కాపులను బీసీల్లో చేర్చేందుకు వేసిన కమిటీని వెంటనే రద్దు చేసి.....
ఎంబీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు కాళప్ప
పంజగుట్ట: కాపులను బీసీల్లో చేర్చేందుకు వేసిన కమిటీని వెంటనే రద్దు చేసి...వారిని బీసీల్లో కలపడం కుదరదని ప్రకటించాలని ఎంబీసీ సంక్షేమ సంఘం (మోస్ట్ బ్యాక్‌వర్డ్ క్లాస్) జాతీయ అధ్యక్షుడు కె.సి. కాళప్ప డిమాండ్ చేశారు. లేని పక్షంలో బీసీల ఉద్యమం ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంఘ ప్రధాన కార్యదర్శి సూర్యారావుతో కలిసి ఆయన మాట్లాడారు. బీసీలకు అన్యాయం జరగకుండా కాపులను ఆ జాబితాలో చేరుస్తానని చంద్రబాబు ప్రకటిస్తున్నారని... అది సాధ్యం కాదని అన్నారు. కాపులు స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి విద్యాపరంగా, రాజకీయంగా, ఆర్థికంగా ముందంజలో ఉన్నారని తెలిపారు. కాపుల కోసం మాట్లాడే నాయకులు అత్యంత వెనుకబడి ఉన్న ఎంబీసీల విషయం ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కూడా కాపు అన్న విషయాన్ని గుర్తు చేశారు. కేవలం ఒక్క కులం కోసం కమిటీ వేసి గడువు ఇవ్వడం చరిత్రలో ఇదే మొదటిసారని కాళప్ప అన్నారు. చంద్రబాబు వేసిన కమిటీకి మరింత సమయం ఇచ్చి కాపులతో పాటు ఎంబీసీల స్థితిగతులపైనా అధ్యయనం చేయాలని కోరారు. సమావేశంలో సంఘ ఉపాధ్యక్షుడు చల్లా వీరేశం, మ్యాంగోజీ పటాన్, నగర అధ్యక్షుడు జగదీష్ కుమార్, రవితేజ, రాఘవేందర్, రెడ్డప్ప, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.