నిమజ్జనానికి విస్తృత ఏర్పాట్లు | the extensive arrangements to ganesh immersion | Sakshi
Sakshi News home page

నిమజ్జనానికి విస్తృత ఏర్పాట్లు

Published Mon, Sep 12 2016 6:18 PM | Last Updated on Wed, Sep 19 2018 6:31 PM

the extensive arrangements to ganesh immersion

ఈ నెల 15వ తేదీన జరుగనున్న వినాయక నిమజ్జనోత్సవానికి రవాణా, ఆర్టీసీ, రైల్వే విభాగాలు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టాయి. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ఖైరతాబాద్ మహాగణపతి సహా వేల సంఖ్యలో విగ్రహాలను ట్యాంక్‌బండ్‌కు తరలించనున్నారు. వాహనాల రద్దీ, తరలింపులో జాప్యం, తదితర ఇబ్బందుల దష్ట్యా రెండు రోజుల ముందు నుంచే విగ్రహాలను నిమజ్జనానికి తరలించాలని అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు మండప నిర్వాహకులను నిమజ్జనానికి ప్రోత్సహిస్తున్నారు.

 

అందుకనుగుణంగా వివిధ ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో చర్యలు చేపట్టాయి. నీటిపారుదల, రెవిన్యూ, పోలీసు, రవాణా,తదితర విభాగాలు రంగంలోకి దిగాయి. గత ఏడాది 50 వేలకు పైగా విగ్రహాలు నిమజ్జనం కాగా, ఈ ఏడాది ఆ సంఖ్య 60 వేలు దాటవచ్చునని అంచనా వేస్తున్నారు. ఈ మేరకు ప్రధాన నిమజ్జనం జరుగనున్న ట్యాంక్‌బండ్‌తో పాటు, నగరంలోని ఇతర చెరువుల వద్ద మొత్తం 64 భారీ క్రేన్‌లను అందుబాటులో ఉంచేందుకు నీటిపారుదలశాఖ ఏర్పాట్లు పూర్తిచేసింది. అలాగే, విగ్రహాల తరలింపు కోసం భారీ వాహనాలతో పాటు, తేలికపాటి వస్తు రవాణా వాహనాల వరకు 3500 పైగా సమకూర్చేందుకు రవాణాశాఖ చర్యలు చేపట్టింది. భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి నుంచి టోకెన్ తీసుకొని వచ్చే మండపాల నిర్వాహకులకు వాహనాలను అందజేయనున్నట్లు హైదరాబాద్ సంయుక్త రవాణా కమిషనర్ టి.రఘునాథ్ తెలిపారు.


అన్ని చోట్లా అందుబాటులో క్రేన్‌లు...
ట్యాంక్‌బండ్‌కు రెండు వైపులా 34 భారీ క్రేన్‌లను ఈ సారి ఏర్పాటు చేయనున్నారు. వీటితో పాటు, మీరాలం ట్యాంకు, రాజన్నబౌలీల్లో ఒక్కోటి, సరూర్‌నగర్ చెరువులో 7, కూకట్‌పల్లి ఐడీపీఎల్ చెరువులో 4, ప్రగతినగర్ చెరువులో 2, సఫిల్‌గూడ చెరువులో 2, కాప్రా చెరువులో 5, దుర్గం చెరువు-2, అల్వాల్ కొత్త చెరువు-1,పల్లెచెరువు-2,పత్తికుంట చెరువు-1, వెన్నెలగడ్డ చెరువు-1,ఏదులాబాద్, షేక్‌పేట్, సూరారం, జీడిమెట్ల, మేడ్చెల్, శంషాబాద్‌లలో ఒక్కొక్కటి చొప్పున క్రేన్‌లు ఏర్పాటు చేస్తారు. అన్ని విగ్రహాలను హుస్సేన్‌సాగర్‌కే తరలించకుండా సమీపంలోని చెరువుల్లో నిమజ్జనం చేయాలని అధికారులు సూచిస్తున్నారు.


అందుబాటులో 3500 వాహనాలు....
ప్రధాన నిమజ్జన వేడుకలు జరుగనున్న 15వ తేదీన విగ్రహాల తరలింపు కోసం ఇప్పటికే 3500 వాహనాలను సిద్ధం చేశారు. డిమాండ్ మేరకు మరిన్ని వాహనాలను సమకూర్చనున్నట్లు జేటీసీ తెలిపారు. ఆ రోజు ఉదయం 6 గంటల నుంచే వాహనాలను మండపాల నిర్వాహకులకు అందజేస్తారు. ఇందుకోసం వారు భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి నుంచి టోకెన్ తీసుకోవలసి ఉంటుంది. నాగోల్, మలక్‌పేట్, టోలీచౌకి, జూపార్కు,ఆరాంఘర్,నెక్లెస్‌రోడ్డు, తిరుమలగిరి, మేడ్చెల్, సుచిత్ర, గచ్చిబౌలి, ఇబ్రహీంపట్నం, పటాన్‌చెరు, అత్తాపూర్, తదితర కేంద్రాల్లో వాహనాలను అందుబాటులో ఉంచుతారు. మండపాల నిర్వాహకులు తమ సమీపంలోని ప్రాంతీయ రవాణా అధికారుల సహాయంతో వాహనాలను అద్దెకు తీసుకోవచ్చు. భారీ ట్రేలర్‌లకు రూ.20 వేలు, లారీలకు రూ.4,500, మధ్యతరహా వాహనాలకు రూ.5,500, టాటాఏసీ వంటి వాహనాలకు రూ.1000 చొప్పున అద్దె ఉంటుంది. ఇవి కాకుండా ట్రేలర్‌లు మినహా ఇతర వాహనాలకు నిర్వాహకులే డీజిల్ సమకూర్చుకోవాలి. డ్రైవర్, క్లీనర్‌లకు రూ.500 చొప్పున బత్తా చెల్లించాలి.


ఎంఎంటీఎస్ ప్రత్యేక రైళ్లు...
నిమజ్జనం సందర్భంగా ప్రయాణికుల రద్దీని దష్టిలో ఉంచుకొని 15వ తేదీ రాత్ర 10 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 4 గంటల వరకు ఎంఎంటీఎస్ ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీనియర్ పీఆర్వో షకీల్ అహ్మద్ తెలిపారు. నాంపల్లి-లింగంపల్లి, సికింద్రాబాద్-నాంపల్లి, లింగంపల్లి-నాంపల్లి,లింగంపల్లి-ఫలక్‌నుమా, ఫలక్‌నుమా-సికింద్రాబాద్‌ల మధ్య ప్రతి గంటకు ఒక ట్రై యిన్ అందుబాటులో ఉంటుంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement