హైదరాబాద్‌లో పరువుహత్య కలకలం
హైదరాబాద్‌లోనూ పరువు హత్యల సంస్కృతి మొదలైంది. నగరానికి శివార్లలో ప్రశాంతంగా ఉండే వనస్థలిపురం ప్రాంతం తెల్లవారుజామునే ఉలిక్కి పడింది. ఇక్కడి సచివాలయ నగర్ ప్రాంతంలో ఉండే లలిత్ ఆదిత్య (28) అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. గత సంవత్సరం నవంబర్ 9వ తేదీన సుశ్రుత అనే అమ్మాయిని అతడు ప్రేమవివాహం చేసుకున్నాడు. ఈ హత్య వెనుక ఆమె తరఫు బంధువుల హస్తం ఉండొచ్చని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. తమ అమ్మాయిని లలిత్ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకపోవడం వల్లే వాళ్లు ఈ హత్యకు పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు.
గురువారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో కర్ణాటక రిజిస్ట్రేషన్‌తో ఉన్న టాటా సుమోలో వచ్చిన కొంతమంది ముందుగా ఇనుప రాడ్లతో లలిత్‌పై దాడి చేసి తీవ్రంగా కొట్టి, ఆ తర్వాత కత్తులతో పొడిచి చంపారు. గత కొంత కాలంగా లలిత్ ఆదిత్య కుటుంబ సభ్యులకు, అతడి భార్య తరఫు బంధువులకు వివాదం జరుగుతోంది. లలిత్ గుజరాత్‌లోని ఒక ప్రైవేటు కంపెనీలో పనిచేస్తూ తరచు హైదరాబాద్ వచ్చి వెళ్తుంటాడు.
నిందితుడు యశ్వంత్
లలిత్ హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. నిందితుడిని యశ్వంత్గా గుర్తించిన పోలీసులు... అతన్ని అదుపులోకి విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ హత్యను సుపారీ గ్యాంగ్తో చేయించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సుపారీ గ్యాంగ్ కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే వనస్థలిపురం ప్రాంతంలో ఇటీవల కొంత కాలం క్రితం వరకు చైన్ స్నాచింగుల కలకలం ఎక్కువగా ఉంది. అది కొంతవరకు తగ్గిందని అనుకుంటే.. ఈలోపు ఈ హత్య జరిగింది.