రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహణకు ఎన్నికల సంఘం పచ్చజెండా ఊపింది.
వారంలోగా నోటిఫికేషన్ వెలువడే అవకాశం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహణకు ఎన్నికల సంఘం పచ్చజెండా ఊపింది. వరంగల్ ఉప ఎన్నికల నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ అభ్యంతరం మేరకు నవంబర్‌లో టెట్ దరఖాస్తుల స్వీకరణ నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మరో నోటిఫికేషన్ ఇవ్వాలని సర్కారు భావించినప్పటికీ, స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో మరోసారి అవాంతరం ఏర్పడింది. దీంతో టెట్ నిర్వహణకు అనుమతించాలని కోరుతూ ఎన్నికల కమిషన్‌కు సర్కారు లేఖ రాసింది. దీంతో ఎన్నికల కమిషన్ సానుకూలంగా స్పందించిందని పాఠశాల విద్య డెరైక్టర్ కిషన్ మంగళవారం తెలిపారు.
టెట్‌తో టెన్త్‌కు గండం?
వారంలోగా ప్రభుత్వం టెట్ నోటిఫికేషన్ జారీ చేస్తే పరీక్షను ఫిబ్రవరిలో నిర్వహించే అవకాశాలున్నాయి. అదే జరిగితే పదో తరగతి విద్యార్థులకు శాపంగా పరిణమించనుంది. టెన్త్ విద్యార్థులకు మార్చి 21 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఒకవేళ ఫిబ్రవరిలో టెట్ నిర్వహిస్తే ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న విద్యావలంటీర్లు, ప్రైవేటు పాఠశాలల్లోని టీచర్లు టెట్‌కు సన్నద్ధమయ్యేందుకు ఒకట్రెండు నెలల పాటు సెలవులు పెట్టే అవకాశం ఉంది. ఫలితంగా జనవరి, ఫిబ్రవరి నెలల్లో టీచర్లు లేకపోవడంతో టెన్త్ విద్యార్థులు పునశ్చరణ తరగతులకు ఇబ్బందులు పడతారు.