పూర్వ విద్యార్థే కాలయముడు | the elderly couple's murder mystery | Sakshi
Sakshi News home page

పూర్వ విద్యార్థే కాలయముడు

Published Sat, Nov 8 2014 12:20 AM | Last Updated on Sat, Sep 2 2017 4:02 PM

the elderly couple's murder mystery

వీడిన వృద్ధదంపతుల హత్య కేసు మిస్టరీ
ఒకరి అరెస్టు : ఆటో, నగలు స్వాధీనం
మరో ఇద్దరి పాత్రపై అనుమానం

 
రాజేంద్రనగర్: సాయిహర్షనగర్ కాలనీలో గురువారం రాత్రి జరిగిన వృద్ధదంపతులు సులోచన, సింహాద్రి హత్యల కేసు మిస్టరీని నార్సింగి పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు.  సులోచన వద్ద విద్యాబుద్ధులు నేర్చుకున్న వ్యక్తే కాలయముడై ప్రాణం తీసినట్టు తేల్చారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని ఆటో, నాలుగు బంగారు గాజులు, ఉంగరం, మూడు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ హత్యలతో మరో ఇద్దరికి సంబంధం ఉండవచ్చనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. నార్సింగి ఠాణాలో శుక్రవారం సాయంత్రం సైబరాబాద్ జాయింట్ కమిషనర్ శశిధర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... మొయినాబాద్‌కు చెందిన మహమూద్ ఫహీముద్దీన్(40) ఆటో డ్రైవర్. ఇతనకి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా, హతురాలు సులోచన గతంలో మొయినాబాద్ ప్రాంతంలో టీచర్‌గా పని చేసింది. ఆ సమయంలో ఆమె వద్ద ఫహీముద్దీన్ చదువుకున్నాడు. తన పూర్వ విద్యార్థి కావడంతో సులోచన ఎక్కడికి వెళ్లాలన్నా ఫహీముద్దీన్‌ను పిలిపించుకొని అతని ఆటోలోనే వెళ్లేది. అతనిపై నమ్మకంతో ఇంట్లోకి రానిచ్చేది. చిన్న చిన్న పనులు కూడా సింహాద్రి దంపతులు ఫహీముద్దీన్‌తో చేయించుకొనేవారు. సులోచన ఇటీవల పదవీ విరమణ చేశారు. వీరింట్లో నగలుతో పాటు రిటైర్‌మెంట్‌కు సంబంధించిన డబ్బు పెద్ద మొత్తంలో ఉండవచ్చని భావించిన ఫహీముద్దీన్ వాటిని దోచుకోవాలని పథకం వేశాడు.  

మొదట భర్త.. ఆపై భార్య హత్య...

గురువారం సాయంత్రం 5.30కి ఇంట్లోకి వచ్చిన ఫహీముద్దీని మొదట బెడ్‌రూమ్‌లో ఉన్న సింహాద్రిని గొంతు నులిమి చంపేశాడు. హతుడి చేతికి ఉన్న ఉంగరాన్ని తీసుకొని షర్ట్ జేబులో వేసుకున్నాడు. సెల్‌ఫోన్‌ను స్విచ్ఛాప్ చేసి ప్యాంట్ జేబులో వేసుకున్నాడు. తర్వాత అక్కడి నుంచి జారుకొనే ప్రయత్నంలో ఉండగా... సులోచన ఇంట్లోకి వచ్చింది. అప్పటికే తలుపు పక్కకు నక్కిన ఫహీముద్దీన్ వెనుకనుంచి ఆమె గొంతు నొక్కి..బెడ్‌రూమ్‌లోకి తీసుకెళ్లి చంపేశాడు.  చేతికి ఉన్న నాలుగు బంగారు గాజులు, మంగళసూత్రాన్ని తీసుకున్నాడు. ఆమె సెల్‌ఫోన్‌ను స్విచ్ఛాప్ చేసి జేబులో వేసుకున్నాడు. అక్కడి నుంచి తన ఆటోలో నేరుగా లంగర్‌హౌస్ ప్రతాప్ థియేటర్ పక్కన ఆటోస్టాండ్‌కు వచ్చి ఆటోను పార్క్ చేశాడు.  పుస్తెలతాడు, గాజులు, రెండు సెల్‌ఫోన్లను ఆటో డిక్కీలో వేసి తాళం వేశాడు.  సింహాద్రి ఉంగరాన్ని మాత్రం తన షర్ట్ జేబులోనే ఉంచుకున్నాడు. ఆటో స్టాండ్ నుంచి తన ఇంటికి వెళ్లిపోయాడు.

సెల్‌ఫోన్ ఆధారంగా ...

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించగా.. బెడ్‌పై ఓ సెల్‌ఫోన్ దొరికింది. హత్య  చేస్తున్న సందర్భంలో జరిగిన పెనుగులాటలో ఇది బెడ్‌పై పడింది. దాని ఆధారంగా ఫహీముద్దీన్‌ను పోలీసులు నిందితుడిగా గుర్తించి పట్టుకున్నారు. అతని సెల్‌ఫోన్ ఔట్‌గోయింగ్, ఇన్‌కమింగ్ కాల్స్‌పై కూడా దృష్టి పెట్టారు.  నిందితుడు కొందరితో ఎక్కువసార్లు మాట్లాడినట్లు గుర్తించారు. వారి పాత్రపై కూడా దర్యాప్తు చేస్తున్నారు.ఇతనికి మరెవెరైనా సహకరించారా అనే కోణంతో పాటు బంధువుల పాత్రపై కూడా దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతానికి ఫహీముద్దీన్‌ను మాత్రమే అరెస్టు చేశామని, మరో ఇద్దరికి సంబంధం ఉండవచ్చని అనుమానిస్తున్నామని సైబరాబాద్ జాయింట్ పోలీస్‌కమిషనర్ శశిధర్‌రెడ్డి వెల్లడించారు. నిందితుడిపై మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూరు ఠాణాలో సెక్షన్ 324 కింద కేసు నమోదై ఉందని పోలీసులు తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో శంషాబాద్ డీసీపీ రమేష్‌నాయుడు, ఎస్‌ఓటీ అడిషనల్ డీసీపీ రాంచంద్రారెడ్డి, ఏసీపీ ముత్యంరెడ్డి, నార్సింగి సీఐ రాంచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. కేసును 24 గంటల్లో ఛేదించినందుకు సిబ్బందిని జాయింట్ కమిషనర్ అభినందించారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement