ఉపాధికి మార్గం వేసే డిజిటల్ శిక్షణ | That is the way the employment of Digital Learning | Sakshi
Sakshi News home page

ఉపాధికి మార్గం వేసే డిజిటల్ శిక్షణ

Published Tue, Oct 28 2014 12:32 AM | Last Updated on Sat, Sep 2 2017 3:28 PM

ఉపాధికి మార్గం వేసే  డిజిటల్ శిక్షణ

ఉపాధికి మార్గం వేసే డిజిటల్ శిక్షణ

టాప్ స్టోరీ
 
ప్రపంచం మొత్తం డిజిటల్ యుగం దిశగా దూసుకెళ్తోంది. అందివస్తున్న సాంకేతికత, చౌక ధరలకే లభ్యమవుతున్న ఎలక్ట్రానిక్స్ గాడ్జెట్స్‌తో నవతరం డిజిటల్ వైపు మొగ్గుచూపుతోంది. రాబోయే కాలంలో విద్య, ఉద్యోగ సంబంధిత అంశాలతోపాటు ప్రభుత్వ పథకాలు, దైనందిన కార్యకలాపాలను అధిక శాతం డిజిటల్ మాధ్యమమే శాసించే అవకాశముంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని అందరూ సాంకేతిక సాధికారత సాధించేలా చూసేందుకు కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న కార్యక్రమమే.. నేషనల్ డిజిటల్ లిటరసీ మిషన్(ఎన్‌డీఎల్‌ఎం).  తద్వారా పట్టణాలు, గ్రామాల్లోని యువత ఐటీ రంగంలో ఉపాధి అవకాశాలను మెరుగుపర్చుకోవచ్చు. 2015 చివరి నాటికల్లా 10 లక్షల మందికి డిజిటల్ శిక్షణ  ఇవ్వాలని ప్రభుత్వం సంకల్పించింది. ఈ నేపథ్యంలో ఈ శిక్షణ ద్వారా ప్రయోజనాలపై ఫోకస్...
 
డిజిటల్ లిటరసీ అంటే.. అందరూ కంప్యూటర్ పరిజ్ఞానం అనుకుంటారు. వాస్తవానికి కావాల్సిన సమాచారాన్ని ఉపయోగించడం, నిక్షిప్తం చేయడం, విశ్లేషించే క్రమంలో డిజిటల్ సాంకేతికత, కమ్యూనికేషన్ టూల్స్/నెట్‌వర్క్‌ను ప్రభావవంతంగా వినియోగించే సామర్థ్యాన్ని కలిగి ఉండడమే డిజిటల్ లిటరసీ. వివరంగా చెప్పాలంటే.. సంప్రదాయ కంప్యూటర్లతోపాటు పీసీ, ల్యాప్‌టాప్ వంటి వాటి వినియోగంపై అవగాహన, కంప్యూటర్‌కు సంబంధించిన ప్రాథమిక పరికరాలపై పనిచేసే నేర్పు, కంప్యూటర్ నెట్‌వర్క్స్, ఈ-మెయిల్, సోషల్ నెట్‌వర్కింగ్ సైట్స్ వంటివి వాడే విధానంపై స్పష్టత, కొన్ని సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్‌ల వినియోగం వంటి అంశాల్లో నైపుణ్యాన్ని కలిగి ఉండటమే డిజిటల్ లిటరసీ.
 
2020 నాటికి..

ప్రపంచ డిజిటల్ ఎకానమీలో భారతదేశం అగ్రభాగాన నిలిచేలా నేషనల్ డిజిటల్ లిటరసీ మిషన్ దోహదపడుతుంది. రూరల్, అర్బన్ ప్రాంతాల ప్రజలు సాంకేతికంగా సాధికారత సాధించేలా చూడడమే దీని ప్రధాన ఉద్దేశం. డిజిటల్ సాంకేతికతతో అమలవుతున్న ప్రభుత్వ పథకాలు, ఈ-గవర్నెన్స్ ప్రాజెక్ట్‌లలో ప్రజలు చురుగ్గా పాల్గొనేలా చూడడం కూడా మరో లక్ష్యం. అంతేకాకుండా దేశంలోని గ్రామ పంచాయితీలను కూడా డిజిటల్ మాధ్యమం ద్వారా అనుసంధానించే కార్యక్రమం సైతం కొనసాగుతోంది. ఈ క్రమంలో 2020 నాటికి ప్రతి కుటుంబంలో కనీసం ఒక్కరైనా డిజిటల్  సంబంధిత అంశాల్లో నైపుణ్యం సాధించేలా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో నేషనల్ డిజిటల్ లిటరసీ మిషన్‌ను ప్రారంభించారు.
 
18 నెలల కాలంలో 10 లక్షల మందికి

దేశంలో వచ్చే 18 నెలల కాలంలో 10 లక్షల మందిని డిజిటల్ టెక్నాలజీలో అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (డైటీ) ఏర్పాటు చేసిన సీఎస్‌సీ-ఎస్‌పీవీ కం పెనీతో ద నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్(నాస్కామ్) ఫౌండేషన్ చేతులు కలిపింది. ఈ మేరకు నేషనల్ డిజిటల్ లిటరసీ మిషన్(ఎన్‌డీఎల్‌ఎం) తొలి దశ లక్ష్యాన్ని సాధించే దిశగా ఇరు సంస్థలూ అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి.
 
