గ్రేటర్ మేనిఫెస్టో, బడ్జెట్, మంత్రిత్వ శాఖల మార్పులే ఎజెండా!
కేటీఆర్‌కు మున్సిపల్ శాఖ అప్పగింతపై నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: వచ్చే బడ్జెట్ సమావేశాలు, మంత్రిత్వ శాఖల మార్పులు, గ్రేటర్ ఎన్నికల మేనిఫెస్టో ఎజెండాగా రాష్ట్ర మంత్రివర్గం ఆదివారం సమావేశం కానుంది. మధ్యాహ్నం రెండున్నర గంటలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన ఈ భేటీ జరుగనుంది. గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఘన విజయం నేపథ్యంలో ఈ కేబినెట్ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇటీవల హైదరాబాద్ ప్రజలకు ఇచ్చిన పలు హామీలు, గ్రేటర్ మేనిఫెస్టోలో పొందుపరిచిన పలు అంశాలకు సంబంధించి ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. మరోవైపు వచ్చే నెలలో బడ్జెట్ సమావేశాలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. దీంతో బడ్జెట్ సమావేశాల తేదీలను సైతం ఖరారు చేసే అవకాశాలున్నాయి.
ఇక కేబినెట్‌లో ఒకరిద్దరు మంత్రుల శాఖలను మార్చే అంశంపై చర్చ జరగనుంది. తన దగ్గరున్న మున్సిపల్ శాఖను మంత్రి కేటీఆర్‌కు అప్పగించనున్నట్లు గ్రేటర్ ఎన్నికల ప్రచారం సందర్భంగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ప్రకటించిన విషయం విదితమే. మంత్రి కేటీఆర్ ఇప్పటికే పంచాయతీరాజ్‌తో పాటు ఐటీ, సాంకేతిక శాఖకు సారథ్యం వహిస్తున్నారు.
ఆయనకు మున్సిపల్ శాఖ బాధ్యతలు అప్పగిస్తే.. పంచాయతీరాజ్ శాఖను వేరొకరికి అప్పగిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు శాఖల మార్పుపై ఈ కేబినెట్ భేటీలో చర్చ జరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే సమావేశం ఎజెండా వివరాలను అధికారికంగా ప్రకటించలేదు.