కొత్తమార్గం నిర్మించాలని, మెట్లు కూడా అభివృద్ధి చేయాలని పేర్కొన్నారు.
మార్గాలు, గుట్టపైన ప్రకృతి రమణీయంగా ఏర్పాట్లు చేయాలన్నారు. సువాసనలు వెదజల్లే మొక్కలను పెంచాలని, భక్తులకు క్యూలైన్లలో ఆహారం, పానీయాలు అందించాలని సూచించారు. ఆలయ అభివృద్ధికి వ్యాపారులు సహకరిస్తున్నందున వారి ఉపాధి కోసం కింద నిర్మించే షాపింగ్ కాంప్లెక్స్‌లో దుకాణాలు కేటాయించాలన్నారు. చేతి వృత్తులు, చేనేత వస్త్రాలను పోత్రహించాలని పేర్కొన్నారు. కొండపై నిద్రించి స్వామివారికి సేవ చేయాలనుకునే భక్తులకు, మండల దీక్షాచరించే భక్తులకు సమీపంలోనే వసతి ఉండాలని, అర్చకులకు కూడా చేరువలోనే నివాస సముదాయాలుండేలా ప్లాన్ చేయాలని ఆదేశించారు. సమీపంలోని 85 ఎకరాల అటవీ భూములను సద్వినియోగం చేసుకోవాలన్నారు.