పీపీపీ పద్ధతిలో

పబ్లిక్-ప్రైవేట్-పార్ట్‌నర్‌షిప్ (పీపీపీ) పద్ధతిలో ఈ విభిన్న కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ క్రమంలో సీఎస్‌సీ-ఎస్‌పీవీ పాఠ్యాంశాలను రూపొందిస్తుంది. నాస్కామ్ ఫౌండేషన్ దేశవ్యాప్తంగా శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది. దీని కోసం సైయంట్, కాగ్నిజెంట్, గూగుల్, ఇంటెల్ తదితర సంస్థలతో ఫౌండేషన్ ఒప్పందం కుదుర్చుకుంది.
 
 రెండు కేంద్రాలు
 నేషనల్ డిజిటల్ లిటరసీ మిషన్‌లో భాగంగా.. నాస్కామ్.. జెన్సర్ టెక్నాలజీస్, డిజిటల్ ఎంపవర్‌మెంట్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో ఈ ఏడాది హైదరాబాద్, పుణెలలో కేంద్రాలను ఏర్పాటు చేసింది. హైదరాబాద్‌లో ఈ ఏడాది జూలైలో, పుణెలో ఈ నెల ఆరో తేదీన ప్రారంభించిన కేంద్రాల్లో దాదాపు 3 వేల మందికి శిక్షణనిస్తారు. ఇందులో ప్రతి కుటుంబంలో ఒక్కరైనా డిజిటల్ విభాగాల్లో నైపుణ్యం సాధించేలా డిజిటల్ లిటరసీ, జాబ్ ఓరియెంటెడ్ ఇంగ్లిష్ ప్రోగ్రామ్, డీటీపీ, యానిమేషన్ సాఫ్ట్‌వేర్ డిజైన్, బిజినెస్- ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్రోగామ్స్, వివిధ సామాజిక సమస్యలకు సంబంధించి అవగాహన, చర్చా కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఇవి లెక్చర్ సెషన్, గ్రూప్ ప్రాజెక్ట్, మోటివేషన్ సెషన్స్‌గా ఉంటాయి.
 
డిజిటల్ లిటరసీ వీక్


నేషనల్ డిజిటల్ లిటరసీలో భాగంగా నాస్కామ్ తన భాగస్వామ్య కంపెనీలతో కలిసి సంయుక్తంగా డిసెంబర్ 8 నుంచి 12 వరకు డిజిటల్ లిటరసీ వీక్ నిర్వహించనుంది. ఇందులో భాగంగా వాలంటీర్ల రూపంలో ఐటీ ఉద్యోగుల సేవలను వినియోగించుకుని ఈ అంశంపై అవగాహన కల్పించనుంది. 2012లో ప్రారంభించిన ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటివరకు 25వేల మందికి కంప్యూటర్ బేసిక్ స్కిల్స్‌ను నేర్పించారు. నేషనల్ డిజిటల్ లిటరసీ మిషన్ వెబ్‌సైట్: www.ndlm.in
 
సాంఘిక, సాంస్కృతిక, ఆర్థిక ప్రయోజనాలు

‘‘నేషనల్ డిజిటల్ లిటరసీ మిషన్ ద్వారా వివిధ వర్గాల ప్రజలకు డిజిటల్ అక్షరాస్యత (డిజిటల్ లిటరసీ)పై అవగాహన పెంపొందిస్తారు. అంతేకాకుండా కంప్యూటర్ ఆధారితంగా పని చేసే పౌర సేవలను సులువుగా ఉపయోగించుకునే విధంగా శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తారు. ప్రతి కుటుంబం నుంచి కనీసం ఒకరికి కంప్యూటర్ లేదా ఇతర డిజిటల్ సాధనాలను ఉపయోగించే విధానం, ఈ-మెయిల్ పంపడం.. చూసుకోవడం, ఈ-గవర్నెన్స్ ప్రాజెక్ట్‌లో చురుగ్గా పాల్గొనడం, కావాల్సిన సమాచారాన్ని ఇంటర్నెట్ నుంచి పొందే పద్ధతులపై అవగాహన కల్పిస్తారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నేషనల్ డిజిటల్ లిటరసీ మిషన్‌లో భాగమైనందుకు సంతోషంగా ఉంది. ప్రధానంగా యువత, మహిళలను దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. దీని ద్వారా ఆయా వర్గాలకు సాంఘిక, సాంస్కృతిక, ఆర్థిక ప్రయోజనాలు చేకూరతాయి. ఈ కార్యక్రమాన్ని సైయంట్ ఫౌండేషన్ ద్వారా హైదరాబాద్‌లోని కొన్ని ఎంపిక చేసిన పాఠశాలల్లో అమలు చేస్తారు. ఈ శిక్షణ కార్యమ్రాలకు సంబంధించిన మాడ్యూల్స్‌ను నాస్కామ్ ఫౌండేషన్ రూపొందిస్తుంది. ఇందులో ఆరోగ్యం, విద్య, అక్షరాస్యత, జీవన విధానాలకు సంబంధించిన అంశాలు ఉంటాయి’’
     
-డాక్టర్ బి.వి. మోహన్ రెడ్డి, ఫౌండర్ అండ్ ట్రస్టీ,
     సైయంట్ ఫౌండేషన్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement