
కొలిక్కి వచ్చిన ఫీజుల పంచాయితీ
ఏపీ, తెలంగాణల మధ్య కుదిరిన అంగీకారం
సాక్షి, హైదరాబాద్: ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకంలో భాగంగా ఏపీ, తెలంగాణ విద్యార్థులకు సంబంధించిన ఫీజులు, స్కాలర్‌షిప్‌ల సమస్య కొలిక్కి వచ్చింది. రాష్ట్ర విభజన అనంతరం ఏపీ విద్యార్థులు తెలంగాణలో, తెలంగాణ విద్యార్థులు ఏపీలో చదువుతుంటే వారి ఫీజులను ఎవరు చెల్లించాలనే దానిపై అనిశ్చితి ఏర్పడింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో రాజ్యాంగంలోని ఆర్టికల్ 371 (డీ)కు అనుగుణంగా ఏ విద్యార్థి అయినా స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకున్న ఏడాదికి ముందు ఏడేళ్లలో వరుసగా నాలుగేళ్ల పాటు ఏ రాష్ట్ర పరిధి లో చదివితే అక్కడే స్థానిక విద్యార్థిగా ఫీజు రీయింబర్స్‌మెంట్ పొందే అర్హత లభిస్తుంది. ఈ మేరకు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు తాజాగా ఒక అంగీకారానికి వచ్చాయి. రాష్ట్రం ఏర్పడ్డాక 2014-15, 2015-16 విద్యాసంవత్సరాలకు సంబంధించి ఫీజులు, స్కాలర్‌షిప్‌ల చెల్లింపు దీని ప్రాతిపదికనే చేయాలనే ఒక నిర్ణయానికి వచ్చాయి.
తేలని పాత బకాయిల లెక్కలు
ఫీజుల బకాయిల పంచాయితీకి మాత్రం ఇంకా తెరపడే సూచనలు కనిపించడం లేదు. మొత్తం ఫీజు బకాయిలకు సంబంధించి పూర్తి స్పష్టత వచ్చాక మొత్తం వివరాలను క్రోడీకరించి రాష్ట్ర విభజన చట్టానికి అనుగుణంగా ఏపీ 58 : తెలంగాణ 42 నిష్పత్తిలో ఫీజుల కోసం అయిన మొత్తాన్ని పంచుకోవాలి. కాగా తెలంగాణ ఏర్పడ్డాక ప్రధానంగా ఏపీలోని ఉత్తరాంధ్ర, ఆయా ప్రాంతాలకు పరిమితమైన తూర్పుకాపు, కాళింగ, కొప్పుల వెలమ, శెట్టిబలిజ తదితరాలను కలిపి మొత్తం 26 కులాలను రాష్ట్ర బీసీ కులాల జాబితా నుంచి ప్రభుత్వం తొలగించింది. ఈ విద్యార్థులకు 2014-15కు సంబంధించిన ఫీజుల బకాయిలనే(రెన్యూవల్) చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది.