
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా డిమాండ్ ఉన్న వైద్య విద్యపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఏటా ప్రభుత్వ వైద్య కాలేజీల సంఖ్యను పెంచుతోంది. ప్రైవేటు వైద్య కాలేజీల సంఖ్యకు పోటీగా ప్రభుత్వ కాలేజీలో సీట్లు పెరుగుతున్నాయి. గతేడాది మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రభుత్వ కాలేజీ ఏర్పాటైంది. సిద్దిపేటలోనూ ప్రభుత్వ కాలేజీ ఏర్పాటు ప్రక్రియ చివరికి వచ్చింది. వచ్చే విద్యా సంవత్సరంలో సిద్దిపేట కాలేజీలో అడ్మిషన్లు జరిగేలా వైద్య, ఆరోగ్య శాఖ ఏర్పాట్లు చేస్తోంది. తాజాగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నల్లగొండ, సూర్యాపేటజిల్లాల్లో కొత్తగా వైద్య కాలేజీలను ఏర్పాటు చేస్తామని ఇటీవల ప్రకటించారు. నల్లగొండ, సూర్యాపేట జిల్లా కేంద్రాల్లో ప్రభుత్వ వైద్య కాలేజీల ఏర్పాటుకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు వైద్య, ఆరోగ్య శాఖ ఏర్పాట్లు చేస్తోంది. వైద్య కాలేజీకి అనుమతి రావాలంటే కనీసం 400 పడకల ఆస్పత్రి ఉండాలి. నల్లగొండలోని జిల్లా ఆస్పత్రిలో 250 పడకలు ఉన్నాయి. ఇటీవల 150 పడకల చొప్పున రెండు బ్లాకులను నిర్మించి ప్రారంభించారు. అన్ని కలిపి 550 పడకలు ఉన్నాయి. దీంతో ఇక్కడ కాలేజీ భవనాల నిర్మాణం, పరికరాలు, ఇతర వసతుల కల్పనపై దృష్టి పెట్టారు.
సూర్యాపేటలో స్థలం సమస్య..
సూర్యాపేట జిల్లా కేంద్రంలో ప్రస్తుతం 100 పడకల ఆస్పత్రి ఉంది. ఇందులోనే అదనంగా 300 పడకలు ఏర్పాటు చేసేందుకు వైద్య విద్య డైరెక్టరేట్ (డీఎంఈ) కార్యాలయం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే ఆ నిర్మాణ ప్రక్రియ మొదలుకానుంది. సూర్యాపేటలో వైద్య కాలేజీ నిర్మాణానికి ప్రభుత్వ స్థలం అందుబాటులో లేకపోవడం ఇబ్బందిగా మారింది. ఈ పరిస్థితుల్లో కాలేజీ నిర్మాణ స్థలంపై సందిగ్ధత వీడట్లేదు.
300 సీట్లు పెరిగే అవకాశం..
మొత్తానికి రెండేళ్లలో సిద్దిపేట, నల్లగొండ, సూర్యాపేటలో కలిపి మూడు ప్రభుత్వ వైద్య కాలేజీలు ఏర్పాటు కానున్నాయి. ఒక్కో కాలేజీలో సగటున 100 సీట్లకు అనుమతులొచ్చినా మొత్తం 300 సీట్లు అందుబాటులోకి రానున్నాయి. 150 సీట్ల చొప్పున అనుమతి వస్తే కొత్త సీట్ల సంఖ్య 450 ఉండనుంది. ప్రభుత్వ కాలేజీలు పెరుగుతుండటంతో పేద కుటుంబాల పిల్లల్లో ఎక్కువ మందికి వైద్య విద్యనభ్యసించే అవకాశం కలగనుంది. అన్ని కేటగిరీలు కలిపి తెలంగాణలో ప్రస్తుతం 22 వైద్య కాలేజీలు ఉన్నాయి. వీటిలో 6 ప్రభుత్వ, 1 ఈఎస్‌ఐ, 3 ప్రైవేటు మైనారిటీ, 12 ప్రైవేటు కాలేజీలు ఉన్నాయి. అన్ని కాలేజీల్లో కలిపి 3,200 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. 6 ప్రభుత్వ కాలేజీల్లో కలిపి 1,000 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment