తగ్గిన తెలంగాణ నేతల గ్రాఫ్
►18 మంది ఎమ్మెల్యేలపై పెదవి విరుపు
►టీఆర్‌ఎస్‌లో చేరి.. ప్రజలకు దూరమైన నేతలు
►బీజేపీలో కిషన్‌రెడ్డి పైకి, మిగిలినవారు కిందకు
►ఎంఐఎంలో అక్బర్, పాషాఖాద్రి జోష్
సిటీబ్యూరో: నగరంలో నేతలు ప్రజలకు చేదవుతున్నారు. వారి పనితీరుపై ఎన్నుకున్నవారే పెదవి విరుస్తున్నారు. ఈ విషయం ముఖ్యమంత్రి కేసీఆర్ సొంతంగా చేయించిన సర్వేలో తేలింది. ఇందులో మెజారిటీ ఎమ్మెల్యేలు ప్రజాదరణకు దూరవుముతున్నట్టు గుర్తించారు. విచిత్రంగా ఒకే పార్టీలో కొందరు ఎమ్మెల్యేల గ్రాఫ్ ఘోరంగా పడిపోతే, మరికొందరిది అదే స్థాయిలో పెరిగింది. ఇలా పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలకు ప్రజాదరణ తగ్గినట్టు సర్వే తేల్చింది.
ఆర్నెళ్ల క్రితం చేసిన సర్వేలో కేవలం ముగ్గురు శాసనసభ్యులు 50 శాతం కంటే తక్కువ ప్రజాదరణ గ్రాఫ్‌లో ఉండగా, తాజా సర్వేలో ఈ సంఖ్య 18 మంది ఎమ్మెల్యేలకు పెరిగింది. అందులో టీఆర్‌ఎస్ నుంచి నేరుగా గెలిచిన వారితో పాటు, ఆ పార్టీలో చేరిన అందరూ ఉండడం గమనార్హం. జూబ్లీహిల్స్, మల్కాజిగిరి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, చింతల కనకారెడ్డి, ఎం.కిషన్‌రెడ్డి ప్రజాదరణ దారుణంగా ఉండగా, రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ పరిస్థితి ఘోరంగా ఉందని తేలింది. టీడీపీకి మిగిలిన ఏకైక ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య (ఎల్బీనగర్) కూడా ప్రజాదరణకు దూరమయ్యారు.
గులాబీ నీడలో తగ్గిన ఆదరణ
తెలుగుదేశం పార్టీ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, ఎం.కృష్ణారావు (కూకట్‌పల్లి), కేపీ వివేకానంద్(కుత్బుల్లాపూర్) మంచిరెడ్డి కిషన్‌రెడ్డి (ఇబ్రహీంపట్నం), మాగంటి గోపీనాథ్ (జూబ్లీహిల్స్) ఆర్నెళ్లలో ప్రజాదరణకు బాగా దూరమైయ్యారు. మహేశ్వరం ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి సైతం ఆరుశాతం జనంలో వ్యతిరేకతను పెంచుకున్నారు. వీరిలో ముఖ్యంగా సనత్‌నగర్ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న శ్రీనివాస యాదవ్ ఆర్నెళ్ల క్రితం వరకు 80.40 శాతం ప్రజాదరణతో నగరంలోనే టాప్‌లో ఉండగా, తాజా సర్వేలో 57.50 శాతానికి పడిపోయారు. మిగిలిన వారిలో అరికెపూడి గాంధీ (శేరిలింగంపల్లి), సాయన్న (కంటోన్మెంట్) గ్రాఫ్ 13 శాతం పెరగ్గా, ప్రకాష్‌గౌడ్ (రాజేంద్రనగర్) 08 శాతం మెరుగుపరుచుకున్నారు.
కిషన్‌రెడ్డి పైకి.. లక్ష్మణ్, చింతల కిందకు
బీజేపీ అభ్యర్థిగా విజయం సాధించిన జి.కిషన్‌రెడ్డి (అంబర్‌పేట) గడిచిన ఆర్నెళ్లలో సుమారు 19 శాతం జనాదరణతో గ్రేటర్‌లో అత్యధిక జనామోదం కలిగిన నేతగా నిలిచారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్Š æపరిస్థితి మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది. ముషీరాబాద్ నియోజవర్గంలో గడిచిన ఆర్నెళ్లలో ఆయన 8 శాతం ఆవరణ కోల్పోయారు. అదే తరహాలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ఆర్నెళ్ల క్రితం 78.60 అత్యధిక ప్రజాదరణతో ముందుండగా, తాజా సర్వేలో ఏకంగా 34.80 శాతానికి పడిపోయారు. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఐదుశాతం జనానికి దూరం కాగా, ఉప్పల్ ఎమ్మెల్యే ప్రభాకర్ ఏకంగా 26 శాతం జనాదరణను కోల్పోయారు.
ఎంఐఎంలో అక్బర్, ఖాద్రీ సేఫ్
నగరంలో ఏడుగురు ఎమ్మెల్యేలున్న ఎంఐఎంలో అప్సర్ మోహినొద్దీన్ (కార్వాన్), అహ్మద్ బలాలా (మలక్‌పేట), జాఫర్ హుస్సేన్(నాంపల్లి) గ్రాఫ్ పడిపోయింది. శాసన సభాపక్ష నాయకుడు అక్బరుద్దీన్ ఒవైసీ (చంద్రాయణగుట్ట), పాషాఖాద్రి (చార్మినార్), ముంతాజ్‌ఖాన్ (యాఖుత్‌పురా), మోజంఖాన్ (బహుదూర్‌పురా) గ్రాఫ్ భేషుగ్గా ఉందని సీఎం సర్వే తేల్చింది.